Pahalgam | పహల్గామ్ ఉగ్ర దాడికి ముందుగానే రెక్కి.. విచారణలో కొత్త విషయాలు!

  • By: sr    news    Apr 29, 2025 3:43 PM IST
Pahalgam | పహల్గామ్ ఉగ్ర దాడికి ముందుగానే రెక్కి.. విచారణలో కొత్త విషయాలు!

Pahalgam |

విధాత: 26మంది పర్యాటకులను బలి తీసుకున్న పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ కొనసాగిస్తున్న దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. దర్యాప్తు అధికారులు ఇప్పటి వరకూ 25 మంది బాధితులు, ప్రత్యక్ష సాక్షులను విచారించి వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. బైసరన్‌ ప్రాంతంలోని స్థానిక వర్కర్లను, టీస్టాళ్లు, భేల్‌పురి అమ్ముకునే వారిని వాళ్లను విచారిస్తూ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల వివరాలు..దాడి జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు. విచారణలో ఉగ్రవాదులు పహల్గామ్ దాడికి ముందుగానే రెక్కి నిర్వహించారని.. వారికి స్థానికులు కొందరు సహకరించారన్న కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.

దాడి చేసే ప్రాంతానికి ఇద్దరు ఉగ్రవాదులు మెయిన్‌ గేట్‌ నుంచి రాగా.. మరో ఉగ్రవాది ఎగ్జిట్‌ గేట్‌ నుంచి వచ్చినట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. ఎగ్జిట్‌ గేట్‌ వద్ద ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడగా.. పర్యాటకులు ఎంట్రీ గేట్‌ వైపు పరిగెత్తినట్లు వెల్లడించిన ప్రతక్ష్యసాక్షులు తెలిపారు. ఉగ్రవాదుల్లో ఒకరైన హషిమ్ మూసాకు సంబంధించి ఎన్ఐఏ కీలక అంశాలు సేకరించింది. హషిమ్ మూసా పాక్ సైన్యంలో మాజీ పారా కమాండో అని..అతడు కరుడుగట్టిన టెర్రరిస్టుగా మారిపోయి.. పాక్‌కు చెందిన లష్కరే తోయిబాతో కలిసి పని చేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించింది.

కీలకంగా ఆ వీడియోలు..ఉగ్రదాడికి ముందస్తు రెక్కీ..?

పహల్గామ్ ఉగ్ర దాడి ఘటనకు కొన్ని రోజుల ముందు ఓ మలయాళీ టూరిస్టు తీసిన వీడియోలో ఉగ్రవాదుల కదలికలు కనిపించడం సంచలనంగా మారింది. ఆ వీడియోలో పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదులున్నారని..పహల్గామ్ కు 7.5 కి.మీ దూరంలోని బేతాబ్‌ లోయలో ఏప్రిల్‌ 18న ఆ వీడియో రికార్డు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ అధికారులు జిప్‌లైన్ ఆపరేటర్ ను అదుపులోకి తీసుకున్నారు. రిషి భట్ సెల్ఫీ వీడియో ఇందుకు కారణమైంది.

రిషి భట్ అనే పర్యాటకుడిని జిప్‌లైన్‌లోకి పంపే ముందు అల్లాహో అక్బర్ అని ఆపరేటర్ నినాదాలు చేసినట్లు ఆ వీడియోలో గుర్తించారు. అదే సమయంలో వీడియోలో ఉగ్రవాదుల కాల్పుల శబ్దాలు, పర్యాటకుల పరుగులు, ఉగ్రవాదులు కాల్పులు కనిపించాయి. అంటే టెర్రరిస్టులు వస్తున్నారనే విషయం జిప్‌లైన్‌ ఆపరేటర్‌కి ముందే తెలుసు కాబట్టే నినాదాలు చేశాడని అనుమానిస్తున్నారు. జిప్‌లైన్‌ ఆపరేటర్‌ను ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తు ఉగ్రదాడికి సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

ముమ్మురంగా ఉగ్రవేట

పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల కోసం భద్రతా బలగాలు నాలుగు ఆపరేషన్లతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా కశ్మీర్‌లో నాలుగు ఆపరేషన్లు కొనసాగుతున్నట్లు భద్రతాధికారులు వెల్లడించారు. వీటిలో రెండు దక్షిణ కశ్మీర్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్మీ, జమ్ముకశ్మీర్‌ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్లు కొనసాగుతున్నాయన్నారు.

రేపు మోదీ అధ్యక్షతన కీలక భేటీ

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో రేపు బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటీ కీలక భేటీ జరుగనుంది. పహల్గాం ఉగ్ర దాడి అనంతరం దేశ భద్రతకు సంబంధించి భద్రతా కమిటీ రెండోసారి భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే దాయాది దేశం పాకిస్తాన్ పై పలు కీలక ఆంక్షలు విధించిన భారత్ రేపటి భేటీలో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు కేంద్రం మంగళవారం భారత్‌లో పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఎక్స్‌ ఖాతా నిలిపివేసింది.