Global warming | ఈ ఏడాది ఎండల మంటలు తప్పించుకున్నామా? పెను ముప్పే ఉందంటున్న శాస్త్రవేత్తలు
ఈ ఏడాది ఎండలు త్వరగానే ముగిసి, పెద్దగా ఇబ్బందిపెట్టకున్నా.. రాబోయే రోజులు మాత్రం విపరీతమైన పర్యావరణ మార్పులు, అనర్ధాలు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పారిస్ ఒప్పందంలో విధించుకున్న పరిమితి అయిన 1.5 డిగ్రీల సెల్సియస్‌ను వరుసగా రెండో ఏడాది కూడా ఉల్లంఘించామని చెబుతున్నారు. దీర్ఘకాలంలో ఈ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు.

Global warming | గత రెండు మూడేళ్లుగా చూస్తే ఈ ఏడాది ఎండలు ఆ స్థాయిలో లేవు. వానలు కూడా ముందే వచ్చాయి. అవి రైతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టినా.. సామాన్య జనం మాత్రం వేడి నుంచి ఉపశమనం పొందారు. కానీ.. ఈ ప్రపంచవ్యాప్తంగా గమనిస్తే ఈ ఏడాది కూడా ఏప్రిల్ ఆ మాటకొస్తే ఈ ఏడాది ఇప్పటి వరకూ ఎండలు ఆందోళనకరంగానే ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే.. గత మూడేళ్లుగా చూస్తే ఈ ఏప్రిల్ గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రెండో స్థానంలోనే ఉన్నప్పటికీ.. అంతకు మించి ముప్పు పొంచుకు వస్తున్నదని అంటున్నారు. ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెల్సియస్ మించకుండా చూసుకోవాలని పారిస్ ఒప్పందం ఒక కట్టుబాటు పెట్టింది. వాస్తవానికి గత ఏడాదే ఆ కట్టు తెగిపోయింది. ఇప్పుడు వరుసగా రెండో ఏడాది కూడా అదే పరిస్థితి నెలకొన్నది. ఇప్పుడు ఊహాత్మక అంచనాలు, విశ్లేషణలు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. పెరిగే వడగాడ్పులు, పెరిగే సముద్ర మట్టాలు, అనూహ్యమైన తీవ్ర స్థాయి వాతావరణ మార్పులు ఇక కళ్ల ముందు ప్రత్యక్షం కానున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ ధరిత్రిపై అత్యంత వేడి సంవత్సరంగా 2024 రికార్డు సృష్టించింది. ఆ ఏడాది పారిశ్రామిక యుగం నాటి ఉష్ణోగ్రతల కంటే సగటున 1.6 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైంది. ఇదేదో అనుకోకుండా పెరిగినదిగా తొలుత భావించినప్పటికీ.. తాజా పరిశోధనలు మాత్రం ప్రమాదకరమైన దీర్ఘకాలికంగా పెరుగుతూ పోయే దశలోకి ధరిత్రి ప్రవేశించిందని హెచ్చరిస్తున్నాయి.
ఉష్ణోగ్రతలు పెరుగకుండా చూసుకోవాలని, తద్వారా తీవ్ర పర్యావరణ పర్యవసానాలను నిరోధించవచ్చని పారిస్ అగ్రిమెంట్లో పేర్కొన్నారు. ఆ మేరకు పారిశ్రామిక యుగానికి ముందు ఉన్న ఉష్ణోగ్రతల కంటే 1.5 శాతానికి మించకుండా చూసుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. శిలాజ ఇంధనాల ఉపయోగాన్ని తగ్గించడం వంటి కీలక అంశాలు సహా పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన అనేక అంశాలను ఆ ఒప్పందంలో ప్రపంచ దేశాలు రాసుకున్నాయి. కానీ.. వాటిని పాటిస్తున్న ధోరణి మాత్రం కనిపించడం లేదు. నిరంతరాయంగా పొగలు చిమ్ముతున్న పారిశ్రామిక గొట్టాలు, మితిమీరిపోయిన వ్యక్తిగత వాహనాల వాడకం, ప్రభుత్వాలు ప్రజారవాణాపై కేంద్రీకరించకపోవడం, అడ్డూఅదుపూ లేని అడవుల నరికివేత, యథేచ్ఛగా జలవనరులు, నదుల కబ్జాలు వెరసి.. పర్యావరణాన్ని కత్తిపోట్లు పొడుస్తున్నాయి. ఈ క్రమంలోనే గత మూడేళ్లుగా రికార్డుస్థాయిలో కొనసాగిన ఎండలు.. ఇకపై కూడా కొనసాగుతూనే ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ దేశాలకు అత్యంత కీలకమైన విద్యుత్తు ఉత్పత్తికి శిలాజ ఇంధనమైన బొగ్గునే విపరీతంగా వాడుతున్నారు. దీని వల్లే గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్నదని దశాబ్దాలుగా వాతావరణ నిపుణులు మొత్తుకుంటూనే ఉన్నారు. అయినా ఇది నియంత్రణలోకి వస్తున్న సంకేతాలు కనిపించడం లేదు. ఫలితంగా పర్యావరణంలోకి కర్బన ఉద్గారాల విడుదల యథేచ్ఛగా సాగిపోతూనే ఉన్నది.
