Supreame Court | కంచ గచ్చిబౌలిలో.. చెట్ల నరికివేతపై సుప్రీం సీరియస్!

  • By: sr    news    Apr 16, 2025 1:37 PM IST
Supreame Court | కంచ గచ్చిబౌలిలో.. చెట్ల నరికివేతపై సుప్రీం సీరియస్!

విధాత: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) పరిధిలోని కంచ గచ్చిబౌలి 400ఎకరాల భూ వివాదం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బుధవారం కంచ గచ్చిబౌలి భూముల చదును వివాదం విచారణను కొనసాగించిన ధర్మాసనం మే 15వరకు ఆ భూములపై స్టేటస్ కో విధించింది. ఈ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు సంధించింది. భూముల్లో చెట్ల నరికివేతను సమర్ధించుకోవద్ధంటూ సీరియస్ అయ్యింది. వివాదస్పద భూములను మార్టిగేజ్ చేశారా? లేక, అమ్ముకున్నారో మాకు అనవసరమని..భూముల తాకట్టు అంశంతో మాకు సంబంధం లేదని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. కేవలం నరికిన చెట్లను ఎలా పునరుద్దరణ చేస్తారనేదే మా ప్రాధాన్యత అని తెలిపారు.

చెట్ల తొలగింపుకు ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని ప్రభుత్వ తరుపు న్యాయవాదులను ప్రశ్నించారు. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలని..ఇప్పటికే చెట్లు నరికేసిన ఆ 100 ఎకరాలను ఎలా పునరుద్దరణ చేస్తారో చెప్పండని..లేదంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు.. పర్యావరణ పరిరక్షణలో రాజీలేదని..కంచ గచ్చి బౌలి భూముల్లో చదును ప్రక్రియ వీడియోలను చూసి తాము ఆందోళనకు గురయ్యామన్నారు. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తామంటూ ఊరుకోమని..తొలగించిన చెట్లను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండని..లేదంటే చెరువు దగ్గరే తాత్కాలిక జైలుపెట్టి అధికారులను అక్కడే ఉంచుతామన్నారు. షెల్టర్ కోసం జంతువులు పరుగులు తీస్తే వాటిని వీధి కుక్కలు తరిమియాని, వన్యప్రాణుల సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు.

చెట్ల పునరుద్ధరణపై ప్రణాళికతో రండి

చెట్ల నరికివేతను సమర్ధించుకోవద్దని..వాటిని ఎలా పునరుద్దరణ చేస్తారనే ప్రణాళికతో రండని జస్టిస్ గవాయ్ సూచించారు. అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని జస్టిస్ గవాయ్ మరోసారి హెచ్చరించారు. మినహాయింపులిస్తే అధికారులే బాధ్యులవుతారన్నారు. మీరు ఆ భూములను అభివృద్ధి చేసుకోవాలనుకుంటే తగిన అనుమతులు తీసుకోండని స్పష్టం చేశారు. వంద ఎకరాల్లో జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలి అన్న విషయం పైనే తాము దృష్టి సారించాలని అంటున్నామన్నారు. ప్రైవేటు ఫారెస్ట్ లో చెట్లు కొట్టేసినా సీరియస్ గా పరిగణిస్తామన్నారు. సిటీలో గ్రీన్ లంగ్స్ స్పేస్ ఉండాలని.. అభివృద్ధి జరగాలి..కాని అడవులను నాశనం చేయవద్ధని..అభివృద్ధికి పర్యావరణానికి మధ్య సమతుల్యం అవసరమని హితవు పలికారు. పర్యావరణ, వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెబుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాంచారు. అప్పటిదాక యథాతథ స్థితి కొనసాగించాలంటూ తదుపరి విచారణను మే 15కు వాయిదా వేశారు.

ప్రభుత్వం తరుపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి బదులిస్తూ ఆ భూములో అన్ని పనులు ఆపేశామని.. భవిష్యత్తులో ఎలాంటి తప్పు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేశారన్నారు. కొన్ని అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు, పొదలను తొలగించినట్లు తెలిపారు. సీఎస్ ఫైల్ చేసిన అఫిడవిట్ చూస్తే ఆశ్చర్యంగా ఉందని న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. వంద ఎకరాలు మార్టిగేజ్ చేసి, చెట్లు కొట్టేసి ఇప్పుడు పర్యావరణ హితమైన ఐటి పార్క్ అని చెపుతున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.అమికస్ క్యూరీ తన వాదనలో తెలంగాణ లో వాల్టా చట్టం అమలులో ఉందని గుర్తు చేశారు. అయినప్పటికి ప్రభుత్వం సెల్ఫ్ సర్టిఫికెట్ చేసుకొని అన్నింటికీ మినహాయింపులు ఇచ్చుకున్నారని, ఇది 1996 సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధమని అమీకాస్ క్యూరీ వివరించారు. రూ. 10 వేల కోట్లకు యూనివర్సిటీ భూములను మార్టిగేజ్ చేశారని సీఈసీ నివేదికలో చెప్పిందని అమికస్ క్యూరీ గుర్తు చేశారు. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసింది. కంచ గచ్చిబౌలి భూములు అటవీ భూములు కావని.. 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటం వల్ల పొదలు పెరిగాయని.. అటవీ రెవెన్యూ రికార్డులలో వీటిని అడవులుగా పేర్కొనలేదని పేర్కొంది. ఆ భూములకు ఎలాంటి కంచె లేదని.. కంచె ఏర్పాటు చేసేందుకు మేము ప్రయత్నం చేశామని… ఈ భూముల్లో ఎలాంటి జంతువులు లేవని తెలిపింది. కంచె లేని కారణంగా హెచ్‌సీయూ భూములలోని పక్షులు ఇక్కడికి వచ్చాయని పేర్కొంది.