BCCI: స్టార్‌గిరికి చెక్.. రోహిత్, కోహ్లీకి ఇక కష్టకాలమే! బీసీసీఐ సంచలన నిర్ణయం

విధాత: టీమిండియాలో సీనియర్ క్రికెటర్లకు రానున్నది ఇక గడ్డు కాలమే. ముఖ్యంగా రోహిత్, విరాట్ వంటి సీనియర్స్ బ్యాటింగ్ ఫాం కోల్పోయి తరుచూ విఫలమవడం, దాని ప్రభావం జట్టపై పడుతుండడంతో జట్టులో వారి స్థానాల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం. టీమిండియా ఆడిన గత 8 టెస్టుల్లో ఆరు పరాజయాలు నమోదు కావడంతో బీసీసీఐ తీవ్ర ఆగ్రహంతో ఉంది.. దీంతో టీమిండియాలో పెరిగిన స్టార్ కల్చర్‌కు ముగింపు పలికేందుకు, ఇకపై ప్లేయర్లు ఎవరికీ మినహాయింపులు ఇవ్వకుండా ఉండేందుకు దిద్దుబాటు చర్యలు పూనుకున్నట్లుగా కథనాలు వస్తున్నాయి.
అంతేకాదు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమితో జట్టు ప్రక్షాళన చేసేందుకు ఇదే సరైన సమయంగా బీసీసీఐ భావిస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు ఆ ప్రక్షాళన కూడా సీనియర్లైన రోహిత్, కోహ్లీతోనే ప్రారంభించనున్నట్లు ప్రచారం ఊపందుకుంది. బీసీసీఐ కొత్త కార్యదర్శిగా, కొత్తగా పదవి చేపట్టనున్న దేవజిత్ సైకియా జట్టులో విభేదాలకు ఈ స్టార్ కల్చర్ కూడా కారణంగా భావిస్తున్నట్లు సమాచారం. దీంతో కొత్త జట్టు ఎంపికపై ఏం చేయాలో సెలక్టర్లకు కఠిన సందేశం వెళ్లినట్లు తెలుస్తోంది. కొత్త జట్టును నిర్మించే విషయంలో డోలాయమాన పరిస్థితిని ముగించాలని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు సైకియా సూచించినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి.
ఆస్ట్రేలియాలో ముగిసిన బోర్డర్ గవాస్కర్ సిరీస్లో రోహిత్, కోహ్లి ఘోరంగా విఫల మయ్యారు. పెర్త్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీని మినహాయిస్తే మిగిలిన టెస్టు మ్యాచ్లో విరాట్ చేసిన పరుగులు 91 మాత్రమే. ఇక రోహిత్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సిరీస్‌లోని ఐదు ఇన్నింగ్స్ ల్లో కలిపి రోహిత్ 6.2 సగటుతో 31 పరుగులు మాత్రమే సాధించాడు. ఇలా ఇంటా బయట విమర్శలతో తప్పని పరిస్థితిలో సిడ్నీలో చివరి టెస్ట్ నుంచి వైదొలగాడు. ఇక సెప్టెంబర్ నుంచి ఆడిన మొత్తం మ్యాచ్లు కలిపి హిట్ మ్యాన్ చేసిన పరుగులు 164 అంటే అర్ధం చేసుకోవచ్చు. అతను ఎంతగా ఫాం కోల్పోయాడో చెప్పడానికి ఈ గణాంకాలు చాలు.
ఇక సిడ్నీ టెస్ట్ జట్టు నుంచి డ్రాప్ అయిన తర్వాత రోహిత్ మాట్లాడుతూ, రిటైర్మెంట్ ఆలోచన లేదని చెప్పడంతో స్టార్ల విషయంలో బీసీసీఐ బలహీనంగా ఉన్నట్లుగా అనిపించింది. ఈ నేపథ్యంలో సైకియా కఠిన నిర్ణయాలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతేకాదు వచ్చే నెల 19 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి పంపే జట్టుకు సంబంధించి ప్రాథమిక సభ్యుల జాబితాను ఈ నెల 12లోపు ఐసీసీకి సమర్పించాల్సి ఉంది. తేలేందుకు రెడీ ప్రస్తుత భారత జట్టు పరిస్థితితో పాటు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు బీసీసీఐ ఆదివారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. కొత్త కార్యదర్శి ఎంపికతో పాటు కోశాధికారి నియామకాన్ని పూర్తి చేసిన అనంతరం జట్టు భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
స్టార్ క్రికెటర్ల ఓవరాక్షన్‌తో ప్రస్తుత పరిస్థితుల్లో బీసీసీఐ బలహీనంగా కనిపిస్తోందని, ఈ నేపథ్యంలో బలమైన సందేశం పంపాలని కొత్త కార్యదర్శి కోరుకుంటున్నట్లుగా ఈ అధికారి స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు ఈనెలలో మన దేశానికి రానున్న ఇంగ్లండ్ జట్టు ఐదు టీ20 సహా మూడు వన్డే మ్యాచ్లు ఆడనుంది. ఇప్పటికే గాయంతో బుమ్రా, అధిక పని భారంతో సిరాజ్, కోహ్లీ ఇంగ్లండ్‌తో సిరీస్‌కు రెస్ట్ ఇవ్వనున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో వన్డే టీమ్‌కు రోహిత్ను కెప్టెన్‌గా కొనసాగిస్తారా? లేదంటే ఛాంపియన్స్ ట్రోఫీకి పూర్తి కొత్త టీమ్ ఎంపిక చేస్తారో త్వరలో తేలనుంది.