1990లో మొదటిసారి వెలువడిన ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) ప్రపంచ వ్యాప్తంగా కర్బన ఉద్గారాల విడుదల 50 శాతం పెరిగిందని పేర్కొన్నది. దాన్ని రానురాను తగ్గించుకోవాల్సిది పోయి.. పెంచుతూ వస్తున్నాం. ఫలితంగా ఇప్పుడు మరో పరిమితి.. 2 డిగ్రీల సెల్సియస్వైపు సాగుతున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే పరిస్థితి వస్తే పర్యావరణానికి జరిగే నష్టం నుంచి కోలుకునే అవకాశాలు కూడా ఉండబోవని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ప్రపంచదేశాలన్నీ కలిసికట్టుగా వ్యవహరించి నెట్ జీరో ఎమిషన్స్ (కాలుష్యమే వెలువడని పరిస్థితి)కు తీసుకెళ్లినా.. ఇప్పటి వాతావరణ పరిస్థితులు కొన్ని శతాబ్దాల పాటు కొనసాగుతాయని చెబుతున్నారు. ఈ పరిస్థితిని ఇప్పటికైనా రివర్స్ చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇప్పుడు వాతావరణంలోకి విడుదలవుతున్న కర్బన ఉద్గారాలకు మించిన స్థాయిలో వాటిని తొలగించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
పర్యావరణ మార్పులతో అతి కొద్దికాలంలోనే ప్రమాదకర ప్రభావాలు ఎదుర్కొనాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో వీటిని ప్రత్యక్షంగా చూస్తున్నామని గుర్తు చేస్తున్నారు. 1910తో పోల్చితే ఇప్పటికే ఆస్ట్రేలియా 1.5 డిగ్రీలు దాటిపోయింది. పర్యవసానంగా తరచూ అడవుల్లో అగ్నిప్రమాదాలు, సముద్ర జలాలు వేడెక్కడం, గ్రేట్ బారియర్ రీఫ్ ధ్వంసం కావడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆర్కిటిక్ కూడా వేగంగా మారిపోతున్నది. ఇప్పటికిప్పుడు 1.5 డిగ్రీలకే పరిమితం చేయగలిగినా.. ఆర్కిటిక్‌లో మంచు కొన్ని దశాబ్దాల పాటు కరుగుతూనే ఉంటుందని చెబుతున్నారు. దాని ఫలితంగా సముద్ర జల మట్టాలు గణనీయంగా పెరిగి, కోలుకోలేని విధ్వసం మిగులుతుందని అంటున్నారు. కుండపోత వర్షాలు, మెరుపు వరదలు, దీర్ఘకాలిక కరువు కాటకాలు ఆహార భద్రతను ప్రశ్నార్థకం చేస్తాయని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తాయని పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి..
కేరళను తాకిన రుతుపవనాలు.. వేగంగా ముందుకు!
Space Elevator | చందమామపైకి నిచ్చెన! సాధ్యాసాధ్యాలేంటి? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
Earth 2.0 | భూమికి వెలుపల నీటి ఛాయలు.. నాసా అధికారిక ప్రకటన.. రెండో ‘భూమి’ ఎక్కడంటే!
Rift in East Africa | ఆఫ్రికా రెండు ముక్కలు.. ఆరో మహా సముద్రం ఆవిర్భావం?