Operation Sindoor | భారత్, పాక్ కాల్పుల విరమణ; ట్రూత్‌లో ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్

-
చర్చలు ఇచ్చిన శాంతి!
- అమెరికా సహా అనేక దేశాల దౌత్యం
- 48 గంటలపాటు 2 దేశాలతో చర్చలు
- ఎట్టకేలకు ఫలించిన దౌత్య యత్నాలు
- విస్తృత స్థాయి అంశాలపై తటస్థ వేదికపై
- రెండు దేశాలూ చర్చలను కొనసాగిస్తాయి
- అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడి
- సీజ్‌ఫైర్‌ను ధృవీకరించిన భారత్, పాక్
- సోమవారం మళ్లీ చర్చలు: బీబీసీ రిపోర్ట్
Operation Sindoor | యుద్ధం వద్దు.. చర్చలే ముద్దన్న దేశ మేధావుల మాటే నెగ్గింది. చర్చలతోనే రెండు దేశాల మధ్య శాంతి నెలకొన్నది. నాలుగు రోజులుగా సాగిన ఉద్రిక్త పరిస్థితులకు, మరణాలకు తాత్కాలికమో మరోటో కానీ.. మొత్తానికి తెరపడింది. ఈ నాలుగు రోజుల వ్యవధిలో పది నుంచి పదిహేను మంది వరకూ భారత పౌరులు, జవాన్లు, సీనియర్ అధికారులు బలిదానం చేశారు. భారత్‌లో చర్చల గురించి మాట్లాడితే దేశద్రోహులన్నట్టు కొందరు చూసినా.. చివరకు అమెరికా మధ్యవర్తిత్వంలో దాదాపు 30కి పైగా దేశాలు పాల్గొన్న దౌత్య చర్చలే రెండు దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు దారి తీశాయి. అంగీకారం మేరకు శనివారం సాయంత్రం నుంచి భూతల, గగనతల, సముద్రజలాలపై సైనిక చర్యలు, కాల్పులు ఆగిపోయాయని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని అంతకు ముందు ట్రూత్ ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచానికి చాటారు. అమెరికా మధ్యవర్తిత్వంలో రాత్రంతా కొనసాగిన చర్చల అనంతరం ఈ ఒప్పందానికి వచ్చినట్టు ఆయన తెలిపారు. ‘పూర్తిస్థాయిలో, తక్షణ కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. సమయస్ఫూర్తి, తెలివిని ఉపయోగించిన రెండు దేశాలకూ అభినందనలు..’ అని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ ట్వీట్‌ను భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ధృవీకరించారు. అమెరికా మధ్యవర్తిత్వం వహించిన ఈ చర్చల్లో తాము కాల్పుల విరమణకు అంగీకరించామని ఆయన తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఇరు పక్షాల మధ్య కాల్పులు ఆగిపోయాయని ఆయన ప్రకటించారు. భూతల, గగనతల, సముద్ర జలాల్లో సైనిక చర్యలు, కాల్పులు తక్షణమే ఆగిపోయినట్టు విక్రమ్ మిస్రీ చెప్పారు. ట్రంప్ పోస్ట్ వచ్చిన కొద్ది నిమిషాలకే స్పందించిన పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్.. తక్షణమే కాల్పుల విరమణకు భారత్, పాకిస్తాన్ అంగీకరించాయని తెలిపారు. పాకిస్తాన్ ఎల్లప్పుడూ ఈ ప్రాంతంలో శాంతి, భద్రతలను కోరుకుంటుందని చెప్పారు. టర్కీ, సౌదీ అరేబియా, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబినో సహా మూడు డజన్ల దేశాలు ఈ దౌత్యంలో భాగస్వాములైనట్టు ఇషాక్ దార్ చెప్పారు.
— Donald J. Trump (@realDonaldTrump) May 10, 2025
జేడీవాన్స్ ధన్యవాదాలు
కాల్పుల విరమణకు కృషి చేసిన భారత్, పాకిస్తాన్ దేశాల నాయకులకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ధన్యవాదాలు తెలిపారు. ‘అధ్యక్షుడి (ట్రంప్) టీమ్ నుంచి, ప్రత్యేకించి విదేశాంగ మంత్రి రుబినో నుంచి గొప్ప కృషి జరిగింది’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. భారత్, పాక్ కాల్పుల విరమణపట్ల ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరస్ హర్షం వ్యక్తం చేశారు. ఉద్రిక్తతల నివారణకు అన్ని ప్రయత్నాలు జరిగి, భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని పేర్కొన్నారు. ట్రంప్ పోస్ట్ వెలువడిన కొన్ని నిమిషాలకు స్పందించిన విదేశాంగ మంత్రి మార్కో రుబినో.. గడిచిన 48 గంటలుగా తాను, వాన్స్ కలిసి ఉభయ దేశాల ప్రధాన మంత్రులు నరేంద్రమోదీ, షెహబాజ్ షరీఫ్‌తోపాటు రెండు దేశాల సీనియర్లలో చర్చించామని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇకపై రెండు దేశాల విస్తృత స్థాయి అంశాలపై తటస్థ ప్రదేశాల్లో చర్చలు కొనసాగిస్తాయని ఆయన తెలిపారు. భారత్, పాకిస్తాన్ మధ్య సోమవారం మరో విడత చర్చలు జరుగుతాయని బీబీసీ దక్షిణాసియా కరస్పాండెంట్ సమీరా హుస్సేన్ తెలిపారు. కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ అవసరమైతే రక్షించుకునేందుకు సరిహద్దుల్లో అప్రమత్తంగానే ఉంటామని భారత రక్షణ శాఖ ప్రతినిధులు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. కాల్పుల విరమణ నేపథ్యంలో పాకిస్తాన్ అన్ని ఎయిర్‌క్రాఫ్ట్స్‌కు ఎయిర్ స్పేస్‌ను తిరిగి తెరిచింది.