Operation Kagar | నంబాల ఎన్కౌంటర్ జరిగిందిలా.. పాయింట్ టూ పాయింట్ వివరించిన మావోయిస్టు లేఖ

విధాత ప్రత్యేక ప్రతినిధి:
Operation Kagar | తమ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్‌ను పోలీసులు బలగాలు పట్టుకొని, కాల్చి చంపాయిని సీపీఐ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. నారాయణపూర్ జిల్లా మాడ్ ప్రాంతంలోని గుండెకోట్ అడవిలో 2025 మే 21న ఆయన చనిపోయారని ధృవీకరించింది. ఆయనతోపాటు, ఆ ఎన్కౌంటర్లో చనిపోయిన అమరవీరుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది.
ఎన్కౌంటర్.. అంతకు ముందు జరిగింది ఇదీ..
దండకారణ్యం కమిటీ విడుదల చేసినట్టు చెబుతున్న ప్రకటనలో ఎన్కౌంటర్ జరిగిన తీరు తెన్నులను వివరించారు. తమ పార్టీ ప్రధాన కార్యదర్శి బీఆర్ దాదా (బసవరాజ్) మాడ్ ప్రాంతంలో ఉన్నారని పోలీసులకు ముందే తెలుసని పేర్కొన్నారు. మాడ్ ప్రాంతంలోని వివిధ విభాగాలకు చెందిన కొందరు పోలీసులకు లొంగిపోయారని, వారు ఎప్పటికప్పుడు తమ రహస్యాలను వారికి చేరవేస్తూ వచ్చారని పేర్కొన్నారు. ‘కామ్రేడ్ బీఆర్ దాదాను లక్ష్యంగా చేసుకుని జనవరి, మార్చిలో రెండు భారీ ఆపరేషన్లు నిర్వహించారు. అవి సక్సెస్ కాలేదు. వాటి తర్వాత ఇటీవలి ఒకటిన్నర నెలలుగా ఆ యూనిట్ నుంచి ఆరుగురు శత్రువు ముందు లొంగిపోయారు. దాదా భద్రతలో ప్రధాన బాధ్యత వహించిన సీవైపీసీ సభ్యుడు కూడా వారిలో ఉన్నాడు. ఈలోపే మాడ్ ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన యునిఫైడ్ కమాండ్ సభ్యుడు కూడా ద్రోహిగా మారాడు. ఇది పోలీసుల పనిని సులభం చేసింది. ఈ వ్యక్తుల కారణంగా పార్టీ పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
మే 17న మొదలు..
‘పోలీసులు పక్కా ప్రణాళిక ప్రకారం.. మే 17నుంచి నారాయణపూర్, కొండగావ్ డీఆర్జీ సిబ్బందిని ఓర్చా నుంచి మోహరిస్తూ వచ్చారు. 18న, దంతేవాడ, బీజాపూర్, బస్తర్ ఫైటర్స్ నుండి డీఆర్జీ సిబ్బందిలోకి చేరారు. 19వ తేదీ ఉదయం 9 గంటలకు, వారు మా యూనిట్ సమీపానికి వచ్చారు. ఆపరేషన్‌కు ఒక రోజు ముందు, అంటే 17న మా యూనిట్‌లోని ఒక పీపీసీ సభ్యుడు తన భార్యతో సహా పారిపోయాడు. దానితో మా శిబిరాన్ని మార్చాం. 19వ తేదీ ఉదయం పోలీసు దళాలు సమీప గ్రామానికి చేరాయన్న వార్త అందింది. దీంతో మేం అక్కడి నుంచి కూడా బయల్దేరాం. మార్గమధ్యంలో ఉదయం పది గంటలకు పోలీసులతో మొదటి ఎన్కౌంటర్ చోటు చేసుకున్నది. ఆ తర్వాత రోజంతా ఐదు ఎన్కౌంటర్లు జరిగాయి. వీటిలో ఎవరికీ ఎలాంటి హానీ కలుగలేదు. భద్రతా బలగాలు చుట్టుముట్టిన ప్రాంతం నుంచి బయట పడటానికి 20వ తేదీ రోజంతా ప్రయత్నించారు. కానీ.. వీలు కాలేదు. 20వ తేదీ రాత్రి వేల మందితో కూడిన పోలీసుల బలగాలు మమ్మల్ని సమీపం నుంచి చుట్టుముట్టాయి. 