ముంబై: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీకి ఒక్క రోజు ముందు బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ లోక్‌సభ సభ్యురాలు నవనీత్ రాణా భర్త రవి రాణా.. ఉద్ధవ్ ఠాక్రె విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితాలు వచ్చిన పదిహేను రోజుల్లో ఉద్ధవ్ ఠాక్రె తిరిగి ఎన్డీయే కూటమిలో చేరుతారని అమరావతిని నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రవి అన్నారు. అందులో తిరుగులేదన్నారు. నరేంద్రమోదీ మరోసారి ప్రధాని కాగానే ఉద్ధవ్ ఠాక్రె ఆయన పక్కనే కనిపిస్తారని చెప్పారు. శివసేనలో చీలిక తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో ఉద్ధవ్ సేనకు మెరుగైన ఫలితాలు వస్తాయని ఎగ్జిట్‌పోల్స్ పేర్కొన్న నేపథ్యంలో రవి రాణా వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. మహారాష్ట్రలో బీజేపీ తర్వాత ఉద్దవ్ సేన రెండో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ‘మోదీ మరోసారి ప్రధాని అయిన పదిహేను రోజుల్లో ఉద్ధవ్ ఠాక్రె మోదీ ప్రభుత్వంలో మోదీ వెంట ఉంటారని ఘంటాపథంగా చెప్పగలను. ఎందుకంటే.. రాబోయేది మోదీ శకమేనని ఉద్ధవ్ ఠాక్రేకు తెలుసు’ అని రవి రాణా వ్యాఖ్యానించారు.
అవి పగటి కలలేనన్న ఉద్ధవ్ సేన నేత దూబే
ఇదిలా ఉంటే.. రవిరాణా వ్యాఖ్యలను ఉద్ధవ్ సేన సీనియర్ నేత అనంద్ దూబే కొట్టిపారేశారు. అదంతా ‘ముగేరీలాల్ కే హసీన్ సప్నే’ (పగటి కల) అని వ్యాఖ్యానించారు. ‘ఫలితాలు ఇంకా రానేలేదు. ఎవరు గెలుస్తారో? ఎవరు ఓడిపోతారో ఎవరికీ తెలియదు. మహారాష్ట్రలో ఉద్ధవ్ సేన ప్రధాన పక్షంగా ఎదిగిన తీరును చూసి వీరంతా భయపడిపోతున్నారు. నవనీత్ రాణా, రవి రాణా మొదటి నుంచీ మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వారు మా పార్టీని ద్వేషిస్తారు. వారి మాటలను మేం సీరియస్‌గా తీసుకోబోము. ఉద్ధవ్, మోదీ వంటి నేతల గురించి మాట్లాడే స్థాయి వారిది కాదు. మీరో గుడ్డిదీపం.. మేం సూర్యుడిలాంటివాళ్లం. మీ గౌరవాన్ని మీరు కాపాడుకుంటే మంచిది’ అని దూబే కౌంటర్ ఇచ్చారు.