Teenmar Mallanna: కాంగ్రెస్‌ను గెలిపించిందే నేను.. దేనికీ భ‌యపడ‌ను!

  • By: sr    news    Mar 05, 2025 7:49 PM IST
Teenmar Mallanna: కాంగ్రెస్‌ను గెలిపించిందే నేను.. దేనికీ భ‌యపడ‌ను!
  • అగ్ర‌వ‌ర్ణాల‌కే భ‌ద్ర‌త‌
  • కాంగ్రెస్‌లో బీసీల‌కు భ‌ద‌త్ర లేదు
  • కాంగ్రెస్‌ను గెలిపించిందే నేను
  • క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు బీసీల‌పైనేనా
  • చ‌ర్య‌ల‌కు భ‌య‌ప‌డం- పోరాటం చేస్తం
  • కాంగ్రెస్ బ‌హిష్కృత నేత తీన్మార్ మ‌ల్ల‌న్న

Teenmar Mallanna:

విధాతః కాంగ్రెస్ పార్టీ లో అగ్ర వర్ణాలకు మాత్రమే అంతర్గత భద్రత ఉంటుంది కానీ బీసీల‌కు భ‌ద్ర‌త లేద‌ని కాంగ్రెస్ బ‌హిష్కృత నేత ఎమ్మెల్సీ చింత పండు న‌వీన్ అలియాస్‌ తీన్మార్ మ‌ల్ల‌న్న (Teenmar Mallanna)  అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పీఆర్వోగా ప‌నిచేసిన గ‌టిక విజ‌య్ కుమార్ తో క‌లిసి ఆయ‌న బుధ‌వారం ప్రెస్ క్ల‌బ్‌లో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా తీన్మార్ మ‌ల్ల‌న్న‌ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పైనే మీరు చర్యలు తీసుకుంటారా అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం పై పోరాటం చేసిన వారిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పునాది వేసిన వారిలో నా పాత్ర కీలకమ‌ని తీన్మార్ మ‌ల్ల‌న్న చెప్పారు. మీ షోకాజ్ నోటీసులకు ఇక్కడ బయపడే వాడిని కాదు. ధైర్యం గల బీసీ బిడ్డనని అన్నారు. ఖ‌చ్చితంగా రాహుల్ గాంధీ ఆశయాలు కొనసాగించడానికి పాటు పడతానని చెప్పారు. ఈ రోజు తీన్మార్ మల్లన్న కు టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఇలాగే నా మాట్లాడేది అని అంటున్నారని, ఎవరండి నన్ను గెలిపించింది అని ప్ర‌శ్నించారు. నల్గొండ వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులకు అండగా ఉండి నేను గెలిపించుకున్నాన‌ని చెప్పారు. మహబూబ్ నగర్ లో మరి కాంగ్రెస్ అభ్యర్థిని మీరు ఎందుకు గెలిపించుకోలేక పోయారని అడిగారు.

కాంగ్రెస్ ను ఖ‌తం చేసే ప్ర‌య‌త్నం

కాంగ్రెస్ పార్టీ ని ఖతం చేసే ప్రయత్నం జరుగుతుందనిఈ రోజు అందరికి అర్ధం అవుతుందని తీన్మార్ మ‌ల్ల‌న్న చెప్పారు. నన్ను సస్పెండ్ చేస్తే బాధ,భయం నాకు ఏమి లేదన్నారు. ఈ రోజు జరుగుతున్న ఎమ్ ఎల్ సి ఎన్నికలను చూస్తే బీసీ ల శక్తి ఏంటో తెలుస్తుందన్నారు. మేమంతా కలిసి గెలిపించిన కాంగ్రెస్ పార్టీ ని మీరు ఖతం చేయడానికి చూస్తున్నారన్నారు. బీసీ లకు అన్యాయం చేయడానికి చూస్తే ఊరుకోమని హెచ్చ‌రించారు. రేపటి నుండి రోజు ఒక కార్యాచరణ తీసుకొని బీసీ లకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు. నేను ఏ పార్టీ లోకి వెళ్లడం లేద‌ని కొత్త‌ పార్టీ పెట్టడం మీద ద్రుష్టి పెట్టలేదన్నారు. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ లో కేవలం బీసీ కుల గణన చేస్తామన్న అంశానికి మాత్రమే ఆకర్షతుడయి చేరడం జరిగిందన్నారు. తాను బీసీ వాదానికి కట్టుబడి మాత్రమే నేను పని చేస్తాన‌న్నారు.

