Operation Kagar | మావోయిస్టులతో శాంతి చర్చలకు పార్టీలు, ప్రజా సంఘాల డిమాండ్

  • By: TAAZ    news    Jun 14, 2025 6:00 PM IST
Operation Kagar | మావోయిస్టులతో శాంతి చర్చలకు పార్టీలు, ప్రజా సంఘాల డిమాండ్

Operation Kagar | కేంద్రంలోని మోదీ, అమిత్ షా ప్రభుత్వం మధ్యభారతంలో మావోయిస్టుల అణచివేత పేరున వందల మంది మావోయిస్టులు, ఆదివాసులను చంపి వేస్తున్నదని వామపక్షాల నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్యాంగ ప్రకారం నడవాల్సిన బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా పనిచేస్తున్నదని వారు విమర్శించారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వామపక్షాల రాష్ట్ర కమిటీలు ఇచ్చిన పిలుపు మేరకు శనివారం వరంగల్‌లో సభ నిర్వహించారు. సీపీఐ (ఎంఎల్ ) న్యూడెమోక్రసీ గ్రేటర్ వరంగల్ కమిటీ కార్యదర్శి రాచర్ల బాలరాజు అధ్యక్షతన జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం పట్ల మోదీకి గౌరవం లేదని విమర్శించారు. బడా కార్పొరేట్ శక్తులైన అంబానీ, అదానీలకు అనుకూలంగా పరిపాలన సాగిస్తున్నదని ధ్వజమెత్తారు. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినా మోదీ ప్రభుత్వం హత్యాకాండను ఆపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీలు, మావోయిస్టులు ఈ దేశ పౌరులు కాదా? అని ప్రశ్నించారు? గతంలో దేశంలో వివిధ ప్రాంతాల్లో పనిచేసిన ఉద్యమ సంస్థలతో చర్చలు జరిపిన సందర్భాలు ఉన్నాయని, ఇప్పుడు మాత్రం మోదీ ప్రభుత్వం చర్చలకు తావు లేకుండా నిరంకుశ విధానాలను అమలు చేస్తున్నదని విమర్శించారు. మావోయిస్టులు, ఆదివాసుల హననాన్ని ఆపివేసి, చర్చలు జరపాలని, వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సభలో సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేశ్‌, న్యూ డెమోక్రసీ, సీపీఎం నాయకులు గంగుల దయాకర్, నున్న అప్పారావు వలదాసు దుర్గయ్య, లిబరేషన్ జిల్లా కార్యదర్శి యాదగిరి, సీపీఐ ఎంఎల్, పౌర హక్కుల సంఘం, భారత్ బచావో నాయకులు మోడెం మల్లేశం, రమేశ్‌ చందర్, ప్రవీణ్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు జనగాం కుమార స్వామి, రైతుకూలీ సంఘం నాయకులు జన్ను కుమారస్వామి మాట్లాడారు.

ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు ఓంకార్ భవన్ నుండి ర్యాలీ తీయడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కొంతసేపు పోలీసులకు నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ ర్యాలీ జరగనివ్వమని పోలీసులుతేల్చి చెప్పారు. రోడ్డు పైకి వచ్చిన నాయకులు అక్కడే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పక్షాల నాయకులు పనాస ప్రసాద్, బాషుమియా, సుంచు జగదీష్, ఎలకంటి రాజేందర్, వెంగల్ రెడ్డి, ఓం బ్రహ్మం, గన్నారపు రమేష్, నలిగంటి పాల్, భైరబోయిన ఐలయ్య సుమన్ తదితరులు పాల్గొన్నారు.