Elephants Humanity | వీడియో : గజరాజుల ‘మానవత్వం’ – మనుషుల్ని మించిపోయాయి
మూగ జీవుల్లో వాటి సంరక్షకుల పట్ల ఎంతటి ప్రేమ భావన ఉంటుందో నిరూపిస్తున్నది ఈ వీడియో..

Elephants Humanity | “ప్రేమ చూపించడానికి మాటలు అవసరం లేదు… ఒక స్పందన చాలు… అనే భావాన్ని కళ్లకుకట్టినట్లుగా చూపించాయి థాయిలాండ్‌కి చెందిన ఓ ఏనుగుల గుంపు తీవ్ర వర్షం కురుస్తున్న వేళ, తమ సంరక్షకురాలి చుట్టూ చేరి ఆమెకు తడవకుండా రక్షణ కల్పించిన ఆ ఏనుగుల ప్రేమ… ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని కదిలిస్తోంది. ఈ హృద్య దృశ్యాన్ని లెక్ చైలర్ట్ (Lek Chailert), థాయిలాండ్‌లోని Save Elephant Foundation వ్యవస్థాపకురాలు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
“ఫా మై” Faa Mai – నిశ్శబ్ద ప్రేమకు నిదర్శనం
చైలర్ట్ తన సంరక్షణలో ఉన్న ఏనుగులతో పాటుగా వర్షంలో నిలిచిన సమయంలో, ఫా మై అనే ఏనుగు తన మృదువైన తొండంతో ఆమె భద్రతను నిర్ధారించుకుంటూ, మిగిలిన ఏనుగులను ఆమె చుట్టూ గుంపుగా చేర్చి మధ్యలో ఆమెకు నొప్పి కలుగకుండా అడ్డుగా నిలబడింది. “వర్షం బాగా పడుతున్న వేళ.. ఒక్కొక్కటిగా ఏనుగులు వచ్చి నా చుట్టూ చేరాయి. కానీ ఫా మై మాత్రం మిగిలిన ఏనుగుల వత్తిడి నన్ను నొప్పించవచ్చని భయపడి నన్ను కాపాడేందుకు తన ఒంటినే రక్షణగా మార్చింది…” అంటూ చైలర్ట్ ఆ క్షణాల్ని గుర్తు చేసుకుంది.
మూగజీవుల్లోనూ మానవత్వపు జాడలు ఉంటాయని ఈ ఫామై ఏనుగు నిరూపించింది. సాధారణంగా ఏనుగులు మనుషులతో మంచి బంధాన్ని ఏర్పరుచుకుంటాయి. ఇక తనతోనే ఉండే వారిపట్ల వాటి ప్రేమ వర్ణనాతీతం. ఈ సంఘటన చూసిన నెటిజన్లు తమ భావోద్వేగాలను ఉప్పొంగిస్తూ స్పందించారు. “ఈ ప్రేమ వర్ణించలేం… ఆ మృదువైన స్పర్శలో ప్రేమ, నమ్మకం కనిపిస్తున్నాయి” అని ఒకరు రాయగా.. “ఇది నటించలేని బంధం… ఇది నిజమైనది, మనసును కదిలించేది.” అని మరొకరు స్పందించారు. “ఏనుగులు మనుషులను మించిన ప్రేమైకజీవులు అనే విషయానికి ఇది మరో బలమైన సాక్ష్యం” అని ఒకరు పేర్కొన్నారు. “ఫా మై – నీవు దేవతలా కనిపిస్తున్నావు.” అని ఒక యూజర్ తన మనసులో మాట చెప్పారు. ఈ వీడియో కేవలం ఓ వైరల్ క్లిప్ కాదు. ఇది ఓ జీవి నుంచి మరో జీవికి పుట్టే ప్రేమకు, విశ్వాసానికి, రక్షణకు నిలువెత్తిన నిదర్శనంగా నిలుస్తున్నది.