Pawan Kalyan: మున్నూరుకాపు.. వయా పవన్ కల్యాణ్.. టార్గెట్ తెలంగాణ!

(విధాత ప్రత్యేకం)
BJP Future plans : తెలంగాణలో 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజెపీ జెండా ఎగురవేసేందుకు ఇప్పటినుంచే వ్యూహరచన జరుగుతున్నదా? తెలంగాణలో రాజకీయంగా బలంగా ఉన్న మున్నూరు కాపులను తమవైపు తిప్పుకొనేందుకు బీజెపీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందా? ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత కే పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు బీజేపీ ఈ బాధ్యతను అప్పగించిందా? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఈ విషయంలో పవన్‌కు ఏపీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, బీజేపీ ఢిల్లీ పెద్దలు అండగా ఉన్నారనే రాజకీయ చర్చ ఊపందుకున్నది. బీఆరెస్‌ను రాజకీయంగా కోలుకోని విధంగా దెబ్బతీయడం, కాంగ్రెస్ పార్టీని అధికారంలోంచి దించడం.. ఈ రెండు టార్గెట్లను ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ఖతం అన్న పద్ధతిలో ఈ వ్యూహాన్ని రచిస్తున్నారని అంటున్నారు.
తెలంగాణ క్యాబినెట్‌లో మున్నూరు కాపులకు ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ కులం నాయకుల్లో అంతర్గతంగా మథనం మొదలైందని అంటున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి పద్నాలుగు నెలలు దాటుతున్నా క్యాబినెట్‌ను విస్తరించలేదు. అదిగో ఇదిగో అంటూ ఆరు నెలలుగా వాయిదా పడుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం మాజీ రాజ్యసభ సభ్యుడు వీ హన్మంతరావు నివాసంలో మున్నూరు కాపు కులానికి చెందిన వివిధ పార్టీల నాయకులు హాజరై రాష్ట్ర రాజకీయ పరిస్థితులను సుదీర్ఘంగా చర్చించారన్న వార్త రాష్ట్రంలో సంచలనం రేపింది. బీసీలలో బలమైన వర్గమైన తమను పట్టించుకోకపోవడం సరికాదనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తున్నది. సమావేశానికి ముందు హన్మంతరావు ఏపీకి వెళ్లి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం కే పవన్ కళ్యాణ్‌ను కలిశారు. కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని కోరేందుకు హన్మంతరావు వెళ్లినట్టు చెబుతున్నా.. ఈ భేటీలో తెలంగాణ రాజకీయాలపైనే కీలకంగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించాలని తీర్మానం చేశారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపులను నిర్లక్ష్యం చేస్తున్నదనే భావన ఆ కులం నాయకులలో బలపడింది. మున్నూరు కాపుల కోటాలో కొండా సురేఖకు ప్రాతినిధ్యం కల్పించామని చెబుతున్నప్పటికీ, ఆ కులం నాయకులు అంగీకరించడం లేదు. పద్మశాలీ కులానికి చెందిన ఆమె మున్నూరు కాపు కులానికి చెందిన కొండా మురళీధర్ రావును ప్రేమ వివాహం చేసుకున్నారని, ఆమెను తమ కులం కింద ఎలా పరిగణిస్తారనే వాదనను తెరమీదకు తెస్తున్నారు. ఆమె ముమ్మాటికీ పద్మశాలీ కులానికి చెందినవారని, మున్నూరు కాపుల కోటా కిందకు రారని అంటున్నారు. పార్టీలో చేరితే తగిన ప్రాతినిధ్యం లభిస్తుందనే గంపెడాశతో ఉన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా కూల్చివేతలు చేపట్టిన హైడ్రాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును మీడియా ముందు విమర్శించారు. ఈయన కూడా హైదరాబాద్‌కు చెందిన బలమైన మున్నూరు కాపు నాయకుడు. ఈ పరిస్థితులను గమనిస్తే ఏపీలోని కాపు కులం నాయకులు, తెలంగాణలోని మున్నూరు కాపు నాయకులు ఏకమై రాజకీయంగా మరింత పట్టు పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారనేది అర్థమవుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా తో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ క్రమంలోనే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బలపడేందుకు, తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జెండా ఎగురవేసేందుకు వ్యూహాలకు పదునుపెట్టిందని అంటున్నారు.
మాజీ కేంద్ర మంత్రి, నటుడు చిరంజీవితో పాటు మరికొందరు ప్రముఖులకు పద్మాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయా రంగాలలో వారి సేవలను గుర్తించి ఎంపిక చేసింది. ఏపీతో పాటు తెలంగాణలో కాపు, మున్నూరు కాపులను బీజేపీ తమవైపు తిప్పుకొనేందుకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కులాలకు రెండు రాష్ట్రాలలో బలమైన ఓటు బ్యాంకు తో పాటు, గెలుపు ఓటములను శాసించే స్థితి ఉందనేది అందరికీ తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా తెలంగాణలో బలపడడంతో పాటు తెలుగుదేశం ఓటర్లను తమవైపునకు తిప్పుకోవాలనే దీర్ఘకాలిక లక్ష్యం ఉందనే చర్చ నడుస్తున్నది. నేరుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో ప్రవేశిస్తే అంతగా ప్రభావం ఉండదు. ఇప్పటికే ఆ పార్టీపై ఆంధ్రా పార్టీ అనే ముద్ర ఉంది. ఆ ముద్ర నుంచి బయటపడటం ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం. అయితే తెలుగుదేశానికి తెలంగాణలో ఇప్పటికీ స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది. వారు కూడా కలిస్తే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయం జెండా ఎగురవేయచ్చనేది బీజేపీ అధినాయకత్వం ఒక అంచనాకు వచ్చిందని సమాచారం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ ఎపిసోడ్ కూడా మరింత కాక పెంచింది. తమ కులానికి చెందిన ఎమ్మెల్సీని పార్టీ నుంచి సస్పెన్షన్ ను వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవన్నీ గమనిస్తే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు బీజెపీ గెలుపునకు సంపూర్ణ సహకారం ఇచ్చే పరిస్థితులు కన్పిస్తున్నాయి.