Golconda Blue Diamond | వేలానికి.. గోల్కొండ బ్లూ డైమండ్! ధ‌ర తెలిస్తే ఫీజులు ఎగురుత‌య్‌

  • By: sr    news    Apr 14, 2025 8:28 PM IST
Golconda Blue Diamond | వేలానికి.. గోల్కొండ బ్లూ డైమండ్! ధ‌ర తెలిస్తే ఫీజులు ఎగురుత‌య్‌

Golconda Blue Diamond |

విధాత: భారత్ దేశ రాజుల సంపదలో అరుదైన వజ్రం ‘గోల్కొండ బ్లూ’ (The Golconda Blue)ను వేలం వేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఇండోర్‌, బరోడా మహారాజుల వద్ద ఉన్న విలువైన సంపదలో ఇదీ ఒకటి. 23.24 క్యారెట్ల విలువైన ఈ వజ్రపు రింగ్ మే 14న జెనీవాలో జరిగే ‘‘ క్రిస్టీస్ మాగ్నిఫిసెంట్ జ్యువెల్స్’’ సేల్‌లో వేలం వేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

వేలంలో దీని ధర దాదాపు రూ.430కోట్ల వరకు పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాని రాజ వారసత్వం, అసాధారణ రంగు, పరిమాణంతో ‘ది గోల్కొండ బ్లూ’ ప్రపంచంలోని అరుదైన నీలి వజ్రాలలో ఒకటిగా నిలిచిందని క్రిస్టీస్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ హెడ్ రాహుల్ కడాకియా ఓ ప్రకటనలో తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కొల్లూరులో ఈ వజ్రం లభ్యమయినట్లు తెలుస్తోంది. పూర్వం ఇండోర్ ను పరిపాలించిన మహారాజా యశ్వంత్‌ రావు హోల్కర్‌-ll వద్ద ఇది ఉండేది. 1923లో మహారాజా తండ్రి దీనిని ఓ బ్రాస్‌లెట్‌లో పొదిగించారు. అనంతరం ఆభరణాలను రీడిజైన్‌ చేయడంలో భాగంగా ఇండోర్ పియర్‌ వజ్రాలతో చేసిన నెక్లెస్‌లో ‘ది గోల్కొండ బ్లూ’ను అమర్చారు.

ఫ్రెంచ్ చిత్రకారుడు బెర్నార్డ్ బౌటెట్ డి మోన్వెల్ అప్పట్లో గీసిన ఇందౌర్‌ మహారాణి చిత్రపటంలో ఆమె ధరించిన ఆభరణాలలో ఈ వజ్రం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 1947లో ఈ వజ్రాన్ని ప్రఖ్యాత న్యూయార్క్ ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్స్టన్ కొనుగోలు చేశాడు. తర్వాత అది బరోడా మహారాజు వద్దకు చేరుకుంది. అనంతరం దీనిని ఓ ప్రైవేటు సంస్థ సొంతం చేసుకుంది. అంతటి చారిత్రాక బ్లూ డైమండ్ కు ఇప్పుడు బ్రిటీష్ ఆక్షన్ హౌస్ క్రిస్టీస్ వేలం నిర్వహిస్తుంది.