Telangana BRS MLA Defection Case | సుప్రీంకోర్టు తీర్పుపై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల భిన్న స్పందనలు
ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై రాజకీయాల్లో కలకలం. తీర్పును బీఆర్ఎస్ స్వాగతించగా, కాంగ్రెస్, బీజేపీలు విభిన్నంగా స్పందించాయి. రాహుల్ గాంధీకి కేటీఆర్ సవాలు విసిరారు.

Telangana BRS MLA Defection Case | విధాత, హైదరాబాద్ : పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు భిన్నంగా స్పందించాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటుపై మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. సత్యమేవ జయతే అని ఎక్స్‌లో పోస్టు చేశారు. సుప్రీంకోర్టు తీర్పును భారత రాష్ట్ర సమితి స్వాగతిస్తోందని పేర్కొన్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం కాదని నిరూపించిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. గత ఎన్నికల సందర్భంగా పాంచ్ న్యాయం పేరుతో పార్టీ మారితే ఆటోమెటిక్ గా అనర్హత వర్తించాలని చెప్పిన రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తారని ఆశిస్తున్నానన్నారు. రాహుల్ గాంధీ చెప్పే మాటలకి, నీతులను కట్టుబడి ఉండాలని కేటీఆర్ సవాల్ చేశారు. దమ్ముంటే, నిజాయితీ ఉంటే అనర్హత వేటు విషయంలో పంచ న్యాయ పేరుతో చెప్పిన నీతులను ఆచరణలో చూపించాలని రాహుల్ గాంధీకి కేటీఆర్ సవాలు విసిరారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని మరింత కాలం అవహేళన చేయబోరని ఆశిస్తున్నానన్నారు. పార్టీ మారిన పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మరింత విచారణ అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో ప్రతిరోజు పాల్గొంటున్న ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన వెంటనే అనర్హత విధిస్తూ నిర్ణయం తీసుకోవాలన్నారు. భారత రాష్ట్ర సమితి తరపున సుప్రీంకోర్టులో వాదించిన న్యాయ బృందానికి ధన్యవాదాలు..పార్టీ తరఫున ఎన్నికైన 10 ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగి పార్టీ మారినా…. కష్టకాలంలో పార్టీ వెంట నిలిచిన లక్షల మంది కార్యకర్తలకు ధన్యవాదాలు అన్నారు. రానున్న మూడు నెలల కాలంలో 10 నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలకు మా పార్టీ సిద్ధం అవుతుందని తెలిపారు. ఈ దిశగా పని చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంతిమంగా సత్యం ధర్మం గెలిచిందని కేటీఆర్ తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కూడా సుప్రీంకోర్టు తీర్పును తమ పార్టీ స్వాగతిస్తుందన్నారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశ చరిత్రలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందన్నారు. ప్రజాస్వామ్యంపై సీఎం రేవంత్ రెడ్డికి గౌరవం ఉంటే వెంటనే ఫిరాయింపు ఎమ్మెల్యేలు 10 మందితో రాజీనామా చేయించి.. ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. గతంలో న్యాయవ్యవస్థను శాసించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.
సుప్రీంకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ స్పందన దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి విమర్శించారు. వాళ్లు చేస్తే న్యాయం, మేము చేస్తే అన్యాయమా? అని ప్రశ్నించారు.
గతంలో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యే లను వాళ్ల పార్టీలోకి చేర్చుకోలేదా? అని..చేర్చుకోవడమే కాదు వాళ్లకు మంత్రి పదవులు కూడా ఇచ్చారని మధుసూదన్ రెడ్డి గుర్తు చేశారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ సుప్రీం తీర్పు పట్ల బీఆర్ఎస్ వ్యాఖ్యలు విస్మయకరంగా ఉన్నాయన్నారు.
ఏ రాజ్యాంగం చెప్పిందని 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గతంలో బీఆర్ ఎస్ పార్టీలో చేర్చుకున్నారని ప్రశ్నించారు. పదవులు ఆశ చూపి కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని..
అప్పుడు కూడా ఇవే చట్టాలు ఉన్నాయి కదా? అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్ లో పడుకోవాలని ఏ చట్టం చెప్పిందని ప్రశ్నించారు.
బీజేపీ పార్టీ శాసన సభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసులో తాను కూడా పిటీషన్ దారుగా ఉన్నానని..3నెలల్లో స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలంటూ కోర్టు ఇచ్చిన తీర్పును స్పీకర్ అమలు చేయాలని కోరారు. ఎమ్మెల్యే దానం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండ పార్టీ మారడంతో పాటు మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఫిరాయింపు చట్టాలను ఉల్లంఘించారని గుర్తు చేశారు.