నా స‌స్పెన్స్ కు కార‌ణం రేవంత్‌

“మీ సస్పెన్షన్ ఆర్డర్ అందింది.. బీసీ లపై మాత్రమే చర్యలు తీసుకుంటామంటే భయపడే ప్రసక్తే లేదు… పోరాట‌మే చేస్తాం” అని తీన్మార్ మ‌ల్ల‌న్న స్పష్టం చేశారు. అయితే నేను చేసిన తప్పు ఏమిటో చెప్పాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చాలా రోజుల నుండి నన్ను సస్పెండ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇక బీసీ ఉద్యమాన్ని ఇక్కడి నుండే నడిపించడానికి మీరే బీజం వేశారని కాంగ్రెస్ నేత‌ల నుద్దేశించి అన్నారు. చాలా రోజుల నుండి బి సి బిడ్డలు నా సస్పెన్షన్ ఆర్డర్ పై స్పందించమని అడుగుతున్నారని, అందుకే తాను ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసిన‌ట్లు తీన్మార్ మ‌ల్ల‌న్న చెప్పారు. బీసీలు మ‌లి ద‌శ ఉద్య‌మాన్ని న‌డిపిన విష‌యాన్ని రేవంత్ రెడ్డి గ్ర‌హించాల‌న్నారు.

వివ‌క్ష‌తో కూడుకున్న‌త‌ప్పుడు స‌ర్వే

తప్పుడు సర్వే ప్రతులను కాల పెట్టడం తప్పు అనిపిస్తే అదే తప్పు ను నేను మళ్ళీ చేస్తాన‌ని తీన్మార్ మ‌ల్ల‌న్న స్ప‌ష్టం చేశారు. అది పూర్తిగా వివక్ష తో కూడుకున్నతప్పుడు సర్వే కాబట్టి అలా చేశానన్నారు. కోటి పదిహేను లక్షల ఇండ్లు ఉంటే తెలంగాణ జనాభా ఎలా తగ్గిందో ముఖ్య మంత్రి చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఈ డబ్ల్యూ కోట ప్రకారం రిజర్వేషన్ మీ ఇష్టం వొచ్చినట్టు ఇస్తే ఆ అన్యాయాన్ని కచ్చితంగా ప్రశ్నిస్తామన్నారు. మీ సర్వే తప్పు అని నిరూపించడానికి ఎక్కడికయినా వ‌చ్చి నిరూపిస్తాన‌న్నారు. తెలంగాణ గడ్డ ఎంతో మంది నాయకుల ను చూసిందని, బి పి మండల్ లాంటి మంచి చేసిన వారిని, అన్యాయం చేసిన వారిని గుర్తు పెట్టుకుంటుందన్నారు.

రెడ్లు, అగ్ర‌కులాల‌పై చ‌ర్య‌లు తీసుకోరా!

కాంగ్రెస్ పార్టీలో రెడ్లు, అగ్రకులాల వాళ్లు ఎలాంటి క్రమశిక్షణ ఉల్లంఘన పనులు చేసినా చర్యలు తీసుకోరని స్వంత పార్టీపై కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత మ‌ధు యాష్కీ గౌడ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. బుధ‌వారం ఆయన త‌న‌ను క‌లిసిన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డే క్రమశిక్షణ తప్పాడన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే మేఘా రెడ్డిపై బహిరంగంగా ఆరోపణలు చేసిన క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిపై క్రమశిక్షణ చర్యలు ఉండవా? అని ప్ర‌శ్నించారు. కులగణన మీద బీసీ నాయకులతో మీటింగ్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఆ స‌మావేశానికి జానారెడ్డిని, కేశవరావును పిలిచారు కానీ బీసీ సీనియ‌ర్‌ నాయకుడినైనా నన్ను పిల‌వలేద‌ని మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు.

తీన్మార్ మల్లన్న ,రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని, రేవంత్ పీసీసీ చీఫ్ కావాలని,సీఎం కావాలని అత్యంత బలంగా కోరుకున్న వ్య‌క్త‌ని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో పార్టీ మరింత బలహీన పడుతుంది..అందుకే నాడు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ అధ్యక్ష పీఠం రేవంత్ రెడ్డికి ఇవ్వాలని బలంగా త‌న వాదం వినిపించాడ‌ని అన్నారు.
తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడినా వివరణ రేవంత్ రెడ్డి ఇవ్వాలని అన్నారు.