సాగునీటి రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి
సాగునీటి రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో విఫలమైందని, దీంతో విలువైన కృష్ణా, గోదావరి నది జలాలు సముద్రంలోకి వదిలేస్తున్న దుస్థితి నెలకొందని మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు.

వృధాగా సముద్రంలోకి నది జలాలు
విధాత, హైదరాబాద్ : సాగునీటి రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, దీంతో విలువైన కృష్ణా, గోదావరి నది జలాలు సముద్రంలోకి వదిలేస్తున్న దుస్థితి నెలకొందని మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన ఢిల్లీలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. గత 8 నెలలుగా తెలంగాణలో పాలన అస్తవ్యస్తమైందని, సాగునీటి రంగం నిర్వాహణలో విఫలమై రైతాంగానికి సాగునీటిని అందించకుండా రాజకీయ కక్షతో రైతుల నోళ్లలో మట్టి కొడుతున్నారని విమర్శించారు. ఎల్లంపల్లి నుంచి నీళ్ల ఎత్తిపోతకు పరిమితమవుతు లక్షలాది టీఎంసీల నీటిని సముధ్రం పాలు చేస్తున్నారని, కన్నెపల్లి, సుందిళ్ల పంప్‌లను ఆన్ చేసి మిడ్‌మానేరు, ఎల్‌ఎండీలను, మల్లన్న సాగర్, కొండపోచంపల్లి రిజర్వాయర్‌లను నింపాలని డిమాండ్ చేశారు. 35టీఎంసీల నీళ్లు అవసరముండగా, ఎల్లంపల్లి వద్ద నీళ్లు అందుబాటులో లేవన్నారు. కాళేశ్వరం పంప్‌లను నడిపించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుందన్నారు. ఎంతసేపు గత ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఎస్సాెరెస్పీ నుంచి ఇవ్వకుండా,కన్నెపల్లి నుంచి ఇవ్వకుండా తమ తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేస్తున్నారన్నారు. ఎన్‌డీఎస్‌ఏ సాకుతో కాళేశ్వరం పంప్‌హౌజ్‌లు నడిపించకుండా రిజర్వాయర్లను ఎండపెడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం మోటర్లతో నీటిని ఎత్తిపోసి సూర్యాపేట వరకు నీటిని తీసుకురావాలని కోరారు. ఎస్సారెస్సీ ద్వారా నీళ్లు ఇవ్వవచ్చని కాంగ్రెస్ నేతలు అన్నారని.. మరి ఎస్సారెస్పీ నుంచి ఎందుకు సూర్యాపేటకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై ఎన్డీఎస్‌ఏను అడ్డం పెట్టుకుని బీఆరెస్‌ను బద్నాం చేస్తున్నారని., రైతులకు నీళ్లు ఇవ్వలేక నిందను, నెపాన్ని కాళేశ్వరంపైకి నెట్టేస్తున్నారని మండిపడ్డారు. సుందిళ్ల, అన్నారం ద్వారా ఎల్లంపల్లి నింపాలని కోరారు. తద్వారా వరంగల్, సూర్యాపేటకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు నీళ్లు వస్తాయన్న తెలిసినా ఆ నీటిని సద్వినియోగం చేసుకోవాలన్న సోయి ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. మహబూబ్ నగర, నల్గొండ జిల్లాల్లో వర్షాభావం కారణంగా కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఆ జిల్లాల్లో లిఫ్టులను నడిపించడం లేదన్నారు. వెంటనే అన్ని లిఫ్ట్ ఇరిగేషన్‌లను నడిపి చెరువులు, వాగులు నింపాలన్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి అన్ని రిజర్వాయర్లు, చెరువులు నింపాలన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు కూడా ఖాళీగా ఉందని.. ఆ రిజర్వాయర్ సహా దాని కింద ఉన్న చెరువులు నింపాల్సిన అవసరం ఉందన్నారు. ఆ పని చేయకుండా కృష్ణా నది నీటిని కిందికి వదిలి సముద్రం పాలు చేస్తున్నారని విమర్శించారు.