Jagadish Reddy | ఆమె కలెక్టరా.. కాంగ్రెస్ కార్యకర్తనా

విధాత : నల్గొండ జిల్లా కలెక్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాదిరిగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జి.జగదీష్ రెడ్ది ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆరెస్ సర్పంచ్ లు స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలవకుండా బిల్లులు విడుదల చేయొద్దని కలెక్టర్ మాట్లాడిన అన్ని రికార్డింగ్స్ మా దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. చట్టపరంగా పని చేయకపోతే రికార్డింగ్స్ తో సహా మీ మీద ఫిర్యాదు చేయాల్సి వస్తుందని జగదీష్ రెడ్డి కలెక్టర్ ను హెచ్చరించారు. పోలీస్ ఉన్నతాధికారులు బీఆరెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టాలని తమ కింది స్థాయి అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని.. మీరు ఒక్కరిపైన కేసు పెడితే 1000 మంది పోలీస్ స్టేషన్ కు వస్తారన్నారు. అధికారులు చట్టానికి లోబడి పని చేయకుండా, కాంగ్రెస్ మంత్రి చెప్పినట్టు నడుచుకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జగదీష్ రెడ్డి హెచ్చరించారు.
జిల్లా మంత్రులు ఉత్తమ్, వెంకట్ రెడ్డిలు ప్రజాసమస్యలు గాలికి వదిలి హెలికాప్టర్ లలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు వున్నా వ్యవసాయం దండగే అయ్యిందన్నారు. మంత్రులు కమిషన్ లు తింటూ దళారులకు అమ్ముడు పోయారన్నారు. నల్గొండలో ఓ మంత్రి సోయి లేకా ఎప్పుడు మైకంలోనే ఉంటున్నాడని, రైతులంటే ఆయనకు లెక్క లేదని.. కమీషన్లు దందాలో నిమగ్నమయ్యాడన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెట్టేస్తున్నాడని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు అన్ని రంగాల్లో విఫలం అయ్యారని, ఇంతవరకూ పంటకు బోనస్ లేదు, రుణమాఫీ అసంపూర్తిగా వదిలేశారన్నారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయం పండగ లా ఉండేదని..కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని విమర్శించారు.