Kabul Water Crisis | ఆధునిక రాజధాని నగరం.. కొన్నాళ్లలోనే చుక్క నీరూ దొరకదు!

వాతావరణ మార్పులు, పర్యావరణ విధ్వంసం ఆఫ్ఘనిస్థాన్‌ను గట్టిగానే తాకుతున్నాయి. 2030 నాటికి కాబూల్‌లోని ప్రధాన జలాశయాలు ఎండిపోయే ప్రమాదం ఉందని తాజా నివేదిక హెచ్చరించింది.

Kabul Water Crisis | ఆధునిక రాజధాని నగరం.. కొన్నాళ్లలోనే చుక్క నీరూ దొరకదు!

Kabul Water Crisis | అదొక ఆధునిక నగరం. దశాబ్దాలపాటు ఉగ్రవాదంతో, అంతర్గత పోరాటంతో నలిగిపోతున్న దేశంలోని ఒక ప్రాంతం. ఇప్పుడు ఆ నగరానికి చుక్క నీరు కూడా కరువవుతున్నది. అత్యంత వేగంగా ఈ నీటి కరువు ఆ నగరాన్ని కకావికలు చేయనుంది. దానిపేరు కాబూల్‌. ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని నగరం. మునుపెన్నడూ కనీవినీ ఎరుగని మానవతా విపత్తు ముందు కాబూల్‌ నిలిచిందని తాజా నివేదిక ఒకటి హెచ్చరించింది. ఆధునిక నగరాల్లో ఇలాంటి విపత్తును ఎదుర్కొనబోతున్న తొలి నగరం ఇదేనని ‘కాబూల్‌ నీటి సంక్షోభం: చర్యలు తీసుకోవాల్సిన సమయం’ పేరిట వెలువడిన నివేదిక పేర్కొన్నది. ఈ నివేదికను స్వచ్ఛంద సంస్థ మెర్సీ కార్ప్స్‌ విడుదల చేసింది. నగరంలో నానాటికీ తీవ్రతరమవుతున్న నీటి సంక్షోభాన్ని వివరించిన నివేదిక.. తక్షణమే దేశీయ అప్రమత్తత, అంతర్జాతీయ సహకారం అవసరమని నొక్కి చెప్పింది.

సహజసిద్ధంగా రీచార్జ్‌ అయ్యే భూగర్భ జలాలకు మించి.. 44 మిలియన్ల క్యూబిక్‌ మీటర్ల నీటిని కాబూల్‌లో తోడేస్తున్నారని తెలిపింది. గత దశాబ్ద కాలంలోనే నీటి పట్టిక 25 నుంచి 30 మీటర్ల లోతుకు పడిపోయిందని పేర్కొన్నది. యునిసెఫ్‌ అంచనాల ప్రకారం కాబూల్‌ నగరంలో జలాశయాలు 2030 నాటికి పూర్తిగా ఎండిపోతాయని, దాదాపు 30 లక్షల మంది ప్రజలు వలస పోయే పరిస్థితి ఏర్పడుతుందని వెల్లడించింది. పరిస్థితి ఇప్పటికే తీవ్రస్థాయిలో ఉన్నదని పేర్కొన్నది. కాబూల్‌ నగర వాసులకు ప్రధాన మైన నీటి వనరులు బోరు బావులే. అయితే.. ఇవి దాదాపు సగం వరకూ ఎండిపోయాయని నివేదిక వెల్లడించింది. సహజసిద్ధంగా రీచార్జ్‌ అయ్యే జలాల కంటే .. భూగర్భం నుంచి తోడే జలాలే అధికంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. కాబూల్‌ జల సంక్షోభం.. పాలకులు, మానవతా సమన్వయం, జల నియంత్రణ వైఫల్యాలతోపాటు.. తగిన మౌలిక వసతుల ప్రణాళిక లేకపోవడం వల్ల సంభవించిందని నివేదిక తేల్చి చెప్పింది. వెంటనే జోక్యం చేసుకోకపోతే.. ఈ నగరం ప్రపంచంలోనే నీటి వనరులు లేని తొలి నగరంగా తయారవుతుందని హెచ్చరించింది.

కాబూల్‌కు నీటి సరఫరా ప్రధానంగా మూడు వనరులపై ఆధారపడింది. హిందూకుష్‌ పర్వతాల నుంచి కరిగే మంచు.. ప్రవహించడం ద్వారా ఇవి రీచార్జ్‌ అవుతాయి. అయితే.. పర్యావరణ మార్పులు, తరచూ ఎదురవుతున్న కరువు పరిస్థితుల కారణంగా మంచు, వర్షాలు గణనీయంగా తగ్గిపోయాయి. 2023 అక్టోబర్‌ నుంచి 2024 జనవరి వరకూ ఆఫ్ఘనిస్తాన్‌ సాధారణ వర్షపాతంలో 45% నుంచి 60 శాతం మాత్రమే రికార్డయింది. పర్యావరణ మార్పుల ప్రభావంతో తీవ్ర దుర్బల స్థితిలో ఉన్న ఆరో దేశంగా ఆఫ్ఘనిస్తాన్‌ నిలిచిందని, దాని దుష్ప్రభావాలను కాబూల్‌ ఇప్పటికే అనుభవిస్తున్నదని నివేదిక తెలిపింది. శీతాకాలం వ్యవధి గణనీయంగా తగ్గిపోవడంతో హిందూకుష్‌ పర్వతాల నుంచి కరిగే మంచు కూడా తగ్గిపోయింది. కాబూల్‌నగరంలో 20 శాతం ఇళ్లకు మాత్రమే పైపుల ద్వారా మంచినీరు సరఫరా అవుతున్నది. మిగిలిన అన్ని ఇళ్లు బోరుబావుల మీదే ఆధారపడుతున్నాయి. అదే సమయంలో కాబూల్‌లోని 80 శాతం భూగర్భ జలాలు మురుగునీరు, ప్రమాదకర రసాయనాలతో కలుషితమైపోయాయని నివేదిక వెల్లడించింది. ఇది ఆరోగ్యపరంగా కూడా సమస్యలు కలిగిస్తున్నదని తెలిపింది. ఈ సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించని పక్షంలో భయానక నీటి సంక్షోభం ఎదుట కాబూల్‌ నిలుస్తుందని నివేదిక హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి..

Kagaznagar Tiger Conservation: కాగజ్ నగర్ టైగర్ కన్జర్వేషన్ పై ఆదివాసీల తిరుగుబాటు!
World Environment Day | ‘పర్యావరణం’పై యుద్ధం..! ఇప్పటికీ రావణకాష్టంలా రగులుతూనే ఉన్న గాజానే ఉదాహ‌ర‌ణ‌..!!
Environment | విధ్వంసం ఎవ‌రిది.. వినాశ‌నం ఎవ‌రికి?