కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏం చేస్తారో చెప్పాలి: అక్బరుద్దీన్
కాళేశ్వరం ప్రాజెక్టును రద్దు చేస్తారా.. నిలిపివేస్తారా చెప్పాలని ఎంఐఎం శాసనసభపక్ష నాయకులు అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. 650 పేజీల నివేదికలో కమిషన్ ఒక్క రిపోర్టు కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు

విధాత: కాళేశ్వరం ప్రాజెక్టును రద్దు చేస్తారా.. నిలిపివేస్తారా చెప్పాలని ఎంఐఎం శాసనసభపక్ష నాయకులు అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. 650 పేజీల నివేదికలో కమిషన్ ఒక్క రిపోర్టు కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. ఎలాంటి సిఫారసులు లేకుండా దొంగలకు శిక్ష ఎలా పడుతుందని ఆయన ప్రశ్నించారు.ప్రభుత్వాలు మారినా కూడా కాంట్రాక్టర్లు మాత్రం మారడం లేదన్నారు. ఈ
కాంట్రాక్టర్లే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్లు ఇస్తారని ఆయన చెప్పారు. ఎంఐఎం, సీపీఐకి మాత్రమే ఎలక్టోరల్ బాండ్లు రావని ఆయన అన్నారు. నేరం చేసిన వ్యక్తి అఫ్రూవర్ గా మారితే మంచివాడు అయిపోతాడా అని ఆయన ప్రశ్నించారు. కాంట్రాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నివేదిక చెప్పలేదన్నారు. విజిలెన్స్ కమిషన్ , ఎన్డీఏస్ఏ సిఫారసులపై ఏ చర్యలు తీసుకుంటారో చెప్పాలన్నారు. దొంగలు దొరికితే వారిపై ఎందుకు చర్యలు తీసుకోరని ఆయన ప్రశ్నించారు.
పీసీ ఘోష్ నివేదికపై ఎంఐఎం శాసనసభపక్ష నాయకులు అక్బరుద్దీన్ ఓవైసీ చర్చలో పాల్గొన్నారు.జ్యుడిషియల్ నివేదికపై మంత్రుల కమిటీ అసెంబ్లీలో ఏటీఆర్ ను ప్రవేశపెట్టేదని ఆయన అన్నారు. గతంలో ఇదే రకమైన సంప్రదాయం ఉండేదన్నారు. కానీ, ఇప్పుడేమో కొత్త సంప్రదాయం ప్రారంభించారని ఆయన అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు ఏటీఎంలా మారాయని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వాలు మారుతున్నాయని..ఏటీఎం పాస్ట్ వర్డులు మాత్రమే మారుతున్నాయని ఆయన చెప్పారు. 2007లో ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. 2014కు ముందే ప్రాణహిత పూర్తైతే కాళేశ్వరం కట్టేందుకు అవకాశమే ఉండేది కాదన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చేందుకు అవకాశమే ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
కాళేశ్వరం పేరుతో ప్రజాధనం వృధా అయిందనేది తమ బాధ అని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కొత్త ఆయకట్టు రాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని, కానీ, గతంలో ఇదే ప్రాజెక్టుతో పలు జిల్లాల్లో లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిందని, 19 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామని ప్రకటించిన విషయాన్ని అక్బరుద్దీన్ గుర్తు చేశారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఎందుకు నిర్మిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పీసీ ఘోష్ కమిషన్ పై ఏం చేస్తారో స్పష్టంగా చెప్పగలరా అని ఆయన అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మరమ్మత్తులు చేయించలేదని ఆయన ప్రశ్నించారు. నీళ్లు వృధాగా కిందకు పోతున్నా ఎందుకు ఊరుకున్నారన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు వైట్ ఎలిఫెంట్ గామారితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కాళేశ్వరంపై ఏం చేయాలో చెప్పాలని తమను అడిగితే ఎలా సరైందన్నారు. ప్రతి నిర్ణయాన్ని విపక్షాలను అడిగే తీసుకుంటున్నారా అని అక్బరుద్దీన్ ప్రభుత్వాన్ని అడిగారు.