Monsoon Seasonal Diseases | వేటాడే అంటువ్యాధుల ఆపద! వెన్నంటే సీజనల్ రోగాలు! 

అటవీ ప్రాంతాలు, గిరిజన గూడేలు, నివాసాల్లో ప్రస్తుత వాతావరణం వల్ల వ్యాధులు ప్రబలనున్నాయి. అసలే పౌష్టికాహారలోపానికి తోడు ఈ కాలంలో ప్రతీ గిరిజనం పాలిట శాపంగా మారే మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వారిని ఆర్ధికంగా నష్టం చేయడమేకాకుండా ప్రాణాలకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉంది. ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో ఆదివాసీ ప్రాంతాలు, గిరిజన తండాలు, చెంచుపెంటలు ప్రతీ ఏటా ఈ సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నాయి. తాజాగా కురుస్తున్న వర్షాలు, వరదతో స్థానికులు మరింత ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది.

  • By: TAAZ    news    Aug 15, 2025 7:42 AM IST
Monsoon Seasonal Diseases | వేటాడే అంటువ్యాధుల ఆపద! వెన్నంటే సీజనల్ రోగాలు! 

Monsoon Seasonal Diseases | విధాత ప్రత్యేక ప్రతినిధి: వర్షాకాలమంటేనే పంటకాలంతోపాటు రోగాల కాలంగా అభివర్ణిస్తారు. అసలే ఇది సీజనల్ వ్యాధుల సందర్భం. దీనికి తోడు వరద ముంపుతో రాష్ట్రవ్యాప్తంగా అనేక నివాసప్రాంతాల్లో, చుట్టుపక్కల నిండిన మురికినీరు, బురదతో పరిసరాలన్నీ అపరిశుభ్రంగా మారాయి. గత వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలు ముఖ్యంగా లోతట్టుప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. హైదరాబాద్‌తోపాటు.. వరంగల్, కరీంనగర్, ఖమ్మంలాంటి ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లోని స్లమ్ ఏరియాలన్నీ నీటమునిగాయి. వర్షం నీటితో, మురుగునీరు కలగలిసి ఇళ్ళచుట్టూరా వారం రోజులుగా ఎటువెళ్ళకుండా నీరు చుట్టుముట్టడంతో దోమలకు నిలయంగా మారాయి. ఇప్పటికే పలు నగరాల్లో నెలకొన్న అపరిశుభ్రతకుతోడు సకాలంలో చెత్తచెదారం తొలగించే అవకాశం లేకపోవడంతో వాననీటికి డ్రైనేజీల్లోని కంపంతా ఇంటిపరిసరాలను ఆక్రమించాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో ఇళ్ళల్లో నీళ్ళు చేరి ఇండ్లన్నీ తడిసిన వస్తువులు, బట్టలతో ముతకముతక వాతావరణం ఏర్పడింది. ఈ స్థితిలో రోగ కారక బాక్టిరియా, క్రిములు ప్రబలేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత వారం రోజుల నుంచి సూర్యుడు ముఖం చాటేసి, మబ్బులు ఆవరించడంతో ఈ పరిస్థితులు రోగాలు ప్రబలేందుకు అవకాశంగా మారాయి. వానలతో పరిసరాలే కాకుండా తినే ఆహారపదార్ధాలు చెడిపోయి వాటిని తినడం వల్ల కూడా అంటు వ్యాధులు ప్రబలే అవకాశం మెండుగా ఉంది. ఇక అటవీ ప్రాంతాలు, గిరిజన గూడేలు, నివాసాల్లో ప్రస్తుత వాతావరణం వల్ల వ్యాధులు ప్రబలనున్నాయి. అసలే పౌష్టికాహారలోపానికి తోడు ఈ కాలంలో ప్రతీ గిరిజనం పాలిట శాపంగా మారే మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వారిని ఆర్ధికంగా నష్టం చేయడమేకాకుండా ప్రాణాలకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉంది. ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో ఆదివాసీ ప్రాంతాలు, గిరిజన తండాలు, చెంచుపెంటలు ప్రతీ ఏటా ఈ సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నాయి. తాజాగా కురుస్తున్న వర్షాలు, వరదతో స్థానికులు మరింత ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది.

