Youtubers: వారు అరెస్టు.. వీరు అలర్ట్! త‌ప్పైంది.. క్ష‌మించమంటున్న ముద్దుగుమ్మ‌

  • By: sr    news    Mar 14, 2025 5:59 PM IST
Youtubers: వారు అరెస్టు.. వీరు అలర్ట్! త‌ప్పైంది.. క్ష‌మించమంటున్న ముద్దుగుమ్మ‌

Youtubers| influencers

విధాత: సోషల్ మీడియాలో ఈజీ మనీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ అమాయక జనం మోసపోవడానికి కారణమవుతున్న యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్లను పోలీస్ శాఖ వరుస అరెస్టులతో వణికిస్తుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లుగా పాపులారిటీ వచ్చిన తర్వాత డబ్బులకు ఆశ పడి కొందరు మోసపూరిత బెట్టింగ్ యాప్స్ , ఉత్పత్తులను ప్రమోట్ చేయడంతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి. మరికొందరు జైలుపాలయ్యారు.

ఈ క్రమంలో తాజాగా ప్రముఖ యూ ట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ భయ్యా సన్నీ యాదవ్‌పై సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడంపై సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేశారు. నేడో రేపో అతడిని అరెస్టు చేసేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫిర్యాదుతో సన్నీ యాదవ్ పై కేసు నమోదైంది. అటు ఏపీలోనూ విశాఖకు చెందిన మరో ప్రముఖ యూ ట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ లోకల్ బాయ్ నానిని విశాఖపట్నం సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్‌తో యువతను ప్రలోభపెట్టి, యువతను చెడు మార్గంలో నడిచేలా చేస్తున్నారంటూ.. వచ్చిన ఫిర్యాదు మేరకు లోకల్ బాయ్ నానిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

వరుసగా బెట్టింగ్ యాప్ లు, మోసపూరిత ఆన్ లైన్ వ్యాపారాలను ప్రమోట్ చేస్తున్న యూ ట్యూబర్లపై కేసులు, అరెస్టులు సాగుతుండటంతో మిగతా యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమను కూడా అరెస్టు చేస్తారేమోనన్న గుబులుతో వారు ముందు జాగ్రత్త పడుతున్నారు. ఇలాంటి వారి వరుసలో నటి సురేఖ వాణి కూతురు, యూ ట్యూబర్ సుప్రీత (Supritha) ఉన్నారు. ఈనేప‌థ్యంలో తాజాగా హోలీ రోజున వీడియో ముఖంగా త‌న క్ష‌మాప‌ణ‌లు తెలిపింది.

నన్ను క్షమించండి.. తెలియక ప్రమోట్ చేశాను: సురేఖ వాణి కూతురు

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్ పై కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో యూట్యూబర్ సుప్రీత స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. నన్ను క్షమించండి.. తెలియక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసానని చెప్పుకొచ్చారు. కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్ తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని, అలాంటి వాటిని చూసి ఈజీ మనీకి అలవాటు పడొద్దని ప్రజలను కోరారు. తమ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వీడియోలను డిలీట్ చేయండని కోరారు. సుప్రీత వీడియో చూసిన నెటిజన్లు వామ్మె చేసిందంతా చేసి..ఇప్పుడు కేసుల భయంతో గడుసుగా సారీ చెప్పి తప్పించుకుంటుందంటూ సెటైర్లు వేస్తున్నారు.

 

కాగా ఇటీవల తెలుగు రాష్ట్రాలలో సోషల్ మీడియా కార్యక్తరలు, యూ ట్యూబర్ ఇన్‌ఫ్లుయెన్సర్ల వరుస అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో 2023 ఎన్నిక‌ల స‌మ‌యంలో నాటి అధికార పార్టీకి అనుకూలంగా రీల్స్‌, ఇత‌ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన చాలామంది యూ ట్యూబ‌ర్స్ అప్ర‌మ‌త్త‌మ‌వుతున్నారు. గ‌తంలో వారిలో అధిక శాతం చాలా సంద‌ర్భాల్లో బోట్టింగ్ యాప్స్ ప్ర‌చారం చేసి ఉండ‌డంతో ఇప్పుడు వారికి కొత్త భ‌యం ప‌ట్టుకుంది. ఒక‌వేళ ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న పార్టీ ఏమైనా సీరియ‌స్‌గా తీసుకుంటే తాము లోతుగా ఇరుక్క‌బోతామ‌నే ఆలోచ‌న‌లోనూ ఉన్నార‌నే విష‌యం అవ‌గ‌త‌మ‌వుతుంది. అందుకే కొంత‌మంది క్ష‌మించండి అంటూ ముంద‌స్తుగా త‌మ త‌ప్పును ఒప్పుకుంటూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు.