బండి భగీరథ్ కేసులో బీఆర్ఎస్ శాడిస్టు రాజకీయం : సీఎం రేవంత్ రెడ్డి

బండి భగీరథ్ కేసులో బీఆర్ఎస్ శాడిస్టు రాజకీయాలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కార్మికుల కనీస వేతనాల పెంపుపై కీలక ప్రకటన చేశారు.

బండి భగీరథ్ కేసులో బీఆర్ఎస్ శాడిస్టు రాజకీయం : సీఎం రేవంత్ రెడ్డి

విధాత, హైదరాబాద్ : ఫోక్సో కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ కేసులో బీఆర్ఎస్ నాయకులు శాడిస్టు రాజకీయం చేస్తున్నారని, బండి సంజయ్ పై కోపంతో కేటీఆర్ మైనర్ బాలికను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ లు జడ్జీలుగా మారిపోయి తీర్పులు ఇచ్చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాలు చేయాలనుకుంటే ఎన్నికల్లో ఓడించాలి.. అంతే కాని దిగజారి ప్రవర్తించొద్దు అని రేవంత్ రెడ్డి హితవు పలికారు. బండి భగీరథ్ ను పోలీసులే అరెస్టు చేశారని, బండి సంజయ్ నే తన కుమారుడిని అప్పగించి ఉంటే ఆయన ఇంట్లో అప్పగించి ఉండేవారు అన్నారు. ఈ కేసులో చట్టప్రకారమే ప్రభుత్వం ముందుకెలుతుందని రాజకీయ కక్ష్యలకు ప్రయత్నించడం లేదని స్పష్టం చేశారు. భగీరథ్ కేసులో బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేటీఆర్ ఇంకా కల్వకుంట రాజ్యాంగంలోనే ఉన్నానని అనుకుంటున్నారని, వారు పదవి నుంచి దిగిపోయి చాలా రోజులైందని గుర్తు చేశారు. పార్టీ మీటింగ్ కోసం జగిత్యాలకు వెళ్లిన కేసీఆర్.. రాష్ట్రంలో ఇంత పెద్ద సంఘటన జరిగితే ఎందుకు బయటకు రాలేదు? అని ప్రశ్నించారు.

చట్ట ప్రకారమే చర్యలు

కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరికినా నోటీసు ఇచ్చి విచారించామని, బండి భగీరథ్ విషయంలోనూ నోటీసులు ఇచ్చామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో పోలీసులపై కాల్పులు జరిగినా.. ఆ పార్టీ నాయకత్వం ఘటనకు కారణమైన వారికి నోటీసులు ఇవ్వలేదని, పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని విమర్శించారు. రైతుల విషయంలో బీఆరెస్ శవ రాజకీయాలు చేయాలని చూస్తోందని, రాజకీయాల కోసం మరీ ఇంత దిగజారి వ్యవహరిస్తారా? అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నిజంగా రైతులపై ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ 80 శాతం పూర్తయింది.. ఇంకా 20 శాతం మిగిలి ఉందని, ఆ ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తి చేస్తాం అని స్పష్టం చేశారు.

కార్మికుల కనీస వేతనాలను పెంపుకు ప్రభుత్వం నిర్ణయం

కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జూన్ 1, 2026 నుంచి అమలు జరుగుతుందని తెలిపారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో 1కోటి 11 లక్షల కార్మికులు నష్టపోయారు అని, అందుకే మా ప్రభుత్వం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించి … చర్చించి రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకుందన్నారు. కార్మికులను నాలుగు కేటగిరీలుగా తీసుకున్నాం అని, అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్ గా కార్మికులను విభజించాం అని, జోన్లను మూడు భాగాలుగా విభజించడం జరిగిందని రేవంత్ రెడ్డి వివరించారు. జోన్ 1 లో మున్సిపల్ కార్పొరేషన్స్, జోన్ 2 లో మున్సిపాలిటీలు, జోన్ 3 లో గ్రామీణ ప్రాంతాలను తీసుకుని కనీస వేతనం నిర్ణయించాం అన్నారు.

