Mexico Tradition | మొసలిని మనువాడిన మేయర్.. మెక్సికోలో విచిత్ర సంప్రదాయం
ఈ సంప్రదాయం 230 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. చోంటాల్ రాజు (ప్రతినిధిగా మేయర్) హువావే రాజకుమార్తె (ప్రతినిధిగా మొసలి)ను పెళ్లి చేసుకున్నట్టు చరిత్ర చెబుతోంది.

Mexico Tradition | దక్షిణ మెక్సికోలోని ఓక్సాకా రాష్ట్రంలోని శాన్ పెడ్రో హామెలులా పట్టణంలో ఒక అద్భుతమైన సంప్రదాయం కొనసాగుతోంది. అక్కడి మేయర్ డానియెల్ గుటియెరెజ్ ఓ ఆడ మొసలిని వివాహం చేసుకున్నారు. ఇది సాధారణ పెళ్లి కాదు. రెండు జాతుల మధ్య శాంతి, ప్రకృతితో మమేకమవడం కోసం జరిగే ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమం.
ఈ సంప్రదాయం 230 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. చోంటాల్ రాజు (ప్రతినిధిగా మేయర్) హువావే రాజకుమార్తె (ప్రతినిధిగా మొసలి)ను పెళ్లి చేసుకున్నట్టు చరిత్ర చెబుతోంది. ఈ పెళ్లి ప్రకృతితో ఐక్యతను సూచించే ఒక చిహ్నంగా భావించబడుతుంది. వర్షాలు బాగా పడాలని, పంటలు బాగా పండాలని ప్రకృతి ఆశీస్సులు కోరుతూ ఈ విధమైన పెళ్లి జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కప్పల పెళ్లి లాగాన్నమాట.
వివాహానికి ముందు మొసలిని పల్లకీలో ఊరేగిస్తారు. ప్రజల అభివాదాల కోసం ఇంటింటికీ తిప్పుతూ పెళ్లి మంటపానికి తీసుకెళ్తారు. మొసలిని వధువులా తెలుపు గౌనుతో అలంకరిస్తారు. భద్రత కోసం తన నోటిని కట్టేసి ఉంచుతారు. మేళతాళాల మధ్య మేయర్ మరియు మొసలి వధువు నృత్యం చేస్తారు. అనంతరం మేయర్ ఆమె ముట్టెపై ముద్దు పెడతారు. ఇదే ఈ సంప్రదాయ వివాహానికి ముగింపు సంకేతం. ప్రజలు దీనిని ఎంతో భక్తిగా జరుపుకుంటారు. గతంలో మేయర్‌గా పనిచేసిన విక్టర్ హ్యూగో సోసా కూడా ఇదే సంప్రదాయాన్ని పాటించారు.
“ప్రేమ లేకుండా పెళ్లి ఉండదు. నేను ఈ రాజకుమార్తెను ప్రేమిస్తున్నాను. అందుకే ఈ బంధానికి అంగీకరిస్తున్నాను,” అని ఆయన అప్పట్లో చెప్పారు. ఈ వేడుకలు అక్కడి ప్రజలలో ఐక్యతను, ప్రకృతి పట్ల గౌరవాన్ని పెంపొందించే ఓ సాంప్రదాయక ఉత్సవంగా కొనసాగుతున్నాయి.