తెలంగాణ‌లో త్రిముఖ పోటీ!

తెలంగాణ పార్ల‌మెంటు ఎన్నిక‌ల ఫ‌లితాలు మ‌రో సంచ‌ల‌నానికి వేదిక కానున్నాయా? అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు మించి వివిధ పార్టీల అంచ‌నాలు త‌ల‌కిందులు కానున్నాయా? జెట్ స్పీడుతో కాంగ్రెస్ బ‌ల‌పడుతోందా? చాప‌కింద నీరులా బీజేపీ బ‌లం

  • Publish Date - April 18, 2024 / 06:49 AM IST

భారీగా లాభ‌ప‌డ‌నున్న కాంగ్రెస్‌?
బీఆరెస్ ఓటు షేర్‌కు కాంగ్రెస్ గండి
బీజేపీవైపు మ‌రికొంత ఓటు బ్యాంక్‌!
కారు దిగిపోయిన‌ క్షేత్ర‌స్థాయి క్యాడ‌ర్‌
లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తీవ్ర ప్ర‌భావం
కేసీఆర్‌పై ఇంకా కోపంతోనే రాష్ట్ర‌ ప్ర‌జ‌లు
అదే రేవంత్‌ స‌ర్కారుకు సానుకూలాంశం
25-30 అసెంబ్లీ సీట్ల‌లోనే నాడు ట్ర‌యాంగిల్ ఫైట్‌
2 శాతం తేడాతో అధికారం కోల్పోయిన బీఆరెస్‌
పార్లమెంటు ఎన్నిక‌ల్లో పుంజుకోనున్న‌ బీజేపీ ఓటింగ్‌

విధాత‌ ప్ర‌త్యేక ప్ర‌తినిధి: తెలంగాణ పార్ల‌మెంటు ఎన్నిక‌ల ఫ‌లితాలు మ‌రో సంచ‌ల‌నానికి వేదిక కానున్నాయా? అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు మించి వివిధ పార్టీల అంచ‌నాలు త‌ల‌కిందులు కానున్నాయా? జెట్ స్పీడుతో కాంగ్రెస్ బ‌ల‌పడుతోందా? చాప‌కింద నీరులా బీజేపీ బ‌లం పెరుగుతోందా? ఇప్ప‌టికే లీడ‌ర్‌, క్యాడ‌ర్‌ను పోగొట్టుకున్న బీఆరెస్ ప‌రిస్థితి ఏంటి? తెలంగాణ‌లో మొట్ట‌మొద‌టిసారిగా అన్ని పార్ల‌మెంటు స్థానాల్లో రియ‌ల్ ట్ర‌యాంగిల్ ఫైట్ జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో లాభం ఎవ‌రికి? న‌ష్టం ఎవ‌రికి?

2 శాతం ఓట్ల‌తో అధికారంలోకి కాంగ్రెస్‌…ఈసారి ?
మే 13న జ‌ర‌గ‌నున్న తెలంగాణ పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ పార్టీ ఊహించ‌ని స్థానాల‌ను గెలుచుకోబోతోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను మించి పార్ల‌మెంటు స్థానాలు ఆ పార్టీ ఖాతాలో ప‌డ‌నున్నాయ‌ని వివిధ స‌ర్వేల్లో తేటతెల్లం అవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు 39.40 శాతం ఓట్లు వ‌చ్చి 64 స్థానాలు గెలుచుకోగా, బీఆరెస్‌కు 37.35 శాతం ఓట్లు వ‌చ్చి 39 స్థానాల‌కు ప‌రిమిత‌మైంది. బీజేపీకి 13.90 శాతం ఓట్లు వ‌చ్చి 8 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది.

బీఆరెస్ ఓట‌మి త‌రువాత కూడా కేసీఆర్ నెల‌ల‌పాటు ఫాం హౌస్‌కే ప‌రిమిత‌మ‌వ‌డం, ఫోన్ ట్యాపింగ్‌, ఢిల్లీ మ‌ద్యం లిక్క‌ర్ కేసులు ముమ్మురం కావ‌డంతో బీఆరెస్ పార్టీ లీడ‌ర్‌తోపాటు క్యాడ‌ర్ కూడా మెజార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు జిల్లా నాయ‌కులు, మునిసిప‌ల్‌ చైర్మ‌న్లు, కార్పొరేట‌ర్లు, జ‌డ్పీ చైర్మ‌న్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, అదిలాబాద్ మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, మాజీ ఎంపీలు, రాజ్య‌స‌భ స‌భ్యులు, చివ‌ర‌కు జీహెచ్ఎంసీ మేయ‌ర్ స్థాయి నాయ‌కులు కూడా కాంగ్రెస్‌కు క్యూ క‌ట్టారు. ఎంపీపీలు, జ‌డ్పీటీసీలు, సర్పంచులు కూడా కాంగ్రెస్‌లో చేరిపోయారు. రాజ్య‌స‌భ స‌భ్యులు కేశ‌వ‌రావు, మేయ‌ర్ విజ‌య‌లక్ష్మితోపాటు ఎమ్మెల్యేలు కడియం శ్రీ‌హ‌రి, దానం నాగేంద‌ర్‌, తెల్లం వెంక‌ట్రావ్‌ అధికారికంగా కాంగ్రెస్‌లో చేరిపోగా, ఇంకా 12 మంది ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి వంటివారు బీజేపీలో చేరి బ‌రిలో ఉన్నారు. మూడు నెల‌ల్లో బీఆరెస్‌ను ఖాళీ చేస్తామ‌ని కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి లాంటివారు బ‌హిరంగంగానే చెబుతున్నారు.

బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఆగ‌ని వ‌ల‌స‌లు..!
బీఆరెస్‌కు ప్రస్తుతం 9 మంది ఎంపీలు ఉండగా.. ఇప్పటికే వారిలో ఐదురుగు గులాబీ జెండాను వదిలేశారు. వారిలో పెద్దపల్లి, వరంగల్, చేవెళ్ల ఎంపీలు వెంకటేశ్ నేత, పసునూరి దయాకర్, రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిపోగా, జహీరాబాద్, నాగర్ కర్నూలు ఎంపీలు బీబీ పాటిల్, రాములు బీజేపీలో చేరారు. ప్రస్తుతం నలుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. వారిలో ముగ్గురికి.. మాలోతు కవితకు మహబూబాబాద్‌, మన్నే శ్రీనివాస్‌రెడ్డికి మహబూబ్‌నగర్‌, నామా నాగేశ్వర్‌రావుకు ఖమ్మం టికెట్లు కేటాయించారు. మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇకపోతే మాజీ ఎంపీలు సీతారాంనాయక్‌, గోడెం నగేశ్‌, మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, ఆరూరి రమేశ్‌, జలగం వెంకట్రావు బీజేపీలో చేరిపోయారు. ఇక పట్నం మహేందర్‌రెడ్డి, పట్నం సునీతారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, తీగల అనితారెడ్డి, బొంతు రాంమోహన్‌, కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కొడుకు అమిత్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తున్నది.
ఇన్నాళ్లుగా బీఆరెస్‌లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పదవులు అనుభవించిన నేతలే పార్టీని వీడుతుండటంతో తమ పరిస్థితి ఏమిటన్న గందరగోళానికి కార్యకర్తలు గురవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారానికి దూరమైన తరుణంలో క్యాడర్‌కు భరోసానిస్తూ ముందుండి నడిపించాల్సిన ఎంపీ, ఎమ్మెల్యేలే కారు దిగి పోతుండటం.. ఇంకోవైపు పార్టీ అధినేత కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు కావడంతో పార్టీ శ్రేణుల్లో మరింత నైరాశ్యం కనిపిస్తున్నది. లోక్‌సభ ఎన్నికలకు ముందు వరుసగా సాగుతున్న బడా నేతల వలసలు చూస్తుంటే బీఆరెస్ కనీసం రెండు మూడు ఎంపీ సీట్లయినా గెలుస్తుందా అనే అనుమానాలు పార్టీ క్యాడ‌ర్‌లోనే బ‌ల‌ప‌డుతున్నాయి. ఇదే జ‌రిగితే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి మండల, గ్రామస్థాయి నాయకత్వం వరకు విస్తరిస్తుందన్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం.

ఓడిన నెల‌దాకా పార్టీని పట్టించుకోని కేసీఆర్‌
అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిన త‌రువాత కూడా కేసీఆర్ వైఖ‌రిలో ఏమాత్రం మార్పు రాలేద‌న్న ఆవేద‌న ఆ పార్టీ క్యాడ‌ర్‌లో బ‌లంగా ఉంది. ఆయ‌న నెల‌పాటు ఇంటికే ప‌రిమిత‌మైపోవ‌డం, అప్ప‌టికే ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగుచూసి ప‌లువురు పోలీసులు అధికారులు అరెస్టు అయ్యారు. ఇంత‌లో ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో క‌విత అరెస్టై తీహార్ జైలుకు వెళ్ల‌డంతో బీజేపీ బీఆరెస్ మ‌ధ్య లోపాయికారి పొత్తు బెడిసికొట్టింద‌న్న ఊహాగానాల‌కు ఊత‌మిచ్చింది. దీంతో అధికార కాంగ్రెస్‌లోకి బీఆరెస్ నుంచి వ‌ల‌స‌లు పెరిగాయి. బీఆరెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన వారు కూడా ఈ సంఘ‌ట‌న‌ల త‌రువాత కేసీఆర్ బ‌య‌ట‌కురాక‌పోవ‌డం వ‌ల్లే జంప్ చేశార‌ని చెబుతున్నారు. తెలంగాణలోని లోక్ సభ స్థానాలకు పోటీచేస్తున్న‌ అభ్యర్థులను పరిశీలిస్తే కాంగ్రెస్, బిజెపి పార్టీల త‌ర‌ఫున పోటీలోకి దిగింది మాజీ బిఆర్ఎస్ నాయకులే. కొన్ని పార్ల‌మెంటు నియోజకవర్గాల్లో అయితే ముగ్గురికి ముగ్గురు అభ్యర్థులు బిఆర్ఎస్ కు చెందిన తాజా మాజీలే.
వేరు వేరు పార్టీల నుండి ఎంపీ అభ్యర్థులుగా పోటీచేస్తున్న బీఆర్ఎస్, బిఆర్ఎస్ మాజీలు వీళ్లే…

