Pawan Kalyan Modi | పిలిచి పవన్ కల్యాణ్‌కు.. చాక్లెట్ ఇచ్చిన ప్రధాని మోదీ

విధాత: అమరావతి పునఃప్రారంభోత్సవ సభలో ఆస్తకికర సన్నివేశం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని ముగించుకొని వెళ్తుండగా ప్రధాని మోదీ ఆయనను పిలిచారు. వెంటనే మోదీ వద్దకు పవన్ వెళ్లారు. అప్పుడు మోదీ.. పవన్‌కు చాక్లెట్ ఇచ్చారు. చాక్లెట్ తీసుకున్న పవన్ కల్యాణ్ తో పాటు ఇది చూసిన సీఎం చంద్రబాబు సహా వేదికపైన ఉన్నవారి ముఖాల్లో నవ్వులు విరబూశాయి. అంతకుముందు సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ దేశం పహల్గామ్ ఉగ్రదాడి పరిణామాల క్రమంలో పాకిస్తాన్ తో యుద్ద పరిస్థితులు ఉన్న క్లిష్ట సమయంలోనూ ఇచ్చిన మాటకు కట్టుబడి అమరావతి పునఃప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధానికి చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నారు.
భారతదేశాన్నే తన ఇంటిని చేసుకున్న వ్యక్తి ప్రధాని మోదీ అని..ప్రధాని నరేంద్ర మోదీకి ఇల్లు లేకపోయినా ఆంధ్ర ప్రజలకు ఇల్లు ఉండాలని, 140 కోట్ల మందికి ఇల్లు ఉండాలని దేశాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్నాడన్నారు. ధర్మ యుద్ధంలో అమరావతి రైతులు గెలిచారని..గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులు అంటూ అమరావతిని నాశనం చేసిందని విమర్శించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తో అమరావతి అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు.
అమరావతి రైతులు భూములు మాత్రమే ఇవ్వలేదని..రాష్ట్రానికి భవిష్యత్ ను ఇచ్చారన్నారు. అమరావతి ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 20 ఏళ్ల భవిష్యత్తును ముందే ఊహించిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని, రాళ్లలో, రప్పల్లో మహానగరాన్ని చూసిన వ్యక్తి చంద్రబాబు సైబరాబాద్ నిర్మించినట్లుగానే అమరావతిని కూడా ప్రపంచ నగరంగా..దేశానికి తలమానికంగా తీర్చిదిద్దుతారన్న నమ్మకం ఉందన్నారు.