కాంగ్రెస్‌ మంత్రుల్లో ఒక్క మొగోడు లేకుండెనా? సీఎం కేసీఆర్‌

కాంగ్రెస్‌ మంత్రుల్లో ఒక్క మొగోడు లేకుండెనా? సీఎం కేసీఆర్‌

కాంగ్రెస్ పార్టీలో డ‌జ‌న్ మంది ముఖ్య‌మంత్రులు ఉన్నారు. వాడ వాడ‌కు సీఎంలే ఉన్నారు.. ప్ర‌తి ఒక్క‌రూ న‌న్ను గెలిపిచండి నేను ముఖ్య‌మంత్రి అయితా అంటున్నారు. అస‌లు కాంగ్రెస్ గెలిచే ప‌రిస్థితి లేదు. ఒక్క హుజుర్‌న‌గ‌ర్‌లోనే కాదు.. దేశ‌మంతా కాంగ్రెస్ పార్టీది అదే ప‌రిస్థితి అని కేసీఆర్ తెలిపారు. నేను ముఖ్య‌మంత్రి అయితా అని ఒక‌రు.. నేను బుడ్డెర‌ఖాన్ అయితా అని ఇంకోక‌డు.. నేను ఇది అయితా అని ఒక‌డు.. ర‌ర‌క‌కాల మాయ‌మాట‌లు చెప్పి గోల్ మాల్ చేసి ఓట్లు అడుగుతున్నారు. పార్టీల త‌ర‌పున నిల‌బ‌డే వ్య‌క్తుల‌నే కాదు.. ఆ పార్టీల నైజం, దృక్ప‌థం గురించి తెలుసుకోవాలి.


ఉమ్మ‌డి రాష్ట్రంలో సాగునీరు, మంచినీళ్ల‌ కోసం అనేక క‌ష్టాలు ప‌డ్డాం.. ఇవాళ అన్ని స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించుకున్నాం అని కేసీఆర్ తెలిపారు. గిరిజ‌న తండాలను గ్రామ‌పంచాయ‌తీలుగా తీర్చిదిద్దుకున్నాం.. వారి హ‌క్కుల‌ను కాపాడినం. ఇవాళ మేజ‌ర్‌గా కృష్ణా న‌దిలో నీళ్లు రాలేదు. శ్రీశైలం దాకా నిండింది. సాగ‌ర్ దాకా నీళ్లు రాలేదు. స్థానిక ఎమ్మెల్యేలు ఫోన్ చేశారు. పంట‌లు పాడు అవుతున్నాయి.. ప‌ది ప‌న్నెండు రోజులు నీళ్లు వ‌ద‌లాలి అని కోరితే అధికారుల‌ను పిలిచి మాట్లాడి నీళ్ల‌ను వ‌దిలించాం. హుజుర్‌న‌గ‌ర్‌కు వారం ప‌ది రోజుల పాటు మ‌ళ్లీ నీళ్లు పంపిస్తాం. రందీ ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఇలా సంసారం చేసుకుంటున్న‌ట్టు ముంద‌కు పోతున్నాం.

రైతుబంధు ప‌థ‌కంతో ఇత‌ర వ్య‌వ‌సాయ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డంతో కేసీఆర్ క‌ల‌ను నిజం చేసిన మొగోళ్లు.. మొన‌గాళ్లు నా తెలంగాణ రైతులు. రైతుబంధు ప‌ధాన్ని ఈ ప్ర‌పంచంలో పుట్టించిందే కేసీఆర్ అని సీఎం తెలిపారు. రైతుబంధు మంచిది కాద‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తిడుతున్నాడు. దుబారా అని అంటున్నాడు. స్వామినాథనే హైద‌రాబాద్‌కు వ‌చ్చి రైతుబంధు ప‌థ‌కాన్ని ప్ర‌శంసించారు. ఇలా రైతుబంధు వ‌ద్ద‌నే వారికి త‌గిన బుద్ధి చెప్పాలి. న‌వంబ‌ర్ 30న గుద్దుడు గుద్దితే పోలింగ్ బాక్సులు ప‌గిలిపోవాలి.

