First Women Rescue Team in Singareni | విపత్తు సహాయక దళాల్లో సింగరేణి నారీ దళం

First Women Rescue Team in Singareni | విపత్తు సహాయక దళాల్లో సింగరేణి నారీ దళం

136ఏళ్ల సింగరేణి సుదీర్ఘ చరిత్రలో తొలి మహిళా రెస్క్యూ టీమ్

విధాత : ప్రకృతి వైపరిత్యాలలో..ఆపద సందర్భాల్లో సాహసోపేతంగా సహాయక చర్యలు చేపట్టడంలో మగవారికి ధీటుగా మేం సైతం అంటూ ధీరోదాత్తతో రూపుదిద్దుకుంది సింగరేణి తొలి మహిళా రెస్క్యూ టీమ్. 136 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణిలో తొలి మహిళా రెస్క్యూ బృందంగా శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరింది. సొరంగాలు.. బొగ్గు బావులలోకి నీళ్లు ప్రవేశించినా.., విషవాయువు కమ్మినా, ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా..తక్షణమే రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ లు చేపట్టేందుకు తొలి మహిళా రెస్క్యూ టీమ్ సిద్ధమైంది. సింగరేణి రెస్క్యూ బృందాలు ఇటీవల శ్రీశైలం ప్రమాద సమయంలోనూ, హైదరాబాద్ పాశమైలారం అగ్ని ప్రమాద దుర్ఘటనలో, తమిళనాడు లో జరిగిన ప్రమాదంలోనూ తమ విశిష్ట సేవలను అందించి అందరి ప్రశంసలు అందుకున్నారన్నారు. ఇప్పుడు మహిళా రెస్క్యూ టీమ్ కూడా రాష్ట్ర, కేంద్ర విపత్తు ప్రతి స్పందన బృందాలకు అత్యుత్తమ శిక్షణ కేంద్రంగా ఉన్న రామగుండం-2 ఏరియాలో ఉన్న మైన్స్ రెస్క్యూ స్టేషన్ లో శిక్షణ పూర్తి చేసుకుంది. ఆపత్కాలంలో తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై తాజాగా 14 రోజుల పాటు కఠోర శిక్షణ ఇచ్చారు. ఇటీవలే సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ చేతుల మీదుగా సర్టిఫికెట్లను సైతం అందుకున్నారు. సింగరేణి రెస్క్యూను బలోపేతం చేయడానికి అత్యాధునిక సహాయ పరికరాలను సైతం వారికి అందించారు.