రాజగోపాల్‌రెడ్డిపై భగ్గుమన్న బీజేపీ నేతలు
బీజేపీ పార్టీకి రాజీనామా ప్రకటిస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సహా ఆ పార్టీ నేతలు ఫైర్ అయ్యారు

- బీఆరెస్‌కు ప్రత్యామ్నాయం కాదన్న వ్యాఖ్యలపై ఫైర్
విధాత : బీజేపీ పార్టీకి రాజీనామా ప్రకటిస్తూ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సహా ఆ పార్టీ నేతలు ఫైర్ అయ్యారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాపై కిషన్‌రెడ్డి స్పందిస్తూ బీజేపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం ఆయన వ్యక్తిగతమన్నారు. తెలంగాణలో బీఆరెస్‌కు ప్రత్యామ్నాయం ముమ్మాటికి బీజేపీ మాత్రమేనని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆరెస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయం కాదని రాజగోపాల్ రెడ్డి అన్నంత మాత్రాన కాకుండా పోదని అన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఆయనకు బీజేపీ ఎంతో ప్రాధాన్యతనిచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అని భావించి కొందరు అటువైపు వెళుతున్నారని కానీ భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. నేను కూడా పార్టీ మారుతున్నానని ప్రచారం జరుగుతుందని, తాను గాలికి వచ్చి వెళ్లేవాడిని కానని బీజేపీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ స్పందిస్తూ రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాల్సింది కాదన్నారు.

రాజకీయాల్లో రాజగోపాల్ రెడ్డి సీనియర్ నాయకుడని పార్టీ మారే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని తెలిపారు. మొన్ననే బీఆరెస్‌కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని చెప్పిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఎలా మాట మార్చారు అని ప్రశ్నించారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి స్పందిస్తూ రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ఆయన వ్యక్తిగత అంశమని, నేను మాత్రం బీజేపీలోనే కొనసాగుతానని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపెల్లి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా తెలిపారు.
బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ స్పందిస్తూ రాజగోపాల్ రెడ్డికి పార్టీ జాతీయ స్థాయిలో మంచి హోదాను కల్పించిందన్నారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీపై ఇష్టానుసారంగా మాట్లాడడం సరైనది కాదని, జాతీయస్థాయి నాయకుల ఆధ్వర్యంలో పార్టీలో చేరి పార్టీపై నిందలు వేయడం సరైనది కాదన్నారు. పార్టీ కార్యకర్తలు పార్టీ విస్తరణకు రక్తాన్ని చిందిస్తున్నారని, కార్యకర్తల కష్టాన్ని తక్కువ చేస్తూ రాజగోపాల్ రెడ్డి మాట్లాడటం బాగాలేదన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం మాకు ఉందన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి రాజీనామా బ్రేకింగ్ న్యూస్ ఏమి కాదని అందరూ ఊహించినదే జరిగిందని తేలిగ్గా కొట్టి పారేశారు. రాజగోపాల్ రెడ్డి శరీరం మాత్రమే బీజేపీలో ఉందని ఆత్మ కాంగ్రెస్‌లోనే ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజగోపాల్ రెడ్డి అన్నంత మాత్రాన బీఆరెస్‌కు బీజేపీ ఆల్టర్నేట్ కాదు అనేది అవాస్తమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ని నమ్మే పరిస్థితిలో జనాలు లేరన్నారు. కేసీఆర్‌ను ప్రగతి భవన్ నుంచి ఖాళీ చేయించి పనిలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆరెస్‌కు కేవలం బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమన్నారు. మాజీ ఎంపీ, సీనియర్ బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
రాజగోపాల్ రెడ్డి ఓ పాసింగ్ క్లౌడ్ అని వ్యాఖ్యానించారు. పార్టీ ఎప్పుడు బలంగా ఉంటుందని.. కొందరు అలా వచ్చి ఇలా వెళ్తారని కౌంటర్ వేశారు. ఎవరి ఊహలు వారివి ఎవరి ఇష్టం వారిదని కానీ బీజేపీ పోటీలో లేదని రాజగోపాల్ రెడ్డి అనుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. తాను వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నానని తెలిపారు.