వరంగల్ లోక్‌స‌భ నుంచి బీఆర్ఎస్ నుంచి మారేపల్లి సుధీర్ కుమార్ పోటీ చేస్తుండ‌గా, కాంగ్రెస్ నుంచి కడియం కావ్య (బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూతురు), బీజేపీ త‌ర‌ఫున అరూరి రమేష్ (బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే) పోటీలో ఉన్నారు. ఇక‌ మల్కాజిగిరి నుంచి కూడా బీఆర్ఎస్ – నుంచి రాగిడి లక్ష్మా రెడ్డి బ‌రిలో ఉండ‌గా, కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి (బిఆర్ఎస్ మాజీ జడ్పీ ఛైర్ పర్సన్, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి భార్య), బీజేపీ నుంచి ఈట‌ల రాజేందర్ (బిఆర్ఎస్ మాజీ నేత, మాజీ మంత్రి) పోటీలో ఉన్నారు. ఇక చేవెళ్ల లో పోటీప‌డుతున్న కాసాని జ్ఞానేశ్వర్ (బీఆరెస్‌), కాంగ్రెస్ – రంజిత్ రెడ్డి (బీఆరెస్ సిట్టింగ్ ఎంపీ) కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బిఆర్ఎస్ మాజీ ఎంపీనే కావ‌డం గ‌మ‌నార్హం. మొత్తం 17 పార్ల‌మెంటు స్థానాల్లో దాదాపు ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. బీజేపీ చాలా పెద్ద ఎత్తున సీట్ల‌ను గెలుచుకోనున్న‌ట్లు చెప్పుకుంటోంది కానీ, ఒక‌ప్ప‌టి మోడీకి ఉన్న క్రేజ్ ఇవ్వాళ లేదు. కేసీఆర్‌పై తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇంకా కోపం పూర్తిగా త‌గ్గ‌లేదు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి ప‌నితీరుపై పూర్తి స్తాయి సంతృప్తిలేక‌పోయినా, ఓడించాల‌న్నంత వ్య‌తిరేక‌త క‌నిపించ‌డం లేదు. దీంతో ఈ పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ బ‌ల‌ప‌డి, సీట్లు గెల‌వ‌డానికే ఎక్కువ అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఇటీవ‌ల చేసిన స‌ర్వేలు సైతం స్ప‌ష్టం చేస్తున్నాయి.

మొత్తంగా చూస్తే అటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ సంపాదించుకునే కొత్త ఓటు షేరు.. బీఆరెస్ నుంచి ఉండేదేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 25 నుంచి 30 నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్ర‌మే త్రిముఖ పోటీ నెల‌కొన్న‌ద‌ని గుర్తు చేస్తున్నారు. అయితే.. మారిన రాజ‌కీయ ప‌రిణామాల్లో నానాటికీ కునారిల్లిపోతున్న బీఆరెస్ షేరు గ‌ణ‌నీయంగా త‌గ్గిపోనున్న‌ద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బీజేపీ, కాంగ్రెస్ ఓటు షేరు పెరుగుతుంద‌ని చెబుతున్నారు. దానిని ఆధారంగా చేసుకుంటే ఈసారి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మొత్తం 17 స్థానాల‌కు గాను హైద‌రాబాద్ మిన‌హా మిగిలిన 16 సీట్ల‌లోనూ త్రిముఖ పోటీ నెల‌కొనే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని చెబుతున్నారు. అయితే.. సాధార‌ణంగా ట్ర‌యాంగిల్ ఫైట్‌లో ఎవ‌రో ఒక‌రు ల‌బ్ధి పొందే అవ‌కాశాలు ఉన్నా.. ఈసారి మాత్రం బీజేపీ పెంచుకునే ఓటు షేరు, కాంగ్రెస్ పెరిగే ఓటింగ్ శాతంతో అధికార పార్టీకే మెరుగైన విజ‌యావ‌కాశాలు ఉంటాయ‌ని విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ ప‌ది నుంచి 13 సీట్ల‌లో, బీజేపీ 3 నుంచి 4 సీట్ల‌లో గెలిచే అవ‌కాశం ఉండ‌గా.. బీఆరెస్ రెండు లేదా మూడు స్థానాల‌కు ప‌రిమిత‌మ‌వుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

 

Latest News