Wanaparthy | కార్యకర్తకు ఊపిరి పోసిన అభిమాన నేత ‘పచ్చబొట్టు’.. అంత్యక్రియలు ఆపి ఆస్పత్రికి తరలింపు
Wanaparthy | ఓ అభిమాన నాయకుడి పచ్చబొట్టు( Tattoo ).. ఓ కార్యకర్త నిండు ప్రాణాలను కాపాడింది. స్మశాన వాటికకు( Graveyard ) శవాన్ని తరలించేందుకు పాడే కట్టారు.. ఇక కడసారి వీడ్కోలు పలికి అంత్యక్రియలు( Funerals ) చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ చివరి క్షణాల్లో ఆ అభిమాన నాయకుడి పచ్చబొట్టే ఆ కార్యకర్తకు ఊపిరి పోసింది. పాడే మీద నుంచి దించి నేరుగా ఆస్పత్రికి తరలించి.. అతని ప్రాణాలు కాపాడారు. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన వనపర్తి జిల్లా( Wanaparthy District ) కేంద్రంలో ఆదివారం చోటు చేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగు చూసింది.

వనపర్తి జిల్లా( Wanaparthy District ) కేంద్రానికి చెందిన తైలం రమేశ్(49) తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి( Singireddy Niranjan Reddy )ని వెన్నంటి ఉన్నారు. ఆయనకు అభిమానిగా మారిపోయారు తైలం రమేశ్. ఆ అభిమానాన్ని తన గుండెల్లో చాటుకున్నారు. తన ఛాతీపై నిరంజన్ రెడ్డి పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు రమేశ్.
అయితే గత కొంతకాలం నుంచి హైదరాబాద్( Hyderabad )లో నివాసం ఉంటున్న రమేశ్.. మూడు రోజుల క్రితం వనపర్తి జిల్లా కేంద్రంలోని పీర్లగుట్ట డబుల్ బెడ్రూం కాలనీలో ఉంటున్న తన బంధువుల ఇంటికి వచ్చాడు. ఆదివారం ఉదయం ఇంట్లోనే టిఫిన్ చేశాడు. ఆ తర్వాత అస్వస్థతకు గురయ్యాడు. రమేశ్‌లో ఎలాంటి చలనం లేకపోవడంతో.. అతను ప్రాణాలు వదిలాడని బంధువులు భావించారు. కుటుంబ సభ్యులను పిలిపించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
తన అభిమాని చనిపోయాడన్న విషయం తెలుసుకున్న నిరంజన్ రెడ్డి.. చివరిచూపు కోసం వచ్చారు. రమేశ్ ఛాతీపై ఉన్న తన పచ్చబొట్టును చూస్తుండగా.. అతను ఊపిరి పీల్చుకుంటున్నట్టు నిరంజన్ రెడ్డి పసిగట్టారు. దీంతో తక్షణమే రమేశ్‌పై ఉన్న పూలమాలలు తీసేయించారు మాజీ మంత్రి. రమేశ్ అని పిలవగా.. కనురెప్పలు కదిలించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో.. గంట తర్వాత స్పృహలోకి వచ్చి కళ్లు తెరిచాడు. వైద్యుల సూచన మేరకు నిమ్స్( NIMS )కు తరలించి.. అతని ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం రమేశ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.