తెరపైకి ప్లాన్-బీ?
మూడోసారి ముచ్చటగా ఎలాగైనా అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో ఉన్న గులాబీ బాస్ కేసీఆర్.. తెరపైకి ప్లాన్-బీ తీసుకొస్తారని ప్రచారం జరుగుతున్నది

- హ్యాట్రిక్ కోసం గులాబీ బాస్ యత్నం!
- 45 వస్తే ప్రభుత్వ ఏర్పాటు ‘ఏర్పాట్లు’?
- ముఖ్య నేతలకు భరోసానిస్తున్న సీఎం?
- అవసరమైతే ఎమ్మెల్యేల కొనుగోళ్లు?
- కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచేవారే టార్గెట్!
- వందకోట్లు హర్డ్ క్యాష్.. లేదా హైదరాబాద్
- సమీపంలో రెండెకరాల భూమి ఆఫర్!
- బీఆరెస్ నేతల మదిలో కుట్ర కోణాలు!
- మార్పు కోరుతున్న తెలంగాణ ప్రజలు
- ప్రజా తీర్పును అపహాస్యం చేస్తే సహిస్తారా?
- రెండుమూడు నెలల్లో పార్లమెంటు సమరం
- ఈ టైంలో తిక్క వేషాలేస్తే అసలుకే మోసం
- అమ్ముడుపోయేవారిని తన్ని తరమాలి
- రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి పిలుపు
విధాత, హైదరాబాద్: మూడోసారి ముచ్చటగా ఎలాగైనా అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో ఉన్న గులాబీ బాస్ కేసీఆర్.. తెరపైకి ప్లాన్-బీ తీసుకొస్తారని ప్రచారం జరుగుతున్నది. 70 సీట్లకు పైగా బీఆరెస్ సీట్లు గెలుస్తుందని, ఎలాంటి ఆందోళన చెందవద్దని సీఎం కేసీఆర్ మంత్రులతో పాటు 60 మంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మాట్లాడినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రగతి భవన్ నుంచి నియోజకవర్గాలవారీగా ఓటింగ్ జరిగిన తీరుపై ఆరా తీసిన కేసీఆర్.. పోలింగ్ సరళిపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సంఖ్యలో సీట్లు రాని పక్షంలో ఏం చేయాలనే చర్చలు కూడా సాగినట్టు తెలుస్తున్నది. అదే పరిస్థితి తలెత్తితే ప్లాన్-బీని ఆచరణలోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధమవుతారని బీఆరెస్ నేతలు చెబుతున్నారు.
ప్రభుత్వ ఏర్పాటుపై కేసీఆర్ ధీమా ఎందుకు?
మెజార్టీ రాకపోయినా 45 సీట్లు కచ్చితంగా వస్తాయని, మిగిలిన వాటిల్లో టఫ్ ఫైట్ జరిగినా గెలుస్తామన్న ధీమాతో బీఆరెస్ అధినేత ఉన్నట్టు చెబుతున్నారు. 45 సీట్లకే పరిమితం అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటారని గులాబీ నేతల నుంచి వినిపిస్తున్నది. బీజేపీకి 9 నుంచి 10 వరకు సీట్లు వస్తాయని, ఎంఐఎంకు ఆరు సీట్లు గ్యారెంటీగా వస్తాయని, ఈ రెండు పార్టీలతో కలిపితే 60 సీట్లు దాటుతాయని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని తనకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారి దగ్గర అన్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఒకరిద్దరు ఇండిపెండెంట్లు కూడా గెలిచే అవకాశం ఉందని అంచనా వేసినట్లు తెలిసింది. కేసీఆర్ తల్చుకుంటే ఇండిపెండెంట్లతో పాటు కాంగ్రెస్ నుంచి గెలిచిన కొంత మంది ఎమ్మెల్యేలను కూడా కొనేస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ.100 కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడొద్దనే ఆలోచనలో ఉన్నట్టు విశ్వసనీయవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు డబ్బులు కానీ లేదా నగరంలోని ఖరీదైన ఏరియాలో రెండెకరాల చొప్పున భూమి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారని చెబుతున్నారు. అయితే.. ఇవేవీ వర్కవుట్ అయ్యేవి కాదని కొందరు పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. అందులోనూ మార్పును బలంగా కోరుకున్న ప్రజలు ఉద్దేశపూర్వకంగానే బీఆరెస్‌ను పక్కన పెట్టారని, ఈ సమయంలో ఆ తీర్పును అపహాస్యం చేస్తే.. అది బీఆరెస్‌కు ఆత్మహత్యే అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఒక పద్ధతంటూ ఉంటుందని, కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉన్నా.. వాటిని పాటించి తీరాల్సిందేనని చెబుతున్నారు.