వేతనాలపై కీలక నిర్ణయాలు

అన్ స్కిల్డ్ కేటగిరీలో కనీస వేతనాన్ని రూ.12,750 నుంచి 16వేలకు పెంచాం అని రేవంత్ రెడ్డి తెలిపారు.
సెమీ స్కిల్డ్ కేటగిరీలో రూ. 13,152 నుంచి రూ.17 వేలకు పెంచాం అని, స్కిల్డ్ కేటగిరీలో రూ. 13,772 నుంచి రూ. 18,500 కు పెంచాం అని, హైలీ స్కిల్డ్ కేటగిరీలో రూ.14,607 నుంచి రూ.20 వేలకు పెంచాం అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో 1 కోటి 11 లక్షల మంది కార్మికులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
రాష్ట్ర ఆవిర్భావం తరువాత మొట్ట మొదటిసారిగా కార్మికుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయం ఇది అని, మా ప్రభుత్వం బాధ్యతతో కార్మికుల ప్రయోజనం కోసం నిర్ణయం తీసుకుంది అని రేవంత్ రెడ్డి చెప్పారు.

స్కిల్ యూనివర్సిటీతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

యువత ఉద్యోగాలు అంటే ఐటీ, అమెరికా అనే ఆలోచనను వీడాలని, ఉద్యోగాలు రాని, ఉపాధి అవకాశాలు లేని చదువులు వ్యర్థం అని, సాంకేతిక నైపుణ్యంతో జర్మనీ, జపాన్, సింగపూర్ లాంటి ఇతర దేశాల్లో అనేక అవకాశాలు ఉన్నాయని , రాష్ట్ర యువత స్కిల్స్‌ పెంచుకొని విదేశీ ఉద్యోగాలను అందిపుచ్చుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి యువతను ప్రోత్సహిస్తోందన్నారు. ఆ దిశగా యువత దృష్టి సారించాలని తెలిపారు. కృత్రిమమేధ వల్ల వైట్‌ కాలర్‌ ఉద్యోగాలకు ముప్పు ఉందిగానీ, బ్లూకాలర్‌ ఉద్యోగాలకు ఉండబోదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నైపుణ్యాలు పెంచుకుంటే ఉద్యోగ భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నైపుణ్యం ఉన్నవారు కావాలని విదేశాలు మమ్మల్ని సంప్రదిస్తున్నాయి. అందుకు అవసరమైన ప్రోత్సహకాలు ఇస్తున్నాం. నైపుణ్యాలు పెంచుకుంటే విదేశాల్లో రూ.2 లక్షల వరకు వేతనం వస్తుంది అని రేవంత్‌రెడ్డి అన్నారు.

ప్రజా సమస్యలను, దేశాల మధ్య యుద్ధాన్ని బీజేపీ, మోదీ ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే ఎన్నికలు అవగానే పెట్రోల్, డీజిల్ ధరలను రోజుకోసారి పెంచుతున్నారని విమర్శించారు. మా ప్రభుత్వం ప్రతీ అంశాన్ని దీర్ఘకాలిక దృష్టితో చూస్తుందని, అందుకే కార్మికుల కనీస వేతనం పెంపుపై నిర్ణయం తీసుకున్నాం అని చెప్పుకొచ్చారు.

కులగణనపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం

కులగణన విషయంలో సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అని, తెలంగాణ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు కూడా సమర్ధించడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం అని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో జనగణనతో పాటు కులగణన చేసి అన్ని వివరాలు ప్రజల ముందుంచాం అని, జనగణనలో కులగణన విషయంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిచింది అని చెప్పుకొచ్చారు. మోదీ ప్రభుత్వం తక్షణమే జనగణనలో కులగణన చేర్చి బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లుతో డీలిమిటేషన్‌తో లింక్‌ పెట్టి మోదీ ప్రభుత్వం కుయుక్తులు పన్నిందని, ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి..మహిళా బిల్లును మళ్లీ పార్లమెంట్‌లో పెట్టాలని మేం డిమాండ్ చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి :

యూఏఈ క్వీన్ మదర్‌కు కరీంనగర్ ఫిలిగ్రీ బాక్స్ కానుక
జార్ఖండ్ లో భారీగా మావోయిస్టుల లొంగుబాటు