21వ తేదీ ఉదయం చిట్టచివరి ఆపరేషన్ జరిగింది. ఒక వైపు అత్యాధునిక ఆయుధాలతో వేలాది మంది ఉన్నారు. వారికి ఆహారం, నీటి సదుపాయాన్ని హెలికాప్టర్లు ఉపయోగించి కల్పించారు. మరోవైపు దేశ సామాజిక, ఆర్థిక సమస్యలపై పోరాడుతున్న విప్లవకారులు 35 మంది మాత్రమే ఉన్నారు. అప్పటికే 60 గంటల నుంచి తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా లేక ఆకలితో ఉన్నారు. ఆ సమయంలో ఇరు పక్షాల మధ్య యుద్ధం మొదలైంది. మా సహచరులు బీఆర్ దాదాను సురక్షిత ప్రదేశంలో ఉంచి.. బలగాలను ప్రతిఘటించారు. మొదటి రౌండ్లో డీఆర్జీకి చెందిన కోట్లు రామ్ చనిపోయాడు. ఆ తర్వాత కొంతసేపు ఎవరూ ముందుకు రావడానికి సాహసించలేదు. తర్వాత మళ్లీ కాల్పులు ప్రారంభమయ్యాయి. ప్రతిఘటనను చురుకుగా నడిపిస్తూ కమాండర్ చందన్ తొలి అమరుడయ్యాడు. చాలామంది సైనికులు గాయపడ్డారు. తమ ఒక బృందం ముందుకు సాగి వారి ముట్టడిని ఛేదించగలిగినా.. భారీ కాల్పుల నేపథ్యంలో మిగిలినవారు ఆ మార్గం నుంచీ తప్పించుకోలేక పోయారు. ముట్టడిని ఛేదించిన తర్వాత, ఒక బృందం ప్రధాన బృందం నుండి విడిపోయింది. ప్రతి ఒక్కరూ తమ నాయకత్వాన్ని కాపాడే బాధ్యతను చాలా బాగా నిర్వర్తించారు, దాదాకు చిన్న దెబ్బకూడా తగలనీయలేదు. కానీ.. అందరినీ చంపిన తర్వాత.. పోలీసులు బీఆర్ దాదాను సజీవంగా పట్టుకొని కాల్చి చంపారు. మా సహచరులు 35 మందిలో 28మంది అమరులయ్యారు. ఏడుగురు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు’ అని మావోయిస్టులు ఆ లేఖలో వివరించారు. ఈ ప్రాంతంలో మావోయిస్టుల నుంచి ఏకపక్ష కాల్పుల విరమణ ఉన్నదని ఆ లేఖలో తెలిపారు. శాంతి చర్చలకు అనువైన వాతావరణం కల్పించేందుకు బీఆర్ దాదా సూచన మేరకు 40 రోజులుగా ఇక్కడ ఎలాంటి సాయుధ చర్యలూ తీసుకోలేదని ప్రస్తావించారు. ఇలాంటి సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా ఇంత పెద్ద దాడిని నిర్వహించి, తమ నాయకత్వానని హత్య చేశాయని ఆరోపించారు.
ఇదీ బసవరాజ్ చివరి మాట
ఏప్రిల్, మే నెలల్లో భారీ ఎన్కౌంటర్లు ఉంటాయని తాము ముందే ఊహించామని మావోయిస్టు పార్టీ లేఖ తెలిపింది. కానీ.. సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు బీఆర్ దాదా సిద్దంగా లేరని, తన భద్రత కంటే యువ నాయకత్వం భద్రత ముఖ్యమని చెప్పారని, తమ దగ్గరుండి తమకు మార్గదర్శనం చేశారని మావోయిస్టు లేఖ పేర్కొన్నది. అమరవీరుల ప్రేరణతో, విప్లవోద్యమం అనేక రెట్లు ఎక్కువ బలంతో ఉద్భవిస్తుందని తాను నమ్ముతున్నానని చెప్పారని తెలిపింది. ఆపరేషన్ కగార్ పేరిట జరుగుతున్న ఈ ఊచకోత వెనుక ప్రభుత్వ అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని దేశ ప్రజలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి చేసింది. పాకిస్తాన్‌తో చర్చలకు సిద్ధపడిన భారత ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలకు ఎందుకు సిద్ధపడటం లేదని ప్రశ్నించింది. సాధారణంగా మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి ప్రకటనలు విడుదల చేస్తుంటారు. కానీ.. ఈసారి మాత్రం పేరు లేకుండా.. దండకార్యణ్య కమిటీ పేరిట వెలువడటం గమనార్హం.