A Bride, Two Grooms | వధువు ఒక్కరు – వరులు ఇద్దరు : హిమాచల్‌లో విచిత్ర వివాహం

హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లా షిల్లాయ్ గ్రామంలో ఇద్దరు సహోదరులు ఒకే వధువును వివాహం చేసుకున్న సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శతాబ్దాలుగా ఉన్న హట్టి బహుభర్తృత్వ సంప్రదాయాన్ని బహిరంగంగా పాటిస్తూ , ఈ పెళ్లి మూడు రోజుల పాటు ఘనంగా జరిగింది. వధువు, ఇద్దరు వరుల పరస్పర అంగీకారంతో, సాంప్రదాయ వంటకాలతో, పహాడీ పాటలతో సాగిన ఈ వివాహం హట్టి సమాజం తమ వారసత్వాన్ని గర్వంగా ప్రదర్శించింది.

A Bride, Two Grooms | వధువు ఒక్కరు – వరులు ఇద్దరు : హిమాచల్‌లో విచిత్ర వివాహం

Adharva / National News / Viral News / 19 July 2025

A Bride, Two Grooms | హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లా షిల్లాయ్ గ్రామంలో జరిగిన ఓ విభిన్నమైన వివాహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వధువు సునీతా చౌహాన్‌ను ఇద్దరు సహోదరులు — ప్రదీప్ నేగి మరియు కపిల్ నేగి — వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి హట్టి సమాజానికి చెందిన పురాతన బహుభర్తృత్వ() సంప్రదాయాన్ని బహిరంగంగా పాటించడం ద్వారా ప్రత్యేకత సాధించింది. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఆచారం సాధారణంగా బయటకు రాని విషయం. కానీ, ఈ పెళ్లి బహిరంగ వేదికపై, సమాజం మధ్యలో, వారసత్వ సంప్రదాయానికి గౌరవం ఇచ్చే విధంగా జరిగింది.

ప్రదీప్ నేగి జల్‌శక్తి విభాగంలో పనిచేస్తుండగా, కపిల్ విదేశాలలో హాస్పిటాలిటీ రంగంలో పనిచేస్తున్నాడు. ఇద్దరూ వేర్వేరు ప్రదేశాల్లో జీవిస్తున్నప్పటికీ, ఈ వివాహాం ద్వానా సంస్కృతిని కాపాడేందుకు కలిసివచ్చారు. “ఇది మా ఇద్దరి నిర్ణయం. ఇది నమ్మకం, పరస్పర బాధ్యతల ప్రతీక. మా మూలాలపై గర్వంతో ఈ సంప్రదాయాన్ని బహిరంగంగా పాటించాము” అని ప్రదీప్ తెలిపారు. కపిల్ మాట్లాడుతూ, “నేను విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ, ఈ వివాహం ద్వారా మా భార్యకు ఒక సమిష్టి కుటుంబం నుంచి మద్దతు, స్థిరత్వం, ప్రేమ అందేలా చేసాము” అని చెప్పారు. వధువు సునీతా చౌహాన్ కూడా తన నిర్ణయాన్ని స్వేచ్ఛగా తీసుకున్నానని స్పష్టంగా చెప్పింది. “ఇది నా ఇష్టంతో చేసుకున్న వివాహమే. ఎలాంటి ఒత్తిడి లేదు. మా బంధం మీద నమ్మకం ఉంది” అని ఆమె చెప్పింది.

హట్టి బహుభర్తృత్వ సంప్రదాయం ప్రాచీన కాలంలో పర్వత ప్రాంతాల ప్రజల జీవన విధానంలో ఒక భాగంగా ఉండేది. ముఖ్యంగా పూర్వీకుల భూమిని విభజించకుండా కాపాడటం, సోదరులు వేర్వేరుగా జీవించడం వల్ల కుటుంబం విచ్ఛిన్నం కాకుండా ఉండటం, విధవలకు రక్షణ కల్పించడం ఈ సంప్రదాయ వెనుక ప్రధాన ఉద్దేశ్యాలు. షిల్లాయ్ గ్రామానికి చెందిన బిషన్ తోమర్ మాట్లాడుతూ, “మా గ్రామంలో ఇలాంటి కుటుంబాలు ముప్పైకి పైగా ఉన్నాయి. ఇద్దరు లేదా ముగ్గురు సహోదరులు ఒకే భార్యను పెళ్లి చేసుకోవడం మామూలే. కానీ ఇవి ఎక్కువగా బహిరంగంగా జరగవు. ఈ పెళ్లి మాత్రం బహిరంగంగా జరిగి అందరినీ ఆకట్టుకుంది” అన్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో వందలాది మంది గ్రామస్తులు, బంధువులు పాల్గొన్నారు. ప్రాంతీయ పహాడీ పాటలు, నృత్యాలతో, సాంప్రదాయ వంటకాలతో వేడుక ఉత్సాహంగా సాగింది. హట్టి సమాజం తాజాగా షెడ్యూల్డ్ తెగ హోదా పొందిన నేపథ్యంలో, ఈ వివాహానికి మరింత ప్రాధాన్యం వచ్చింది. ఇది కేవలం సంప్రదాయాన్ని కాపాడటమే కాకుండా, కొత్త తరాలు ఆ సంప్రదాయాన్ని గౌరవంగా స్వీకరిస్తున్నాయనే సందేశాన్ని అందిస్తోంది. ఒప్పందం, నిజాయితీ, పరస్పర గౌరవం ఉన్నప్పుడు సంప్రదాయాలు ఈ తరంలో కూడా ఎలా కొనసాగవచ్చో ఈ వివాహం నిరూపించింది.