ఇదీ అనుసరించే పద్ధతి
సాధారణంగా మెజార్టీ దక్కించుకున్న పార్టీని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. హంగ్ ఏర్పడిన పక్షంలో ముందుగా పొత్తు కుదుర్చుకున్న కూటమిని పిలుస్తారు. పొత్తు లేని పక్షంలో ఉన్నవాటిలో సింగిల్ లార్జెస్ట్ పార్టీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం దక్కుతుంది. ఆ తర్వాత సభలో ఆ ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ప్రభుత్వ కూలిపోతుంది. కానీ ఈ సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ రాని పార్టీని పిలుస్తుందా? అన్న చర్చ జరుగుతోంది.
అంత సీన్ లేదు!
కేసీఆర్ ప్లాన్-బీ అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చినా.. కాంగ్రెస్‌కు గనుక ఎక్కువ సీట్లు వస్తే.. కేసీఆర్ భావిస్తున్నట్టు 45 సీట్లు వచ్చే బీఆరెస్‌ను గవర్నర్ ఆహ్వానించడానికి ఎలాంటి పరిస్థితుల్లోనూ అవకాశం లేదని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. ఒకవేళ కేంద్రాన్ని మేనేజ్ చేసి, గవర్నర్ ద్వారా ఆహ్వానం పొందితే.. అది బీఆరెస్‌కు ఆత్మహత్యే అవుతుందని చెబుతున్నారు. ఎందుకంటే మరో రెండు మూడు నెలల్లోనే పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి. ఇక్కడ అనూహ్య పరిణామాలే సంభవిస్తే.. నిన్నటిదాకా తిట్టిన బీజేపీని పక్కన చేర్చకున్నందుకు ప్రజలకు 17కు 17 సీట్లలోనూ కాంగ్రెస్‌ను గెలిపించి.. కసి తీర్చుకుంటారని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా కేసీఆర్ అంత సాహసానికి పూనుకుంటారా? అనేది ప్రశ్నార్థకమేనని ఒక సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించారు.
అమ్ముడు పోయే వారిని తన్నడానికి సిద్ధంగా ఉండాలి: ఆకునూరి మురళి
ఫలితాల అనంతరం ఎవరైనా పార్టీ మారితే వారిని తన్ని తరిమేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పిలుపునివ్వడం ఇక్కడ ప్రస్తావనార్హం. ఇదే విషయంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం కూడా ఇలాంటి హెచ్చరికలే జారీ చేశారు. ‘అందరం.. యువత, పౌర సంఘాలు వచ్చే వారం జాగరూకతతో ఉండాలి. వేరే పార్టీ ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని దొంగల పార్టీ ప్రయత్నం చెయ్యొచ్చు. అమ్ముడు పోయే గాడిద కొడుకులను తన్నడానికి మనం అంత సిద్ధంగా ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని స్పీకర్లు గవర్నర్ల మీద ఆశలు పెట్టుకోవద్దు. మనమే మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఎవరి ఎమ్మెల్యేలను వాళ్ళే ఒక కంట కనిపెట్టాలి. పార్టీ మారుస్తున్నాడని అనిపించగానే మనం తెలంగాణ ఉద్యమ కాలంలో ఖమ్మం ఘటనలో ఉస్మానియా విద్యార్థులు పెద్దాయనను ఏం చేశారో అదే మళ్ళీ చెయ్యాలి. దెబ్బకు సెట్ కావాలి. తస్మాత్ జాగ్రత్త ! …జై తెలంగాణ !!!’ అని మురళి ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థులను మారమని ఆఫర్ చేస్తున్నారు
తెలంగాణ రాజకీయాలపై శివసేన ఎంపీ స్వాతి చతుర్వేది కూడా స్పందించారు. రాజకీయ వ్యూహకర్త పీకేను ఉద్దేశించి ఆమె ఒక ట్వీట్ చేస్తూ.. ‘ఒక కొత్త రాజకీయ నాయకుడు, మాజీ “వ్యూహకర్త” గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్‌కి మారమని కోరుతూ, డీల్ చేయడానికి ఆఫర్ చేస్తున్నాడు’ అని హెచ్చరించారు.