Smart Bandage | గాయాలు వేగంగా మానేందుకు స్మార్ట్‌ బ్యాండేజ్‌లు.. అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు..!

Smart Bandage : మనకు కత్తి, బ్లేడు లాంటివి తెగినా.. ముళ్లు, గోర్లు లాంటివి గీరుకుపోయినా.. కాలిన గాయాలు అయినా.. లేదంటే ఇతర కారణాలతో గాయపడ్డా.. శరీరం తనంతట తానుగా ఆ గాయాన్ని నయం చేసుకుంటుంది. కానీ అన్ని సందర్భాల్లో ఇది సాధ్యం కాదు. ఎందుకంటే మధుమేహం ఉన్నవాళ్లకు గాయాలు అయితే త్వరగా మానవు. పైగా గాయం దగ్గర ఇన్‌ఫెక్షన్‌ కావడం, లేదంటే చీము పట్టడం జరుగుతుంది.

  • Publish Date - June 1, 2024 / 02:28 PM IST

Smart Bandage : మనకు కత్తి, బ్లేడు లాంటివి తెగినా.. ముళ్లు, గోర్లు లాంటివి గీరుకుపోయినా.. కాలిన గాయాలు అయినా.. లేదంటే ఇతర కారణాలతో గాయపడ్డా.. శరీరం తనంతట తానుగా ఆ గాయాన్ని నయం చేసుకుంటుంది. కానీ అన్ని సందర్భాల్లో ఇది సాధ్యం కాదు. ఎందుకంటే మధుమేహం ఉన్నవాళ్లకు గాయాలు అయితే త్వరగా మానవు. పైగా గాయం దగ్గర ఇన్‌ఫెక్షన్‌ కావడం, లేదంటే చీము పట్టడం జరుగుతుంది. ఈ గాయాలు బాధితులను బలహీనపర్చడమే కాదు, ఆరోగ్య వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఈ క్రమంలో గాయాలు వేగంగా మానడానికి కాలిఫోర్నియాలోని కాల్‌టెక్‌ యూనివర్సిటీ ఒక స్మార్ట్‌ బ్యాండేజ్‌ను రూపొందించింది.

ఈ స్మార్ట్ బ్యాండేజ్‌ అత్యంత ప్రభావవంతంగా పనిచేసి గాయం త్వరగా మానేందుకు తోడ్పడుతుంది. పైగా ఈ బ్యాండేజ్‌కు అయ్యే ఖర్చు కూడా తక్కువ. ఈ స్మార్ట్ బ్యాండేజీలను మెడికల్ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్, హెరిటేజ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకుడు రొనాల్డ్‌ అండ్‌ జో అన్నె విల్లెన్స్‌ స్కాలర్‌ వీ గావోకు చెందిన ల్యాబ్‌లో అభివృద్ధి చేశారు. చాలా రకాల దీర్ఘకాలిక గాయాలు ఉంటాయని, ముఖ్యంగా డయాబెటిక్ అల్సర్లు, కాలిన గాయాలు ఎక్కువ రోజులు మానకుండా రోగికి తీవ్ర సమస్యలు కలిగిస్తాయని వీ గావో అన్నారు. అందుకే ఇలాంటి గాయాలు మానడాన్ని సులభతరం చేసే టెక్నాలజీకి డిమాండ్‌ ఏర్పడిందని చెప్పారు.

