Maleriraptor kuttyi | తెలంగాణలో జీవించిన.. డైనోసార్‌ మలేరిరాప్టర్ కుట్టి గురించి మీకు తెలుసా?

ప్రారంభ కార్నియన్‌ రేడియేషన్‌ కంటే కొంచెం చిన్నదైన డైనోసార్‌ అవశేషాల సమూహం ఈ ప్రాంతంలో లభ్యమైనట్టు ఈ అధ్యయనంలో భాగం పంచుకున్న పాలియోంటాలజిస్టు చెప్పారు.

Maleriraptor kuttyi | తెలంగాణలో జీవించిన.. డైనోసార్‌ మలేరిరాప్టర్ కుట్టి గురించి మీకు తెలుసా?

Maleriraptor kuttyi | భారతదేశంలో డైనోసార్లు సంచరించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ గడ్డపై నడిచిన కొత్త జాతి డైనోసార్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘మలేరిరాప్టర్ కుట్టి’ (Maleriraptor kuttyi) అనే ఈ డైనోసార్‌.. సుమారు 22 కోట్ల సంవత్సరాల క్రితం ఇది సంచరించినట్టు తేల్చారు. ట్రయాసిక్ కాలం నాటి నోరియన్ యుగంలో ఇది జీవించింది. చిన్న నుండి మధ్య తరహా మాంసాహార డైనోసార్లైన హెర్రెరసౌరియా సమూహానికి చెందినదిగా గుర్తించారు. గోండ్వానా ప్రాంతంలో శాకాహార డైనోసార్లు (Dinosaur) పెద్ద సంఖ్యలో ఉండేవి. వాటిపై జరిగిన దాడి సమయంలో హెర్రెరసౌరియా సమూహం తప్పించుకున్నట్టు మలేరిరాప్టర్ కుట్టి ఆవిష్కరణ మొదటిసారిగా రుజువు చేస్తున్నది. ఈ పరిశోధనను రాయల్‌ సొసైటీ ఓపెన్‌ సైన్స్‌ జర్నల్‌ లో (Royal Society Open Science) ప్రచురించారు.

అర్జెంటీనా, దక్షిణ బ్రెజిల్‌ ప్రాంతాల్లోనే హెర్రారసౌరియా సమూహానికి చెందిన (సుమారు 22, 23 కోట్ల సంవత్సరాల క్రితం) నాలుగు జాతుల డైనోసార్లను మాత్రమే ఇప్పటి వరకూ గుర్తించినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘ఇవి రెండు కాళ్లపై నడిచేవి. 3.9 అడుగుల నుంచి 19.7 అడుగుల వరకూ పెరిగేవి’ అని ఈ అధ్యయనంలో పాల్గొన్న పాలియోంటాలజిస్ట్ డాక్టర్‌ మార్టిన్ ఎజ్కురా తెలిపారు. హెర్రెరసౌరియా సమూహాలు దక్షిణ అమెరికా వెలుపల జీవించి ఉండేందుకు అవకాశాలపై 1990లలో తొలిసారి ఆలోచనలు వచ్చాయని చెప్పారు.

మలేరిరాప్టర్ కుట్టి.. అవశేషాలను తొలిసారి తెలంగాణలోని అన్నారం గ్రామ సమీపంలో ప్రాణహిత, గోదావరి లోయలో 1980లలో గుర్తించారు. ప్రారంభ కార్నియన్‌ రేడియేషన్‌ కంటే కొంచెం చిన్నదైన డైనోసార్‌ అవశేషాల సమూహం ఈ ప్రాంతంలో లభ్యమైనట్టు ఈ అధ్యయనంలో భాగం పంచుకున్న పాలియోంటాలజిస్టు చెప్పారు. దాదాపు 227-220 మిలియన్ సంవత్సరాల క్రితం శాకాహార డైనోసార్ జాతి అయిన రైంకోసార్‌లు సామూహికంగా అంతరించిపోయాయి. అయితే.. ఈ డైనోసార్లు దాని నుంచి బయటపడినట్టు మలేరిరాప్టర్ కుట్టి అవశేషాల ఆవిష్కరణ రుజువు చేస్తున్నదని పరిశోధకులు అంటున్నారు.

రైంకోసార్‌లు అంతరించిపోయాక నోరియన్‌ ప్రారంభం కాలంలో హెర్రెరసౌరస్‌లు గోండ్వానాలో జీవించినట్టు మలేరిరాప్టర్‌ కుట్టికి సంబంధించిన అస్తికల ద్వారా వెల్లడవుతున్నదని అధ్యయనం పేర్కొన్నది. దక్షిణ అమెరికాలో కాకుండా ప్రారంభ నోరియన్‌ కాలంలో ఇండియాలో ఈ హెర్రెరసౌరస్‌లు కనిపించడానికి ఒక కారణాన్ని కూడా పరిశోధకులు ప్రస్తావిస్తున్నారు. ఇండియాలో సగటు ఉష్ణోగ్రతలు ఇందుకు కారణమని, ఇదే తరహా ఉష్ట్రోగ్రతలు ఉత్తరమ అమెరికాలో కూడా నోరియన్‌ కాలంలో ఉన్నాయని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

Z+ Security | పిల్ల ఏనుగుకు ‘జ‌డ్ ప్ల‌స్’ సెక్యూరిటీ.. చూస్తే మ‌తి పోవాల్సిందే..!
Cobra Dry Bites | కోబ్రా కాట్లన్నీ విషపూరితమేనా? వాటి విషం, పొడి కాట్ల వెనుక రహస్యాలేంటి?
Supreme court | ఆర్మీ ఉద్యోగ నియామకాలపై సుప్రీం చురకలు!