Jagga Reddy | కవిత ఎపిసోడ్‌పై జగ్గారెడ్డి తన స్టైల్‌లో కామెంట్స్‌.. అంత మాట అనేశారేంటి?

కవిత స్వతహాగా లీడర్ కాదని.. కేసీఆర్ కూతురుగానే ఆమెకు గుర్తింపు ఉందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కూతుళ్లు ఎప్పుడూ వారసులు కాలేరని జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత వల్ల ఏం కాదు.. రాజకీయాలను ఆమె ఏం తిప్పేయదని.. ఆమె వల్ల రాజకీయాలు ఏమీ తారుమారు కావని అన్నారు.

  • By: TAAZ    news    May 25, 2025 10:11 PM IST
Jagga Reddy | కవిత ఎపిసోడ్‌పై జగ్గారెడ్డి తన స్టైల్‌లో కామెంట్స్‌.. అంత మాట అనేశారేంటి?

Jagga Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ దేవుడు అంటూనే.. ఆయనను రాజకీయ జీవిత సమాధి చేసేలా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టీ జగ్గారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. వారం నుండి కవిత రాసిన లేఖల గురించి చర్చ జరుగుతుందన్నారు. కేసీఆర్ కుటుంబంలో లేఖల కలకలం నడుస్తుందన్నారు. ఏదో జరుగుతుంది అనే చర్చ సాగుతున్నదని, కవిత లెటర్‌ ఎపిసోడ్ పై రకరకాల వార్తలు వస్తున్నాయని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కవిత ఎపిసోడ్… బీజేపీకి బలం పెంచేలా ఉందని వ్యాఖ్యానించారు. కవిత డిప్రెషన్‌లో ఉండి… తొందర పడి లేఖ విడుదల చేసిందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచన చేస్తారని పేర్కొన్నారు. కేసీఆర్ పిల్లలు దారి తప్పారని అనుకోవచ్చని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. కేసీఆర్ గురించి కవితకు పూర్తి అవగాహన లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఎవరికి వాళ్ళు నేనే గొప్ప అనుకునే ఫీలింగ్ మంచిది కాదని హితవు చెప్పారు. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా కేసీఆర్.. కేసీఆరే అని.. ఆయనతోనే ఆ పార్టీకి ఉనికి అని స్పష్టం చేశారు. కేటీఆర్, హరీశ్‌, కవిత వల్ల ఏమీ కాదని తేల్చేశారు. కేసీఆర్ కుటుంబ పంచాయతీ.. రాజకీయంగా వాళ్లకు నష్టదాయకమని.. దాని నుండి ఎలా బయట పడాలి అనేది వాళ్ళు చూస్తున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

కేసీఆర్ కూతురుగానే కవితకు గుర్తింపు
కవిత స్వతహాగా లీడర్ కాదని.. కేసీఆర్ కూతురుగానే ఆమెకు గుర్తింపు ఉందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కూతుళ్లు ఎప్పుడూ వారసులు కాలేరని జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత వల్ల ఏం కాదు.. రాజకీయాలను ఆమె ఏం తిప్పేయదని.. ఆమె వల్ల రాజకీయాలు ఏమీ తారుమారు కావని అన్నారు. కవిత కొత్త పార్టీ అనే చర్చ నడుస్తుందన్న జగ్గారెడ్డి.. కేసీఆర్ లేకుంటే బీఆర్ఎస్ లేదని.. బీఆర్ఎస్ రాజకీయ ఆత్మహత్య చేసుకుని, బీజేపీని పెంచే పని జరుగుతున్నదని అన్నారు. కవిత లేఖతో బీఆర్ఎస్ క్యాడర్.. లీడర్స్ బీజేపీ వైపు వెళ్లే ప్రమాదం ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు అలెర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ నాయకత్వం బీఆర్ఎస్ శ్రేణులను కాంగ్రెస్ వైపు తెచ్చుకునే ప్రయత్నం చేయాలన్నారు. సమయం వచ్చినప్పుడు సీఎం రేవంత్.. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కి దీనిపై సలహాలు ఇస్తానన్నారు. కొన్ని విషయాలు ఇంచార్జి నటరాజన్ తో కూడా పంచుకుంటానని తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది
రాష్ట్ర రాజకీయాల్లో ముందు కాంగ్రెస్.. రెండో స్థానంలో బీఆర్ఎస్, మూడో స్థానంలో బీజేపీ ఉన్నాయని జగ్గారెడ్డి చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ బలంగానే ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్‌కు పదేళ్లు అధికారం ఇచ్చిన ప్రజలు.. తర్వాత కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని అన్నారు. బీఆర్ఎస్ అంతర్గత కలహాలతో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఇబ్బంది లేదని తెలిపారు. కవిత లేఖతో కాంగ్రెస్‌కు వచ్చే నష్టం కూడా ఏమీలేదన్నారు. అన్ని రాజకీయ పార్టీల్లో అంతర్గత విషయాలు ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ఉనికిలో లేదని వ్యాఖ్యానించారు. ఇందిరా గాంధీ మొదలు కొని.. సోనియా, రాహుల్ గాంధీ వరకు మంచి పరిపాలన అందిస్తారనే ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తున్నారని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.