SIM Binding | వాట్సాప్ యూజర్లకు ఊరట.. సిమ్ బైండింగ్ గడువు పెంపు!

SIM Binding | వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్స్‌లో సిమ్ బైండింగ్ విధానం అమలుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నిబంధనను అమలు చేయడంలో సోషల్‌మీడియా సంస్థలు సాంకేతిక సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ గడువును ఈ ఏడాది డిసెంబర్ వరకు పొడిగించాలని కేంద్రం భావిస్తోంది.

Reported by: Chandram | సైన్స్​ – టెక్నాలజీ | Mar 30, 2026, 11:06 pm IST
Read Time: 6 mins
SIM Binding | వాట్సాప్ యూజర్లకు ఊరట.. సిమ్ బైండింగ్ గడువు పెంపు!

SIM Binding | వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి సోషల్‌మీడియా మెసేజింగ్ యాప్స్ వాడే యూజర్లకు ఊరట! సిమ్ బైండింగ్ విధానం అమలుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విధానాన్ని అమలు చేసేందుకు డిసెంబర్ 2026 వరకు సోషల్‌మీడియా సంస్థలకు గడువు పొడిగించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో మీ ఫోన్‌లో సిమ్ లేకపోయినా ఆ యాప్స్ పనిచేయనున్నాయి.

సిమ్ బైండింగ్ అంటే ఏంటి?

సిమ్ బైండింగ్ విధానానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్‌‌లో మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం.. వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్స్‌ను వాడాలంటే ఆ అకౌంట్‌కు సంబంధించిన మొబైల్ నంబర్ ఉన్న సిమ్ కార్డు ఆ డివైజ్‌లో ఉండాలి. మీ ఫోన్‌లో ఉన్న సిమ్‌తోనే యాప్‌ను యాక్సెస్ చేయవచ్చు. సిమ్ కార్డు తీసేస్తే వాటిని ఉపయోగించడం కుదరదు. ఒకవేళ ఇతర డివైజ్‌లు వెబ్ వర్షన్లలో ఉపయోగించాలంటే ప్రతిసారి ధ్రువీకరణ ప్రక్రియ (Authentication) పూర్తి చేయాల్సి ఉంటుంది.

సిమ్ బైండింగ్‌తో లాభమేంటి?

సిమ్ కార్డు లేని మొబైల్‌‌లో వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి సోషల్‌మీడియా యాప్స్ ఉపయోగించడం కుదరదు. అలాగే వాట్సాప్ వెబ్ వంటి వెబ్ వర్షన్లలో లాగిన్ అయితే.. నిర్దిష్ట వ్యవధి తర్వాత యూజర్లు ఆటోమేటిక్‌గా లాగౌట్ అవ్వాల్సి వస్తుంది. తిరిగి ఉపయోగించాలంటే మళ్లీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల కొంత అసౌకర్యానికి గురైనప్పటికీ.. సోషల్ మీడియా యాప్స్‌ హ్యాకర్ల బారిన పడకుండా సెక్యూరిటీ పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

నిబంధనల అమలులో సాంకేతిక సవాళ్లు!

సిమ్ బైండింగ్ మార్గదర్శకాలు విడుదల చేసిన సమయంలోనే.. దీన్ని అమలు చేసేందుకు సోషల్‌మీడియా కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం మూడు నెలల గడువునిచ్చింది. ఆ తర్వాత సిమ్ లేని ఫోన్లలో సేవలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ నిబంధనను అమలు చేయడానికి మరికొంత సమయం కావాలని సోషల్‌మీడియా కంపెనీలు తాజాగా కేంద్రాన్ని కోరాయి. ఈ నిబంధనను అమలు చేయడంలో అనేక సాంకేతిక సవాళ్లు ఎదురవుతున్నాయని కేంద్రం దృష్టికి తీసుకొచ్చాయి. కొత్త నిబంధనలకు అనుగుణంగా యాప్‌లో మార్పులు చేయడం, ఓఎస్‌లకు అనుగుణంగా అప్‌డేట్స్ ఇవ్వడం, వివిధ డివైజ్‌ల మధ్య సమన్వం పాటించడం వంటి అంశాలు పెద్ద సవాళ్లుగా మారాయని వివరించాయి. సిమ్ బైండింగ్ అమలు చేయడానికి మరికొంత సమయం కావాలని కోరాయి.

సోషల్‌మీడియా కంపెనీల వినతులపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలుస్తోంది. గడువును పొడిగించేందుకు సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. సిమ్ బైండింగ్ నిబంధనను అమలు చేయడానికి ఈ ఏడాది చివరి వరకు అవకాశం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి కేంద్రం ఇచ్చిన గడువు ఫిబ్రవరి 28తో ముగిసింది. దీంతో మార్చి 1 నుంచి సిమ్ కార్డు లేని ఫోన్లలో వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్, ఆరట్టై వంటి యాప్స్ ఆగిపోతాయని అందరూ భావించారు. కానీ వాటి సేవలు ఇంకా నిలిచిపోలేదు. అంటే సిమ్ బైండింగ్ సేవలను అమలులోకి రాలేదని తెలుస్తోంది.

Read More:

ఫోన్‌పే, గూగుల్ పే వాడుతున్నారా.. ఈ ఆప్షన్ మార్చుకోకుంటే మీ ఖాతా ఖాళీ!

సమ్మర్‌లో మీ మొబైల్ ఫోన్ త్వరగా హీటెక్కుతుందా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!