విధాత, హైదరాబాద్ : అక్రమ ఆస్తుల ఆరోపణలపై ఏసీబీ అధికారులు వరంగల్ భూగర్భ, గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్ బొజ్జ జయ రాజ్ ఇంటిపై నిర్వహించిన దాడులలో రూ. 100కోట్ల మేరకు విలువైన అక్రమాస్తులను గుర్తించడం కలకలం రేపింది. బొజ్జ జయరాజ్‌పై అనేక అవినీతి,ఆరోపణలు రావడంతో అతనికి సంబంధించిన హైదరాబాద్‌లోని బోడుప్పల్‌తో పాటు సూర్యాపేట, తాండూర్, జయరాజ్ పనిచేస్తున్న భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించినట్లుగా ఏసీబీ అధికారులు ప్రకటనలో వెల్లడించారు. బోడుప్పల్‌లో జీ ప్లస్ -2 భవనం, కేపీహెచ్‌బీలో ఒక ప్లాట్, కీసర, తుంగతుర్తి, తుప్రాన్, సూర్యాపేటలో ఐదు ప్లాట్లు, 3.21 ఎకరాల వ్యవసాయ భూమి, , రూ.10 లక్షల నగదు , బంగారం, బ్యాంక్ డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం కలిపి రూ.3.06 కోట్లు ఉన్నట్లు గుర్తించామని వివరించారు.
వీటి మార్కెట్ విలువ మరింత అధనంగా ఉంటుందని ..దాదాపు రూ. 100కోట్ల మేరకు ఉంటుందని వెల్లడించారు. అదేవిధంగా డీడీ జయరాజ్‌కు చెందిన డ్రైవర్ సత్తునూరి యాదయ్య సెల్‌ఫోన్‌ను పరిశీలించగా అతడి ఖాతా నుంచి కూతురు ఖాతాకు 24.8 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించినట్లు తెలిపారు. అక్రమ ఇసుక రవాణాలో సంపాదించినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. జయరాజ్ ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్నట్లు సమాచారం. అయితే గతంలో ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న కొందరితో ఆయన కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు పలుమార్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు జయరాజ్ అక్రమాస్తులపై దర్యాప్తు చేస్తున్నారు.