రైతుకు స్వేచ్ఛ ఉండాల‌నే ఉద్దేశంతోనే రైతుబంధు న‌గ‌దు ఇస్తున్నాం. రైతుబంధు ఇవ్వ‌డంతో పంట‌లు పండించుకుంటున్నారు. కేసీఆర్ క‌ల‌ను నిజం చేసిన మొగోళ్లు మొన‌గాళ్లు నా తెలంగాణ రైతులు. పంజాబ్ స్థానం త‌ర్వాత మూడు కోట్ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం పండిస్తున్నాం. 30 ల‌క్ష‌ల ట‌న్నులు పండించే స్థాయి నుంచి 3 కోట్ల ట‌న్నులు పండించే స్థాయికి ఎదిగాం. లిఫ్ట్‌లు పూర్త‌యితే 4 కోట్ల‌కు వెళ్లి పంజాబ్‌ను దాటేస్తాం. కేసీఆర్‌ను వ్య‌క్తిగ‌తంగా తిట్టుడు రాజ‌కీయం కాదు. అందుకే పార్టీల వైఖ‌రి గురించి ఆలోచించాలి. ఈ అంశాన్ని సీరియ‌స్‌గా తీసుకోవాలి.

మూడు గంట‌ల క‌రెంట్ అనేటోడు అస‌లు ఎక్క‌డ‌న్న పొలం దున్నిండా..? అని కేసీఆర్ ప్ర‌శ్నించారు. నీకు ఎవుసం లేదు.. ఎద్దు లేదు.. హైద‌రాబాద్‌లో ఎయిర్ కండీష‌న్‌లో ఉండ‌వ‌డితివి. నేనేమో రైతును.. అన్నీ నాకు తెలుసు. ఇక రాహుల్ గాంధీ నాగ‌లి దున్నిండో, ఎవుసం ఉందో తెలియ‌దు కానీ నాకు.. ధ‌ర‌ణిని తీసేస్తాం అంటున్న‌రు. ఒక రైతుకు ఏడెనిమిది భ‌ర్త‌లు ఉండేవారు. ఈ భాద‌ల‌న్నీ నాకు తెలుసు. తెల్లారేస‌రికి భూములు వేరే వారి మీద ఎక్కించేవారు. ధ‌ర‌ణి తీసి బంగాళాఖాతంలో వేస్తామ‌ని భ‌ట్టి విక్ర‌మార్క అంటున్న‌డు. ధ‌ర‌ణి పుణ్య‌మా అని నేరుగా రైతుబంధు న‌గ‌దు మీ ఖాతాలో ప‌డుతుంది. రైతుబీమా కూడా నేరుగా మీకు అందుతుంది. ధాన్యం డ‌బ్బులు కూడా ఖాతాలో ప‌డుతున్నాయి. మ‌రి ధ‌ర‌ణి తీసేస్తే పైర‌వీకారుల రాజ్యం వ‌స్తుంది. మీ భూమిని ముఖ్య‌మంత్రికి కూడా మార్చే ద‌మ్ము లేదు. ప్ర‌భుత్వం త‌న పెత్త‌నం అధికారాన్ని వ‌దులుకోని ఆ అధికారాన్ని మీకు ఇచ్చింది. ఈ అధికారాన్ని పొగొట్టుకుంటారా? అనేది ఆలోచించాలి.

సైదిరెడ్డిని బంప‌ర్ మెజార్టీతో గెలిపించండి.. హుజుర్‌న‌గ‌ర్‌కు కావాల్సిన‌వి చేసి పెడుతాం. ఉత్త‌మ్ మాట్లాడితే గ‌డ్డం తీసుకోను అని శప‌థం చేస్త‌డు. ఆయ‌న గ‌డ్డం తీసుకుంటే, తీసుకోక‌పోతే ఎంత‌..? నీ శ‌ప‌థాలు కాదు ప‌ని కావాలి. నీళ్లు, క‌రెంట్ కావాలి. అందుకోసం సైదిరెడ్డిని గెలిపించండి.

