• Telugu News
  • /Telangana

“చేయి”దాటిందా?..22ఏ భూములపై సీఎం సమీక్ష!

సీఎం రేవంత్ రెడ్డి సైతం స్వయంగా 22ఏ నిషేధిత భూముల వ్యవహారంపై సమీక్ష నిర్వహించడం ప్రభుత్వ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 22ఏ నిషేధిత భూముల జాబితా వ్యవహారంపై ప్రజల్లో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతిని ఇంటలిజెన్స్, మీడియా వర్గాల ద్వారా తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షకు దిగి...సమస్య పరిష్కారానికి అధికారులకు సీరియస్ గా ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Aug 19, 2026, 1:16 pm IST
Read Time: 8 mins
“చేయి”దాటిందా?..22ఏ భూములపై సీఎం సమీక్ష!

లక్షల కోట్ల విలువైన ప్రైవేటు భూములను, ప్రజా ఆస్తులను అడ్డగోలుగా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి భారీ అక్రమాలకు, అవినీతికి తెరలేపిన అక్రమ భూదందాపై ప్రజాగ్రహాన్ని గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం ఆలస్యంగానైనా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో జరిగిన పొరపాటుకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పగా…ప్రతిపక్షాలు మాత్రం క్షమాపణలు కాదు…ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఇది ఇలా ఉండగానే సీఎం రేవంత్ రెడ్డి సైతం స్వయంగా 22ఏ నిషేధిత భూముల వ్యవహారంపై సమీక్ష నిర్వహించడం ప్రభుత్వ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 22ఏ నిషేధిత భూముల జాబితా వ్యవహారంపై ప్రజల్లో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతిని ఇంటలిజెన్స్, మీడియా వర్గాల ద్వారా తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షకు దిగి…సమస్య పరిష్కారానికి అధికారులకు సీరియస్ గా ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది.

గ్రేటర్ ఎన్నికల భయంతోనే దిద్దుబాటు చర్యలు వేగవంతం

రానున్న గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి కార్పోరేషన్ల ఎన్నికలు పెను సవాల్ గా ముందున్న నేపథ్యంలో..22ఏ సమస్య తలెత్తడం..ప్రతిపక్షాలు దీనిని అనుకూలంగా మార్చకుంటుండటం వంటి పరిణామాలు పార్టీకి ఇబ్బందికరంగా మారుతాయని గ్రహించిన రేవంత్ రెడ్డి వెంటనే నిషేధిత భూముల వివాదాన్ని స్వయంగా సమీక్షించారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పరిస్థితి “చేయి”చే దాటకముందే సీరియస్ గా పరిష్కారం చర్యలకు ఆదేశాలివ్వడం సమస్య తీవ్రతకు అద్దం పట్టిందని భావిస్తున్నారు.

కుట్ర కోణం ఉందా..? 

నిషేధిత భూముల వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ వివాదానికి కారణాలపై సీరియస్ గా ఆరాతీసి..బాధ్యులైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. అసలు సమస్య ఎలా ఉత్పన్నమైంది..దీని వెనుక ఏమైనా కుట్ర కోణం ఉందా అన్న అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అంతర్గత విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తుంది.   బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటానని ఇప్పటికే సీఎం హెచ్చరించారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా..కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా భూములను నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చారు..దీని వెనుక ఎవరి ప్రమేయం ఉంది?  అన్న వాటిపై సీఎంవో లోతుగా విచారణ చేస్తుండం అధికార వర్గాలలో హడలెత్తిస్తుంది. నిషేధిత భూముల పేరుతో కమిషన్ల దందా సాగించింది ఎవరన్నదానిపై సీఎంవో విచారణ కొనసాగిస్తుండటం ఆసక్తి రేపుతోంది.

ఆస్తులు..భూముల భద్రతపై ప్రజల్లో ఆందోళన

దీంతో అధికారులు భూ సమస్యల పరిష్కార చర్యలపై హడావుడి కొనసాగిస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు లక్షల కోట్ల విలువైన వేలాది ఎకరాల అసైన్డ్‌ భూములను కొట్టేసేందుకు, 30శాతం కమిషన్లు దండుకునేందుకే ప్రభుత్వ పెద్దలు 22ఏ నిషేధ జాబితాను ముందుకు తెచ్చారంటూ ప్రతిపక్షాలు విమర్శలు దాడిని మరింత ఉదృతం చేస్తుండటంతో మరింతగా ప్రజలను కలవరపెడుతుంది. అటు మంత్రి వెంకట్ రెడ్డిలాంటి వారు 22ఏ నిషేధిత జాబితా వివాదం వెనుక కుట్ర దాగి ఉందంటూ ఆరోపించడం..ఇదంతా తాను సీఎంకు 3నెలల క్రితమే చెప్పానని వెల్లడించడం మరింత గందరగోళం రేపింది. మొత్తంగా 22ఏ నిషేధిత భూముల వివాదం.. ప్రజల ఆస్తులు, భూముల భద్రతపై తీవ్ర సందేహాలను రేకెత్తిస్తుంది.

ప్రజల ఆస్తి హక్కులకు ప్రభుత్వం భరోసా : సీఎం రేవంత్ రెడ్డి

ప్రజల ఆస్తి హక్కులకు పూర్తి రక్షణ కల్పిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో 22- ఏ నిషేధిత భూములపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 22-ఏ జాబితాలో ఉన్న ప్రైవేటు భూములపై 2 రోజుల్లో విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. ప్రైవేటు భూమి అని తేలితే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రకటించారు. జిల్లాల వారీగా 22-ఏ భూములపై సమగ్ర పరిశీలన చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. తప్పులు లేని తుది జాబితా రూపొందించాలని ఆధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు భూముల్లో ఒక్క అంగుళానికి కూడా ఇబ్బంది రానివ్వమని అన్నారు. భూ హక్కుల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.

భూముల విషయంలో దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించొద్దని ప్రజలకు సూచించారు. పుకార్లు, కట్టుకథలను నమ్మొద్దని ప్రజలకు స్పష్టం చేశారు. అనంతరం 22-ఏ భూముల జాబితాపై జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.