Telangana Assembly clash| బీఆర్ఎస్- కాంగ్రెస్ ల మధ్య హౌస్ కమిటీ రగడ !

రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ మైనింగ్‌పై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్, బీఆర్ఎస్ భూ దందాలపై హౌస్ కమిటీ వేస్తామని కాంగ్రెస్ పార్టీకి మధ్య రేగిన రగడతో ఆదివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హోరెత్తాయి.

Telangana Assembly clash| బీఆర్ఎస్- కాంగ్రెస్ ల మధ్య హౌస్ కమిటీ రగడ !

విధాత, హైదరాబాద్: రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ మైనింగ్‌పై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్, బీఆర్ఎస్ భూ దందాలపై హౌస్ కమిటీ వేస్తామని కాంగ్రెస్ పార్టీకి మధ్య రేగిన రగడతో ఆదివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హోరెత్తాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ అక్రమ మైనింగ్‌పై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు ఆదివారం సభలో నినాదాలతో సభా కార్యక్రమాలకు అడ్డం పడ్డారు. దీనితో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్ వ్యవహారాలపై సీబీసీఐడీ విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటికి బీఆర్ఎస్ సభ్యులు సభకు అడ్డం పడటం పట్ల మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎదురుదాడికి దిగారు.

సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా దీనిపై స్పందిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టార్గెట్ గా బీఆర్ఎస్ సభ్యులు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో హౌస్ కమిటీలతో బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డారని, ఇప్పుడు కూడా మంత్రి పొంగులేటిని బ్లాక్ మెయిల్ చేయడానికే హౌస్ కమిటీ డిమాండ్ చేస్తున్నారన్నారు. గతంలో వేసిన హౌస్ కమిటీలతో ఫలితం లేకుండా పోయిందని, కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ దర్యాప్తుకు ఇస్తే నేటికి స్పందన లేదన్నారు. నేను తెలంగాణ వచ్చినప్పటి నుంచి మైనింగ్ దందాలపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించానని గుర్తు చేశారు. అయినప్పటికి సభకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. హరీశ్ రావు డిమాండ్ తో మేం విచారణకు ఆదేశించడంతో కేసీఆర్ కుటుంబం ఇరుక్కుంటుందన్న ఇబ్బందులతోనే బీఆర్ఎస్ ఈ రోజు సభలో రచ్చ చేస్తున్నారన్నారు. హౌస్ కమిటీ వేసినా.. రిపోర్టు తిరిగి దర్యాప్తు సంస్ధలకు ఇవ్వాల్సిందేనని, అందుకే నేరుగా సీబీసీఐడీ విచారణకు ఆదేశించానని రేవంత్ రెడ్డి తెలిపారు.

ముందుగా హరీశ్ రావు కుటుంబం బాలనగర్ భూములను ధరణిని అడ్డం పెట్టుకుని స్వాహా చేసిన దానిపై హౌస్ కమిటీ వేయడానికి సిద్దంంగా ఉన్నామని, మీరు సిద్దమా? అంటూ ప్రశ్నించారు. అయినప్పటికి బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు కొనసాగించడంతో అధికార పక్షం నుంచి మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు, సీతక్క, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, వివేక్, అజారుద్దీన్, విప్ ఆది శ్రీనివాస్, బాలునాయక్, దానం నాగేందర్, కడియం శ్రీహరి, యశస్విని, అయిలయ్య యాదవ్, వంశీకృష్ణ, కాలే యాదయ్య, మందుల సామేల్ సహా మూకుమ్మడిగా ఎదురుదాడికి దిగారు.

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం సిటీ సెంటర్లో 200 కోట్ల ప్రాపర్టీ కబ్జా పెట్టారు అని ఆరోపించారు. దీనిపై ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఆధారాలు తెచ్చి మాట్లాడుతున్నానన్నారు. నేను చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే 24 గంటల్లో నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. హరీశ్ రావు, కేటీఆర్ లకు దమ్ముంటే ఇది నిజం కాదని నిరూపించాలి, లేదంటే తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నేనిప్పుడే నా రాజీనామా పత్రం ఇస్తున్నా.. దమ్ముంటే వారు కూడా తమ రాజీనామా పత్రం ఇచ్చి సవాల్ స్వీకరించాలని కోరారు.

కోట్లు కోట్లు కొల్లగొట్టిన దొంగలే దొంగ అని మొత్తుకుంటున్నారు, ఎందుకు వారిని జైల్లో వేయకూడదు అని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయాల పేరిట కోట్ల రూపాయల విలువైన భూములను దోచుకున్నవారు ఈ రోజు అక్రమాలపై హౌస్ కమిటీ అంటూ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారని రాజేంద్ రెడ్డి విమర్శించారు.

కడియం శ్రీహరి మాట్లాడుతూ సభలో బీఆర్ఎస్ సభ్యులు వారి హయాంలో సాగించిన భూ దోపిడీలను విస్మరించి సిగ్గులేకుండా అరుస్తున్నారని, ధరణిని అడ్డం పెట్టుకుని వందల ఎకరాల భూమిని గుంజుకున్నారు అని, బాలానగర్ భూముల స్కామ్ పై హౌస్ కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నిజంగా నిజాయితీ ఉంటే బీఆర్ఎస్ సభ్యులు హౌస్ కమిటీకి ఒప్పుకోవాలన్నారు. దానం నాగేందర్ సైతం బీఆర్ఎస్ హయాంలో సాగిన భూదోపిడిపై హౌస్ కమిటీ వేయాలని కోరారు. నా సొంత భూమిని కేటీఆర్ కబ్జా చేశారు అని, హైదరాబాద్ లో పుట్టి పెరిగినా ఏం చేయలేక నోరు మూసుకున్నాం అని, గత బీఆర్ఎస్ హయాంలో వేల ఎకరాల భూ కబ్జాలు జరిగాయి అని, వాటి అన్నింటిపైనా హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్బంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేశంగా కడియంపై వేలు చూపిస్తూ మాట్లడటంపై కాంగ్రెస్ సభ్యులు  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.