ఓటును దుర్వినియోగం చేయొద్దు.. ఆగ‌మాగం కాకుండా ఆలోచించి ఓటేయండి. యువ‌త ఆలోచించాలి. ఈ దేశం, రాష్ట్రం మీది.. రేప‌టి బ‌తుకుదెరువు మీది. ఓటు అనేది అల‌వోక‌గా వేసేది కాదు.. అది మ‌న భ‌విష్య‌త్‌ను మారుస్తుంది. ఓటును దుర్వినియోగం చేయొద్దు.

మీ అంద‌రూ గ‌తంలో చాలా ఎన్నిక‌లు చూశారు.. చాలా సార్లు ఓట్లు కూడా వేశార‌ని కేసీఆర్ తెలిపారు. నేను ప్ర‌తి స‌భ‌లో చెప్తున్నా.. ప్ర‌జ‌స్వామ్య ప‌రిణితి సంత‌రించుకోవాల్సిన ల‌క్ష‌ణం ఏంటంటే.. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఆలోచించి మంచి చెడుల‌ను విచారించి ఓటు వేస్తే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు గెలుస్త‌రు. లేదంటే నాయ‌కులు గెలుస్త‌రు. ప్ర‌జ‌లు గెలిచే ఎన్నిక‌నే నిజ‌మైన ప్ర‌జాస్వామిక ఎన్నిక‌. అప్పుడే ప్ర‌జ‌ల‌కు అభివృద్ధి జ‌రుగుతుంది. మీ అంద‌ర్నీ ప్రార్థించేది ఒక్క‌టే.. ఏది నిజ‌మో తేల్చిన త‌ర్వాత ఓటు వేయాల‌ని కోరుతున్నారు. పార్టీకి ఒక‌రు నిల‌బడుతారు. కానీ వ్య‌క్తుల వెనుక పెద్ద పార్టీ ఉంట‌ది. ఆయా పార్టీల చ‌రిత్ర ఏంది..? వైఖ‌రి ఏంది..? దృక్ప‌థం ఏంది..? ఎవ‌రు ఎవ‌రి కోసం ప‌ని చేస్తున్నార‌నే అంశంపై చర్చ జ‌ర‌పాలని కేసీఆర్ సూచించారు. ఈ విష‌యాన్ని అర్థం చేసుకుంటే ఈజీగా అర్థ‌మ‌వుత‌ది.

ద‌ళిత బిడ్డ‌లు అనాదిగా, యుగ‌యుగాలుగా వివ‌క్ష‌కు, వెనుక‌బాటు త‌నానికి గురువ‌తున్నారు. ఎందుకు ఈ దుస్థితి. అణిచివేత‌కు గుర‌వుతున్నారు. ఎందుకు ఉండాలి ఈఖ‌ర్మ‌. మ‌న లాగా వారు పుట్ట‌లేదా..? వారు సాటి మాన‌వులు కాదా..? స్వాతంత్ర్యం వ‌చ్చిన కొత్త‌లో కాంగ్రెస్ ఈ ఆలోచ‌న చేసి ఉంటే ద‌ళిత స‌మాజం ఇన్ని బాధ‌లు ప‌డేది కాదు. ఎన్నిక‌లు రాగానే ఆగం కావొద్దు.. ఇంకా ఎన్ని యుగాలు ఉండాలి ద‌ళితులు ఇలా. ఇవ‌న్నీ ఆలోచించి ద‌ళిత‌బంధు తీసుకొచ్చాం. గిరిజ‌న బిడ్డ‌లు మా తండాలో మా రాజ్యం కావాల‌ని ఏండ్ల పాటు కొట్లాడారు. కానీ ఎవ‌రూ చేయ‌లేదు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం తండాల‌ను గ్రామ‌పంచాయ‌తీలుగా మార్చింది. ఎన్నిక‌లు రాగానే గోల్ మాల్ చేయాలి. మందుసీసాలు స‌ర‌ఫ‌రా చేయాలనేది బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప‌ని. అది ప్ర‌జాస్వామ్యం కాదు.