మూడు రకాలుగా ఉపయోగం

శోషక పదార్థ పొరలను మాత్రమే కలిగి ఉండే సాధారణ బ్యాండేజ్‌ల మాదిరిగా కాకుండా, స్మార్ట్ బ్యాండేజ్‌లను ఎలక్ట్రానిక్స్, ఔషధాలు కలిగిన సౌకర్యవంతమైన సాగే పాలిమర్‌తో తయారు చేస్తారు. ఈ బ్యాండేజ్‌లోని ఎలక్ట్రానిక్స్.. యూరిక్ యాసిడ్ లేదా లాక్టేట్ అణువులను, గాయంలో మంటను, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ను, pH స్థాయిలను, గాయం ఉష్ణోగ్రతను పర్యవేక్షించడానికి సెన్సార్‌ను అనుమతిస్తాయి. ఈ స్మార్ట్‌ బ్యాండేజ్ మూడు విధాలుగా స్పందిస్తుంది. మొదటిది.. గాయం నుంచి సేకరించిన సమాచారాన్ని ఈ స్మార్ట్‌ బ్యాండేజ్‌ కంప్యూటర్, టాబ్లెట్ లేదా స్మార్ట్‌ఫోన్‌కు చేరవేసి.. రోగి లేదా వైద్యుడు ఆ గాయాన్ని పర్యవేక్షించడానికి సాయపడుతుంది. రెండవది.. స్మార్ట్‌ బ్యాండేజ్‌ లోపల ఉన్న యాంటీబయాటిక్స్‌ లేదా ఇతర మందులను అది నొప్పి, ఇన్‌ఫెక్షన్ ఉన్న ప్రదేశానికి నేరుగా పంపుతుంది. మూడవది.. ఈ స్మార్ట్‌ బ్యాండేజ్‌ కణజాల పెరుగుదలను ప్రేరేపించడానికి గాయానికి తక్కువ-స్థాయి విద్యుత్‌ క్షేత్రాన్ని అందజేస్తుంది. అందువల్ల గాయం త్వరగా మానుతుంది.

జంతువుల్లో ప్రయోగం సక్సెస్‌..

పరిశోధకులు జంతువులపై ఈ స్మార్ట్‌ బ్యాండేజీలను ప్రయోగించి చూశారు. మనుషుల్లో మాదిరిగానే పశువుల్లో కూడా కనిపించే దీర్ఘకాలిక గాయాలపై ఈ స్మార్ట్‌ బ్యాండేజీలు సమర్థవంతంగా పనిచేశాయి. పరిశోధన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని వీ గావో చెప్పారు. కెక్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సహకారంతో భవిష్యత్‌లో ఈ బ్యాండేజ్ సాంకేతికతను మెరుగుపర్చడంపై దృష్టిపెడుతామని ఆయన చెప్పారు. అదేవిధంగా మానవుల్లో కూడా ఈ స్మార్ట్‌ బ్యాండేజీ పనితీరును పరిశీలిస్తామన్నారు. ఎందుకంటే గాయం మానేందుకు కావాల్సిన చికిత్సా అవసరాలు.. జంతువులతో పోల్చితే మానవుల్లో కొంచెం భిన్నంగా ఉంటాయని తెలిపారు.

సైన్స్‌ అడ్వాన్సెస్‌ జర్నల్‌..

ఈ పరిశోధనను వివరించే పత్రం ‘ఎ స్ట్రెచేబుల్‌ వైర్‌లెస్‌ వియరెబుల్‌ బయోఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌ ఫర్ మల్టీ ప్లెక్స్‌డ్‌ మానిటరింగ్‌ అండ్‌ కాంబినేషన్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్‌ఫెక్టెడ్‌ క్రానిక్‌ వౌండ్స్’.. మార్చి 24 నాటి సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో కనిపిస్తుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, ద నేషనల్ సైన్స్ ఫౌండేషన్, ద ఆఫీస్ ఆఫ్ నేవల్ రిసెర్చ్, ద హెరిటేజ్ మెడికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ది డోనా అండ్‌ బెంజిమన్‌ ఎం రోసెన్‌ బయో ఇంజినీరింగ్ సెంటర్‌ ఎట్‌ కాల్‌టెక్‌, కాల్‌టెక్‌లోని రోథెన్‌బర్గ్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ ద్వారా ఈ పరిశోధనకు నిధులు అందాయి.

Latest News