ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం.. డిసెంబర్ 3న పాలమూరు అరాచకానికి స్వస్తి
బీఆరెస్ పాలనలో అరాచకం, అక్రమాలపై ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని కాంగ్రెస్ నేత ఎన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: బీఆరెస్ పాలనలో అరాచకం, అక్రమాలపై ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని కాంగ్రెస్ నేత ఎన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. పాలమూరులో డిసెంబర్ 3 తరువాత అరాచక పాలనకు స్వస్తి పలికి, అభివృద్ధి పాలన ప్రారంభమవుతుందని జోస్యం చెప్పారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరులో ఇన్నాళ్లు అభివృద్ధి మాటున అరాచకం రాజ్యమేలిందని విమర్శించారు. ఈ పాలనకు త్వరలో ముగింపు ఇచ్చేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోర్టు కేసు గెలిచినా, ఆయనకు ప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదన్నారు. పాలమూరులో రహదారులకు సోకులద్దారు కానీ, గల్లీలో మాత్రం మురికి కాలువలు పొంగిపొర్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా మంత్రి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తూ, ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. కోడ్ అమలులో కలెక్టర్ విఫలమవుతున్నారని, ఆయనపై రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు వెనుకాడమన్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, మంత్రి అరాచకానికి స్వస్తి పలుకుతామన్నారు.