Nepal Floods | నేపాల్‌లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు.. 62 మంది దుర్మరణం

Nepal Floods | రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి గత నాలుగు వారాలుగా నేపాల్‌లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఈ వరదలవల్ల ఇప్పటి వరకు 62 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 90 మంది గాయపడ్డారు. కొండచరియలు విరిగిపడటం, వరదలు, పిడుగుల కారణంగా ఈ దుష్పరిణామాలు జరిగాయని నేపాల్‌ హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

Nepal Floods | నేపాల్‌లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు.. 62 మంది దుర్మరణం

Nepal Floods : రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి గత నాలుగు వారాలుగా నేపాల్‌లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఈ వరదలవల్ల ఇప్పటి వరకు 62 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 90 మంది గాయపడ్డారు. కొండచరియలు విరిగిపడటం, వరదలు, పిడుగుల కారణంగా ఈ దుష్పరిణామాలు జరిగాయని నేపాల్‌ హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

మృతుల్లో 34 మంది కొండచరియలు విరిగిపడటం కారణంగా మరణించారు. ఈ ప్రకృతి వైపరీత్యాల కారణంగా మరో ఏడుగురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల తర్వాత వరదలు, కొండచరియలు విరగిపడటం గణనీయమైన ఆస్తి నష్టం కలిగించాయి. కనీసం 121 ఇళ్లు నీట మునిగాయి, 82 ఇళ్లు దెబ్బతిన్నాయి.

రుతుపవనాల వరదలు, కొండ చరియలు విరిగిపడటం, వరదల వల్ల ప్రభావితమైన ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ (ప్రచండ) అన్ని రాష్ట్ర ఏజెన్సీలను ఆదేశించారు. ఆదివారం సింగ్ దర్బార్‌లోని కంట్రోల్ రూమ్‌లో జరిగిన సమావేశంలో ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రభావితమైన పౌరుల రక్షణ, సహాయ చర్యలపై దృష్టి పెట్టాలని ప్రధాన మంత్రి అన్ని రాష్ట్ర ఏజెన్సీలను ఆదేశించారు.

ఈ ప్రకృతి విపత్తులపట్ల పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రచండ కోరారు. రాజకీయ పార్టీలు, పౌర సమాజం, సామాజిక సంస్థలు విపత్తు ప్రమాదాలను తగ్గించడంలో పౌరుల భద్రతకు భరోసా కల్పించడంలో సహకరించాలని పిలుపునిచ్చారు. కాగా నారాయణి నదిలో నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరడంతో గండక్ బ్యారేజీ గేట్లన్నీ తెరిచినట్లు సమాచారం.

గండక్ బ్యారేజీకి నీటి ప్రవాహం హెచ్చరిక స్థాయికి పెరగడంతో కోసి బ్యారేజీకి చెందిన 41 గేట్లను తెరిచినట్లు సప్తకోశి నీటి కొలత కేంద్రం తెలిపింది. నేపాల్‌లో వర్షాకాలం సాధారణంగా జూన్ 13న ప్రారంభమై సెప్టెంబర్ 23న ముగుస్తుంది. ఖాట్మండు, భక్తపూర్, లలిత్‌పూర్ జిల్లాలతో కూడిన ఖాట్మండు లోయలో నిరంతర భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన నదులలో వరదలు పోటెత్తాయి.