విధాత, హైదరాబాద్:
మద్యం తాగితే మత్తులో కిక్కు ఎక్కుతుందనేది మందుబాబుల మాట. కానీ.. త్వరలో మందు బాబుల మత్తు వదిలిపోయేలా తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇవ్వనుందనే వార్త సచివాలయ వర్గాల్లో గుప్పుమంటున్నది. ఈ నెలలోనే మద్యం ధరలు పెంచాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నదని చెబుతున్నారు. సంక్షేమ పథకాలకు నిధులు మళ్లించేందుకు సరిపడా డబ్బులు లేకపోవడంతో మద్యం ధరలను పెంచి ఆదనపు ఆదాయం రాబట్టుకోవాలని తీర్మానించిందని అంటున్నారు. సాధారణ బ్రాండ్స్ ఫుల్ బాటిల్‌పై రూ.60, ప్రీమియం బ్రాండ్స్ ఫుల్ బాటిల్‌పై రూ.100 పెంచే ఆలోచనలు ఉన్నాయని ఆబ్కారీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆ పై కేటగిరి బ్రాండ్స్ ఫుల్‌బాటిల్‌పై రూ.120 పెంచనున్నారని సమాచారం. వీటితోపాటు బీర్‌ల ధరలు కూడా పెరుగుతాయని అంటున్నారు. మొత్తం మీద ధరలు 12 నుంచి 15 శాతం వరకు పెంచడం ద్వారా ప్రతి నెలా రూ.250 కోట్ల అదనపు ఆదాయం తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు చేరుకోనున్నదని అంచనా.
మద్యం కంపెనీలకు పెరిగిన వ్యయం
పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధం కారణంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌పై 20 డాలర్లకు పైగా పెరగడంతో మద్యం ఉత్పత్తి కంపెనీలపై ఆర్థిక భారం పెరిగింది. దీనికి పెరిగిన గాజు సీసాల తయారీ ఖర్చులు తోడయ్యాయి. ముడి సరుకు వ్యయం పెరిగినందున పెంపు తప్పదని అంటున్నారు.
కొద్ది రోజులుగా మద్యం కంపెనీలు ప్రభుత్వ పెద్దలను కలిసి ధరలను పెంచాల్సిందిగా కోరుతున్నాయని సమాచారం. సాధారణంగా తెలంగాణలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ధరలను పెంచాల్సి ఉంది. అయితే ధరల పెంపుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. వచ్చేవారం కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వం అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోనున్నదని తెలుస్తున్నది.
2023లో చివరిసారి మద్యం ధరల పెంపు
2023 మే నెలలో చివరిసారిగా మద్యం ధరలను పెంచారు. గత సంవత్సరం మే నెలలో కూడా మద్యం ధరలను ప్రభుత్వం స్వల్పంగా పెంచాలని నిర్ణయించినా.. అనివార్య కారణాలతో వాయిదా పడిందని తెలుస్తున్నది. ఈసారి ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విధంగా పరిస్థితులు చుట్టుముట్టాయని సచివాలయ వర్గాల కథనం. మే 4వ తేదీన బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మద్యం ధరల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తున్నది. ప్రతి నెలా రూ.250 కోట్లు అదనంగా వచ్చేలా పెంపుదల చేయనున్నారని సమాచారం. ఫలితంగా సాలీనా ప్రభుత్వానికి రూ.3వేల కోట్లు ఆదాయం అదనంగా సమకూరుతుందని ఆబ్కారీ అధికారులు పేర్కొంటున్నారు. రానున్న రెండు వారాల్లో మద్యం ధరలను పెంచడం ఖాయంగా కన్పిస్తున్నది. సాధారణంగా వర్షాకాలం, చలికాలంతో పోల్చితే ఎండాకాలంలో ఎక్కువగా బీరును వినియోగిస్తున్నారు. దీన్ని కూడా ప్రభుత్వం సొమ్ము చేసుకోనున్నది. రాష్ట్రంలో మరో రెండు నెలల పాటు ఎండలు మండనున్నందున బీర్ల విక్రయాలు అమాంతం పెరిగి, ప్రభుత్వానికి రాబడి గణనీయంగా ఉంటుందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి..
Biryani | నాన్ వెజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరగనున్న బిర్యానీ ధరలు..!
భానుడి భగభగల వేళ..వాతావరణ శాఖ చల్లని కబురు!
ముందుగానే రుతుపవనాల రాక..ఈ నెలలోనే అండమాన్ కు!