‘కండ్ల ముందు జరిగిన చరిత్రను నాయకులు వక్రీకరిస్తారు. అబద్ధాలు చెబుతారు. మొన్న కోదాడకు వచ్చిన సమయంలో చెప్పాను. నాగార్జున సాగర్‌ పేరు నాగార్జున సాగరే కాదు.. కట్టవాల్సిన జాగలో కట్టలేదు. మొదట ప్రతిపాదించింది ఇప్పుడున్న నాగార్జున సాగర్‌ 20కిలోమీటర్లపైన ఏలేశ్వరం ఊరిలో కట్టాలి. టక్కుటమారం చేసి దాన్ని కిందికి తెచ్చి మారిస్తే.. ఆ నాడు నోరుమూసుకొని కూర్చున్నది ఎవడ్రా అంటే ఇదే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు’

‘తెలంగాణ కాంగ్రెస్‌ చరిత్ర చెబుతాను మీకు. 1956లో తెలంగాణను ఆంధ్రాలో కలపాలని ప్రతిపాదన తెచ్చారు. విద్యార్థులు, ఉద్యోగులు వ్యతిరేకించారు. ఆ నాడు పోలీస్‌ ఫైరింగ్‌ జరిగింది. సిటీ కాలేజీ దగ్గర హైదరాబాద్‌లో ఆంధ్రాలో కలుపొద్దని ఇడ్లీ సాంబర్‌ గో బ్యాక్‌ ఉద్యమం జరిగితే ఒక్కటే రోజు ఫైరింగ్‌లో ఏడుగురు విద్యార్థులు చనిపోయారు. కానీ నోరు మూసుకున్నది ఎవరు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వం. ఢిల్లీకి పోయి ఉన్న తెలంగాణను ఊడగొట్టిన పాపాత్ములే ఈ తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు. ఆ తర్వాత ఎన్నో ఘోరాలు జరిగాయి. మాట్లాడేందుకు మస్త్‌ మాట్లాడారు. ఎలాంటి ఘోరాలు జరిగాయో చెబుతాను. నాగార్జున సాగర్‌ కట్టాల్సిన చోట కడితే చాలాదూరం మూసీనది దాటేదాక నల్లగొండ జిల్లాకు నీరు వచ్చేంది. కానీ, రాకుండా దూరం చేశారు. మనకు రావాల్సిన నీళ్లు వేరేదిక్కు వెళ్లాయి. నిన్నగాక మొన్న జరిగిన చరిత్రను కూడా అబద్ధాలు చెప్పే పరిస్థితి ఉంటది. నిజం మాట్లాడితే కొందరికి అర్థం కాదు. మనసునపట్టదు’

ఈ హుజూర్‌నగర్‌లో టేయిలెండ్‌ మండలాల గతి ఏముండే ? నాన్‌ ఆయకట్టు రైతుల గతి ఏముండే ? ఆలోచన చేయాలి. తెలంగాణ వచ్చాక భగవంతుడి దయతో వర్షాలు మంచిగపడుతున్నయ్‌. పంచిపాదమంటే వర్షాలు పడుతాయని పెద్దలు అంటరు. అలాగే పడుతున్నయ్‌. ఈ తొమ్మిదేళ్లలో 18సార్లు నాగార్జునసాగర్‌ నుంచి నీళ్లు వదిలాం. రెండోపంట కూడా పండించుకుంటున్నాం. అంతకు ముందు పాలకీడు, మఠంపల్లి, మేళ్లచెరువు మండలాల్లో టేయిలెండ్‌కు నీళ్లు రాక, కరెంటు మోటర్లు పెట్టి.. ఆ కరెంటు సక్కగరాక కాలువల మీద రైతులు పండుకున్నది నిజం కాదా? టేయిటెండ్‌కు రాలే.. కానీ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఎన్నడూ కొట్లాడలేదు. ఇట్లా ఎన్నో ఉన్నయ్‌. మా కరెంటు ఎందుకివ్వరు అని అడగలే. కొట్లాడలేదు. వారికి పదవులు, మంత్రి పదవి అస్తే చాలు. అదే లోకం, అదే స్వర్గం, కైలాసం. ప్రజలు ఎటైనా పోని. తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో మీరంతా కళ్లారా చూశారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పేగులు తెగేదాక కొట్లాడారు. ఆంధ్రా ముఖ్యమంత్రిని నిలదీశారు. చాలా సందర్భాల్లో అసెంబ్లీలో గందరగోళం సృష్టించారు’

