Langurs | ఆ కొండముచ్చులు.. గుండెలు పిండేశాయి

Langurs |  విధాత : జంతువులు కూడా తమ బిడ్డల పట్ల అవ్యాజమైన ప్రేమను ప్రదర్శిస్తుంటాయి. అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల్లో కనిపించే దృశ్యాలు ఎంతో హృద్యంగా ఉండి.. మనసును పిండేస్తుంటాయి. వివిధ రకాల సందర్భాల్లో జంతువుల ప్రవర్తన ఎలా ఉంటుందో పరిశీలించేందుకు అవకాశం వస్తే శాస్త్రవేత్తలు, అధ్యయనకారులు అస్సలు వదిలి పెట్టరు. అయితే.. ఆ ఘటనలు ఎవరైనా రికార్డు చేసి ఉంటే తప్ప దొరకవు. అందుకే కృత్రిమంగా అటువంటి పరిస్థితులను సృష్టించి వాటి ప్రవర్తనను అధ్యయనం చేయాలని […]

  • By: Somu    news    Apr 20, 2023 4:00 AM IST
Langurs | ఆ కొండముచ్చులు.. గుండెలు పిండేశాయి

Langurs |

విధాత : జంతువులు కూడా తమ బిడ్డల పట్ల అవ్యాజమైన ప్రేమను ప్రదర్శిస్తుంటాయి. అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల్లో కనిపించే దృశ్యాలు ఎంతో హృద్యంగా ఉండి.. మనసును పిండేస్తుంటాయి. వివిధ రకాల సందర్భాల్లో జంతువుల ప్రవర్తన ఎలా ఉంటుందో పరిశీలించేందుకు అవకాశం వస్తే శాస్త్రవేత్తలు, అధ్యయనకారులు అస్సలు వదిలి పెట్టరు.

అయితే.. ఆ ఘటనలు ఎవరైనా రికార్డు చేసి ఉంటే తప్ప దొరకవు. అందుకే కృత్రిమంగా అటువంటి పరిస్థితులను సృష్టించి వాటి ప్రవర్తనను అధ్యయనం చేయాలని భావించారు శాస్త్రవేత్తలు. ఈ క్రమంలో ఒక పిల్ల కొండముచ్చు చనిపోయి ఉన్నట్టుగా బొమ్మను తయారు చేసి.. కొండముచ్చుల (Langurs) గుంపు సమీపంలో ఉంచారు. ఆ సమయంలో కొండముచ్చుల భావోద్వేగం.. గుండెలు పిండేసేలా ఉన్నది.

ఈ వీడియో బీబీసీ స్పై ఇన్‌ ది వరల్డ్‌ పేరుతో రూపొంచిన డాక్యుమెంటరీలో భాగం. అడవిలో కొండముచ్చులు ఎలా వ్యవహరిస్తుంటాయన్న విషయంలో అధ్యయనానికి దీన్ని చిత్రీకరించారు. జంతువులను పోలినట్టుండేలా ఎలక్ట్రానిక్‌ పరికరాలను రూపొందించి, వాటికి రహస్య కెమెరాలు తగిలించి ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. ఇందులో ఒక క్లిప్పింగ్‌ నెటిజన్ల మనసు దోచింది.

చనిపోయినట్టు ఉన్న ఒక బొమ్మ పిల్ల కొండముచ్చును ఈ ప్రయోగానికి ఎంచుకున్నారు. నిజానికి ఇదొక రోబోటిక్‌ స్పై. దీనిని చూసిన తర్వాత కొండముచ్చులు ఎలాంటి భావోద్వేగాలను ప్రదర్శిస్తాయో చిత్రీకరించారు. నిర్జీవంగా పడి ఉన్న పిల్లను (అది బొమ్మ అని తెలియదు కదా) ఒక కొండముచ్చు దానిని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంటుంది.

ఆ తర్వాత నిర్జీవంగా పడి ఉన్న బొమ్మ ముచ్చు.. మధ్యలో ఉంటుంది.. దాని చుట్టూ పెద్ద కొండముచ్చులు చేరుతాయి. ఒక చిన్న కొండముచ్చు దగ్గరకు వస్తే.. మరొక కొండముచ్చు దానిని ఓదార్చుతుంది. అక్కడ ఉన్న కొండముచ్చులన్నీ నిజంగానే తమ గుంపులో ఒక చిన్నారి చనిపోయిందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తుంది.

‘నేచర్‌ ఈజ్‌ ఎమేజింగ్‌’ (Nature Is Amazing) అనే ట్విట్టర్‌ అక్కౌంట్‌లో పోస్టు చేసిన ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇటువంటి ప్రతిస్పందన వాటి నుంచి చూడటం బాగుంది కానీ.. వాటిని ఇలా విషాదంలో ముంచడం తగదు’ అని ఒక నెటిజన్‌ వ్యాఖ్యానించాడు.