Telangana: క్యాబినెట్లో.. ‘ఔట్ సోర్సింగ్’ ఏజెండా!

- ఎదురు చూస్తున్న ఉద్యోగులు
- కార్పొరేషన్ ఏర్పాటుకు డిమాండ్
- భద్రత.. పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం
- రెండు లక్షల మందికి ప్రయోజనం
హైదరాబాద్, జూన్ 3 (విధాత): బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఈ నెల 5వ తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు ఏజెండాలో చేర్చాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ వల్ల ఏజెన్సీల కమీషన్ బాధలు తగ్గడంతో పాటు ఈఎస్ఐ, ఈపీఎఫ్ అమలవుతుందని కొన్ని సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయటం వలన సుమారుగా రెండు లక్షల మంది ఉద్యోగస్తులకు న్యాయం జరగడంతో పాటు ప్రజా ప్రభుత్వం మీద ఎటువంటి రూపాయి భారం ఉండదు.
గిగ్ వర్కర్లకు న్యాయం చేసిన విధంగానే తమకూ న్యాయం చేయాలని కోరుతున్నారు. కార్పొరేషన్తో ప్రభుత్వం మీద ఒక రూపాయి భారం పడకుండా సుమారుగా రూ.5వేల వరకు నెలసరి వేతనం పెరిగే అవకాశం ఉన్నది. అలాగే సకాలంలో జీతాలు ఇవ్వడానికి వీలు కలగడమే కాకుండా.. ఈఎస్ఐ, ఈపీఎఫ్ కూడా సక్రమంగా అమలవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఉన్నదని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆకాంక్షిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏజెన్సీ వేధింపుల నుంచి రక్షించాలని కొద్ది నెలలుగా ముఖ్యమంత్రి, మంత్రులకు వినతి పత్రాలు అందచేస్తున్నారు.