రాష్ట్ర మలి దశ ఉద్యమ సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ ఆ పార్టీ నేతలపై మండిపడ్డారు. హుజూర్‌నగర్‌ ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్‌ వ్యవహారశైలిపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘1956లో చిన్న పొరపాటు తెలంగాణ కాంగ్రెస్‌ చేసినందుకు 56 సంవత్సరాలు తెలంగాణ ఏడ్చింది. కరెంటు లేదు. మంచినీళ్లు లేవు. అయితయనుకున్న ప్రాజెక్టులు కాలే.. గొడగొడ ఏడ్చినం. ఉద్యోగాలు పోయినయ్‌.. నిధులు పోయినయ్‌. కండ్లు అప్పగించి చూసినం. మళ్లీ 2001లో మళ్లీ మొదలు పెట్టి కొట్లాడితే.. ఇదే కాంగ్రెస్‌ మనల్ని మోసం చేసింది’

తెలంగాణ ఇస్తమని నమ్మబలికి 2004లో పొత్తు పెట్టుకొని గడ్డకు ఎక్కారు. మనిషికిన్ని మంత్రి పదవులు పంచుకుని గడ్డకెక్కారు. ‘తీర్థం పోదాం తిమ్మక్కంటే.. నువ్వు గుళ్లె నేను చలిలే’ అన్నట్లుగా అయిపోయింది. తీర్థం అయిపోయింది అధికారం వచ్చింది.. మంత్రి పదువులు వచ్చినయ్‌. తెలంగాణను వదిలిపెట్టారు. మనం వదల్లేదు.. కొట్టాడుకుంటూ కొట్లాడుకుంటూ పోయాం.. 14 ఏళ్లు గడిచిన తర్వాత తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడే ఏదో ఒకటి తేలాలని ఆమరణ దీక్షకు పూనుకుంటే అప్పుడు తెలంగాణ కోసం దిగివచ్చారు. ఆ సమయంలో వీరంతా తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజీనామా చేసిండా.. రాజీనామాలు చేయమంటే లాగులు తడిసిపోయినయ్‌. గజగజ వణుక్కుంటూ పోయారు.. కిందనో మీదనో మనం తెచ్చాం. తెచ్చిన తర్వాత ప్రజలకు చెప్పాను.. న్యాయం చెప్పండి ఎవరైతే తెలంగాణకు ఇంత వెలుగుపెడతరో.. ఎవరు తండ్లాండుతరో వాళ్లను గెలిపివ్వమని చెప్పాను. టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. పని చేసుకుంటూ పోతున్నాం’

‘మొన్న నేను ఉన్నది ఉన్నట్లు చెబితే ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఎగిరెగిరిపడ్డడు. నాగార్జున సాగర్‌ నెహ్రూ కట్టించారన్నడు.. మరి నేను కట్టించానని చెప్పానా? నెహ్రూ కట్టలేదని చెప్పానా? అబద్ధాలు చెప్పే అవసరం మాకుందా? కట్టాల్సిన చోట కట్టలేదు.. రావాల్సిన నీళ్లు వస్తవలేవు.. కుడికాలువకు ఎక్కువ నీళ్లు పెట్టుకున్నరు.. ఎడమ కాలువను నాశనం పెట్టించారని మొదటి నుంచి మొత్తుకుంటున్నం. ఇది జరుగుతున్న సత్యం’

