HCUలో విద్యార్థుల సంబరాలు

విధాత: హెచ్ సీయూ కంచ గచ్చిబౌలి 400ఎకరాల భూముల్లో చెట్ల నరికివేత సహా అన్ని పనులు ఆపేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల పట్ల యూనివర్సిటీ విద్యార్ధులు హర్షాతీరేకాలు వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు తమ పోరాటానికి దక్కిన తొలి విజయంగా విద్యార్ధులు సంబరాల చేసుకున్నారు. యూనివర్సిటీలో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా యూనివర్సిటీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని, పర్యావరణ విధ్వంసాన్ని నిరసిస్తూ విద్యార్థులు వరుస ఆందోళనలు సాగిస్తున్నారు.
ఈ క్రమంలో పలువురు విద్యార్ధులు కేసుల పాలయ్యారు. పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నారు. అయినా వారు తమ పోరాటాలను కొనసాగిస్తున్నారు. సినీ రంగంతో పాటు పలువురు సెలబ్రెటీలు కూడా హెచ్ సీయూ విద్యార్థుల ఆందోళనకు మద్ధతు తెలిపారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఈ వివాదాన్ని సుమోటోగా తీసుకుని ఈ భూముల్లో జరుగుతున్న అన్ని పనులు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ వెంటనే దీనిపై నిపుణుల కమిటీ వేసి ఆరు నెలల్లో నివేదిక అందచేయాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులు తమకు దక్కిన గొప్ప విజయంగా..ఊరటగా విద్యార్థులు భావిస్తున్నారు.