ప్రాణాలు హరించే అంటువ్యాధులు

వరదముంపు ప్రాంతాల్లో శానిటేషన్ పర్యవేక్షణలేకపోవడంతో పాటు చెత్తాచెదారం, మురుగునీరు, జంతువుల కళేబరాలతో కలిసి పరిసరాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. రోజుల తరబడి నీళ్ళల్లో ఉన్నందున రోగకారకాలు పెరిగే ప్రమాదం ఉంది. నిలిచిన మురుగునీటిని తొలగించి, చెత్తాచెదారం ఎత్తివేయడంలో జాప్యం జరుగుతోంది. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో మురుగునీరు నిలిచే ఉంది. రోజూ వర్షం కురుస్తున్నందున నీరు సక్రమంగా వెళ్ళకపోవడంతో మున్సిపల్ సిబ్బంది సైతం చేతులెత్తేస్తున్నారు. స్ధానికంగా మెడికల్ పర్యవేక్షణ లోపం వల్ల ఇప్పటికే పలు ప్రాంతాల్లో జ్వరాల తాకిడి ప్రారంభమైంది. దీనికి తోడు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తదితర వ్యాధుల ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా వాటర్ ట్యాంకుల శుభ్రతపాటించడంలో నిర్లక్ష్యం, పైపులైను లీకేలు అరికట్టడంలో జాప్యంతో మురుగునీరు తాగు నీరు కలుషితమవుతోంది. తాగు నీరు కలుషితం వల్ల డయారియా ప్రబలి వాంతులు, విరేచనలతో ఇబ్బందులు తలెత్తనున్నది. దోమల నివారణ చర్యల్లో నిర్లక్ష్యం, సకాలంలో మందులు చల్లడం, ఆయిల్ బాల్స్, నీరు నిల్వాలేకుండా చూడాల్సిన పనులు వేగవంతం చేయకపోవడంతో రోగాలు ప్రబలుతాయనే ఆందోళన పెరుగుతోంది.

వ్యాధులు ప్రబలకుండా చర్యలు

సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వం మాటలకు చేతలకు పొంతన ఉండటం లేదు. ఆచరణాత్మక కార్యక్రమంపై ఆధారపడి ఫలితాలుంటాయి. ఇప్పటికే రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పందించారు. ఉమ్మడి జిల్లాలవారీగా పర్యవేక్షణ అధికారులను నియమించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకాధికారిగా డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డిని నియమించారు. ఆయన ఇప్పటికే జిల్లాలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. హనుమకొండ జిల్లాలో జనవరి నుండి ఇప్పటి వరకు మలేరియా పాజిటివ్ ఒక కేసు, డెంగ్యూ పాజిటివ్ కేసులు 48 వరకూ నమోదయ్యాయని తెలియజేశారు. గత సంవత్సరం 182 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. కానీ, ఈ వారం, రెండు వారాల్లో నెలకొన్న వాతావరణ పరిస్థితుల వల్ల అంటువ్యాధుల సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంది. దీంతో రోగుల సంఖ్య పెరుగనున్నది.

పీహెచ్‌సీల్లో మందుల కొరత

ప్రభుత్వ పీహెచ్‌సీలు, ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది సమస్యలకుతోడు ఇటీవల మందు కొరత ఉందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిస్థితుల్లో వ్యాధుల పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తూ, మందుల కొరతలేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్థానికంగా వైద్యం అందించినప్పటికీ రోగం నయంకానప్పుడు పెద్ద హాస్పిటల్స్‌కు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. వైద్యులు, సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉండి పేషెంట్లకు వైద్య సేవలు అందించడంతోపాటు , క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలను నిర్వహించాలని కోరుతున్నారు. ప్రధానంగా సమీక్షలకు పరిమితం కాకుండా గ్రామస్థాయిలో తగిన చర్యలు తీసుకున్నప్పుడే ఈ వ్యాధుల ముప్పు నుంచి తప్పించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. లేకుంటే పేద,మధ్యతరగతి వర్గాలు ఆర్ధికంగా నష్టపోవడమేకాకుండా ఆరోగ్యాన్ని పణంగా పెట్టాల్సి వస్తోందంటున్నారు. ప్రభుత్వ వైద్యం అందించలేని స్థితిలో ప్రైవేటు వైద్యాన్ని ఆశ్రయించడం వల్ల వేలాది రూపాయాలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం పరిస్థితిని గుర్తించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.