చివరి రోజులు అభ్యర్థులకు దొరకని అధినేత?

- ఓడిపోవడం ఖాయమని తెలిసేనా?
- బీఆరెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చలు
విధాత, హైదరాబాద్: ఓడిపోతామన్నసంకేతాలు గులాబీ బాస్‌కు ముందుగానే ఉన్నాయా? అన్న సందేహాలు పార్టీ వర్గాలలో వ్యక్తమవుతున్నాయి. రెండు నెలల ముందుగా అభ్యర్థులను ప్రకటించిన గులాబీ పార్టీ అందరికంటే ముందుగా ప్రచారం చేయించింది. ఇందుకోసం మొదటి దఫాలోనే ఒక్కో అభ్యర్థికి రూ.25 కోట్ల వరకు ప్రచార ఖర్చులకు పంపించినట్లు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత తెలంగాణ భవన్‌లో పోటీలో ఉన్నఅభ్యర్థులతో సమావేశం నిర్వహించిన సమావేశంలో చెక్కుల రూపంలో ఎన్నికల నిబంధనల మేరకు ఖర్చు చేయాల్సిన రూ.40 లక్షలను కూడా అందించారు. ముందుగా తీసుకు వెళ్లిన డబ్బులతో బ్రహ్మాండంగా అభ్యర్థులు ప్రచారం చేశారు. అసంతృప్తును మంచ్చిక చేసుకోవడానికి, అందరినీ ప్రచారంలోకి దించడానికే సరిపోయిందని తెలుస్తున్నది. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ కొందరు అభ్యర్థులు చేతిలో ఖర్చులకు కూడా లేకుండా ఇబ్బంది పడినట్లు సమాచారం.
పైగా అంత డబ్బు స్థానికంగా దొరకడం కూడా ఇబ్బంది కావడంతో వారంతా ప్రగతి భవన్‌కు ఫోన్ చేశారని, సార్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుందామని ప్రయత్నించారని బీఆరెస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ అభ్యర్థులకు గులాబీ బాస్ దొరకలేదు సరికదా…? ప్రగతి భవన్ లో ఉండే వారు కూడా ఫోన్ ఎత్తలేదని తెలిసింది. ఓడిపోతామనే విషయం కేసీఆర్‌కు ముందే అర్థం కావడంతో డబ్బులు ఖర్చు చేయడం దండుగ ఎందుకని పోలింగ్‌కు ఐదు రోజుల ముందు నుంచే అభ్యర్థులకు అందుబాటులో లేకుండా పోయాడా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.