2003లో విజయసింహారెడ్డి ఈ జిల్లా అధ్యక్షుడిగా ఉండే. అక్కడ కడియం శ్రీహరి ఆ అప్పడు ఇరిగేషన్‌ మంత్రిగా ఉండే. ఇప్పుడు మన పార్టీలో ఉన్నడు. నీళ్లు పెట్టుకోమని, పంటలు వేసుకోమని చెప్పారు.. ఎడమకాలువ కింద రైతులు పంటలు వేశారు. మధ్యలోనే నీళ్లు బంద్‌ చేశారు. ఒక మూడుతడులు అయితే పంటలు పండిపోతయ్‌.. దానికి నీరు ఇవ్వలేదు. విజయసింహారెడ్డితో పాటు మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, కోదాడ ప్రాంతాల వారు నా వద్దకు వచ్చారు. అందరం నాగార్జునసాగర్‌ కట్టమీదికి పోయినమ్‌. కట్టమీద నిలబిడి నేను గవర్నమెంట్‌కు వార్నింగ్‌ ఇచ్చాను. నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా పెద్ద మనిషిని కాబట్టి తూం పగులగొడుతలేను.. 24గంటల్లో నీళ్లు ఇవ్వకపోతే 5లక్షల మందితో వచ్చి తూం ఇప్పుతా అని చెప్పడం జరిగింది’ అంటూ సీఎం గుర్తు చేసుకున్నారు.

‘నాతో కలిసి మిర్యాలగూడ నుంచి వచ్చిన యువకులు ఉన్నారు. సార్‌ 60-70వేల మంది వచ్చినమ్‌.. ఏం అయితది సార్‌ తూము ఇప్పాలంటే.. నేను చెప్పినా.. తూములు ఇప్పితే నీళ్లు రావు.. పోలీసులు వస్తారు.. తెలివి కావాలే.. నీకు ఎందుకు.. తెల్లారే వరకు నీరు వస్తాయని చెప్పాను. చెప్పినట్లుగానే తెల్లారే వరకు నీళ్లు వదిలారు. నేను ఏమంటున్నామంటే.. గులాబీ జెండా ఎగిరినంక టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రతి విషయంలో కొట్లాడారే తప్పా.. ఈ జిల్లాలో ఉన్న కాంగ్రెస్‌ నాయకులు ఎందుకు కొట్లాడలేదు? నీళ్లు ఇస్తవా.. రాజీనామా చేయమంటవా అంటే దెబ్బకు దిగిరారా? కానీ అడగలేదు. మాకు పదవులు ముఖ్యం.. కాంట్రాక్టులు ముఖ్యం.. పైరవీలు ముఖ్యం.. నీళ్లు ఎటుపోతేంది.. కరెంటు వస్తేంది.. ఎవరు ఎటుపోతేంది ఇదీ కాంగ్రెస్‌ నేతల వైఖరి’ అంటూ తూర్పారబట్టారు.

‘ఒక విషయం మాత్రం బాగా కండ్లారా చూశారు. ఇదే ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మంత్రిగా ఉన్నడు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బాజాప్తా ముఖ్యమంత్రితో అసెంబ్లీలో కొట్లాడుతున్నరు. అడిగిన జవాబు లేక చెప్పే తెలివిలేక ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి లేచి ఒకమాట అన్నడు. మీరిట్లే మాట్లాడితే.. తెలంగాణకు ఒక్కపైసా కూడా ఇవ్వను ఏం చేసుకుంటారో.. చేసుకోండి అని మాట్లాడిండు. ఇంత మంది కాంగ్రెస్‌ మంత్రులున్నరే.. అందులో ఒక్కడూ మొగోడు లేకుండనా? ఒక్క తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే.. మంత్రో.. ముఖ్యమంత్రిగా ఉండి అలా ఎలా మాట్లాడుతారు.. మేమంతా తెలంగాణ బిడ్డలం.. మా ముందే ఈ మాట అంటవా?.. అని లేచి నిలబడాలి.. అవసరమైతే రాజీనామా మొఖానికి కొట్టాలి. మరి ఎక్కడికిపాయే పౌరుషం.. ఇవాళ హుజూర్‌నగర్‌లో ఓట్లు కావాలి.. నల్లగొండలో ఓట్లు కావాలి.. నాగార్జునసాగర్‌లో ఓట్లు కావాలి.. కానీ తెలంగాణ ప్రజల బాధమాత్రం అవసరం లేదు. ఒక్కటే మాట మనవి చేస్తున్నా’నన్నారు.