SRH wins over PBKS : ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఘనవిజయం
ప్లేఆఫ్స్‌లో రెండోస్థానానికి చేరుకోవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్రైజర్స్ పంజాబ్‌పై ఘనవిజయం సాధించి లీగ్ దశను సగర్వంగా ముగించింది. ఇక కాసేపట్లో మొదలయ్యే రాజస్థాన్–కోల్కతా మ్యాచ్ ఫలితంపై హైదరాబాద్ ప్లేఆఫ్స్ స్థానం ఆధారపడిఉంది.

ఐపిఎల్ 2024లో భాగంగా హైదరాబాద్‌లో సన్రైజర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన వారి ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఘనవిజయం సాదించింది. దాంతో ప్లేఆఫ్స్ గిఫ్ట్ ప్లేస్ అయిన రెండో స్థానానికి పోటీదారుగా నిలబడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టుకు శుభారంభం లభించింది. కొత్త కెప్టెన్ జితేశ్ శర్మ సారథ్యంలో బరిలో దిగిన కింగ్స్ జట్టు ఓపెనర్లు అధర్వ, ప్రభ్‌సిమ్రన్‌సింగ్ ధాటిగా ఆట ప్రారంభించారు. ఎడాపెడా ఫోర్లు, సిక్స్లు బాదుతూ స్కోర్‌బోర్డును ఉరకలెత్తించారు. 9.1 ఓవర్లలలో 97 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్ రూపంలో అధర్వ తైదే (46) వెనుదిరిగాడు. ప్రభ్‌సిమ్రన్‌తో జతకలిసిన మరో డ్యాషింగ్ బ్యాటర్ రిలో రోసౌ పరుగుల వేగాన్ని కొనసాగించాడు. 10.1 ఓవర్లలో 100 పరుగులను చేరుకున్న పంజాబ్ 13.4 ఓవర్లో 150 పరుగులను దాటిన ఒక్క పరుగుకే ప్రభ్‌సిమ్రన్(71)ను కోల్పోయింది. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లను పారేసుకున్న పంజాబ్, నిర్జీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు సాధించింది.
వర్షం పడే అవకాశముండటంతో, డిఎల్ఎస్ రంగంలోకి దిగుతుందన్న అనుమానంతో పక్కా క్లారిటీతో బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్కు తొలిబంతికే భారీ దెబ్బ తగిలింది. వారి డ్యాషింగ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(0) అర్షదీప్ వేసిన మొదటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ, మరో ఓపెనర్ అభిషేక్ శర్మతో చేరిన రాహుల్ త్రిపాఠి వికెట్లను కాపాడుకుంటూ దూకుడు పెంచి ఆటలో వేగం పెంచారు. ముఖ్యంగా అభిషేక్ తన సహజమైన దూకుడు ప్రదర్శించి అద్భుతంగా ఆడాడు. 72 పరుగుల జట్టు స్కోరు వద్ద త్రిపాఠి(33) అవుటయినా, వచ్చిన క్లాసెన్ పరిణితి ప్రదర్శిస్తూ ఆటను కొనసాగించారు. ఇద్దరూ డిఎల్ఎస్ పార్ స్కోరును గమనిస్తూ ఎప్పుడూ దాన్ని దాటిఉండేలా చూసుకున్నారు. 129 పరుగుల వద్ద అభిషేక్ శర్మ(66: 5 ఫోర్లు, 5 సిక్స్లు) అవుటవగా, నితీశ్కుమార్రెడ్డి, క్లాసెన్లు నింపాదిగా ఆడారు. నితీశ్(37), షాబాజ్(3) వెంటవెంటనే పెవిలియన్కు చేరుకున్నా, క్లాసెన్, సమద్ సంయమనం కోల్పోలేదు. ఆఖర్లో క్లాసెన్(42) అవుటయినా, సన్వీర్తో కలిసి సమద్(11) లాంఛనాన్ని పూర్తి చేసాడు. మొత్తానికి 19.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసి సన్రైజర్స్ విజయం సాధించింది. ఈ ఘనవిజయంతో తన పాయింట్లను 17కు పెంచుకుని తాత్కాలికంగా రెండోస్థానానికి చేరుకుంది. అసలైన రెండో స్థానం కోసం తనవంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించిన సన్రైజర్స్, ఆఖరు మ్యాచ్ ( రాజస్థాన్–కోల్కతా) ఫలితం కోసం ఎదురుచూస్తోంది.