ద‌ళితుల‌కు బీఆరెస్ స‌ర్కారు మోసం: భట్టి విక్రమార్క

ద‌ళితుల‌కు బీఆరెస్ స‌ర్కారు మోసం: భట్టి విక్రమార్క
  • సీఎంను చేయ‌లే- మూడు ఎక‌రాలు ఇవ్వ‌లే- ద‌ళిత బందు ఇవ్వ‌లే
  • ర‌మాకాంత్ చావుకు సీఎం కార‌ణం
  • చావుల‌కు కార‌ణం అవుతున్న బీఆరెస్ పాల‌కుల‌కు బుద్ది చెప్పండి
  • పొత్తుల‌పై జాతీయ స్థాయిలో చ‌ర్చ‌

విధాత‌, హైద‌రాబాద్‌: ద‌ళితుల‌ను బీఆరెస్ స‌ర్కారు మోసం చేసింద‌ని సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఆరోపించారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మోసపూరితమైన ప్రకటనలు చేసి ప్రజలను కలల ప్రపంచంలోకి నెట్టి వారి చావులకు కారణం అవుతున్నబీఆరెస్ పాలకులకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. ఆదిలాబాద్ జిల్లా, జైనాథ్ మండలం బోరోజ్ గ్రామంలో రమాకాంత్ అనే యువకుడు దళిత బంధు రాకపోవడంతో నా చావుకు సీఎం కారణం అంటూ సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని భ‌ట్టి డిమాండ్ చేశారు. “పాలకులు ప్రజల బాగోగుల గురించి ఆలోచించాలి కానీ, సమాజం ఏమైనా పర్వాలేదు నేను బాగుండాలి నా పార్టీ బాగుండాలి నా పార్టీ అధికారంలో ఉండాలనే భావనతో పరిపాలించే పాలకులు కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉండడం దౌర్భాగ్యం” అని ఆయ‌న‌ అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పాల‌కులు 92 శాతం ఉన్న దళిత ,గిరిజన, మైనారిటీ, బలహీన వర్గాల ప్రజలను కలల ప్రపంచంలోకి నెట్టి అందులోంచి లబ్ధి పొందుతూ బతుకుతున్నార‌న్నారు. ప్రజలు మాత్రం చనిపోతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మీరు సీఎం కావడానికి ..మొదటగా దళిత ముఖ్యమంత్రి అని కళల ప్రపంచం సృష్టించారన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని అద్భుతమైన కలల ప్రపంచంలోకి తీసుకువెళ్లారన్నారు. దళిత బంధు ఇస్తామని ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని బీఆరెస్ మోసం చేసిందన్నారు.

బడ్జెట్ లో దళిత బందుకు రూ. 17,700 కోట్లు లెక్కలు చూపించి,కనీసం రూ. 300 కోట్లు కూడా ఖర్చు చేయలేదని భ‌ట్టి ఆరోపించారు. బీఆరెస్ నేత‌లు మోసపూరిత ప్రకటనలు చేసి ఓట్లు పొంది అధికారం అనుభవిస్తుంటే, కలలు నెరవేరక ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఎస్సి ,ఎస్టీ సబ్ ప్లాన్ ను బిఆర్ఎస్ ప్రభుత్వం పక్కదోవ పట్టించింద‌ని భ‌ట్టి విక్ర‌మార్క ఆరోపించారు. ఆ నిధులను అడగకుండా ఉండటానికి దళితులను సీఎం కేసీఆర్‌ కలల ప్రపంచంలోకి నెట్టివేస్తున్నారన్నారు.

రాష్ట్ర ప్రజలు తెలంగాణ కోసం కన్న కలలు బిఆర్ఎస్ పాలనలో నేరేవేరలేదన్నారు. కాంగ్రెస్ మాత్రమే తెలంగాణ ప్రజల కలలను నిజం చేస్తుందన్నారు. దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల యుద్ధంలో ప్రజల తెలంగాణ తీసుకొస్తామని రాహుల్ గాంధీ చెప్పారన్నారు. దళిత గిరిజన కుటుంబాలకు విజ్ఞప్తి చేస్తున్నాను… నిరాశ నిస్పృహలకు గురై ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని భ‌ట్టి పిలుపు ఇచ్చారు. మరో నెల రోజుల్లో తెలంగాణలో ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ప్రజల సంపద ప్రజలకే పంచుతామ‌న్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దళిత గిరిజనుల అభివృద్ధి కోసమే పూర్తిగా ఖర్చు పెడతామ‌న్నారు. దళిత బంధు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న రమాకాంత్ రాసిన సూసైడ్ నోట్ పై విచారణ జరిపించాలని భ‌ట్టి డిమాండ్ చేశారు. వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.

పొత్తులుపై జాతీయ స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతోంది

వామపక్షాలతో మాట్లాడాం.. వారి పొత్తుల అంశం జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. తగిన సమయంలో జాతీయ స్థాయి నాయకులు ప్రకటిస్తారని భ‌ట్టి తెలిపారు. షర్మిల కాంగ్రెస్ కి మద్దతు తెలపడం సంతోష మ‌న్నారు. వైఎస్సార్ కూతురుగా కాంగ్రెస్ కు నష్టం జరగకూడదనే ఆమె నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామ న్నారు. షర్మిలకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాన‌న్నారు. రాహుల్ గాంధీ జాతీయ నాయకుడు ఆయ‌న‌ ఎక్కడ పోటీ చేయాలనేది ఏఐసీసీ నిర్ణయిస్తుందని అసదుద్ధీన్ కు అవసరం లేదన్నారు. మేము ఎక్కడెక్కడ పోటీ చేయాల‌నేది సీఈసి నిర్ణయం చేస్తుందన్నారు.