KTR : సిరిసిల్ల నేతన్నలకు అండగా నిలవండి

సిరిసిల్ల పవర్ లూమ్ కార్మికులకు బకాయిల మాఫీ, సబ్సిడీ విడుదల కోసం కేటీఆర్ విజ్ఞప్తి ఆర్థిక ఇబ్బందులు తీవ్రం.

KTR : సిరిసిల్ల నేతన్నలకు అండగా నిలవండి

KTR | విధాత, హైదరాబాద్: సిరిసిల్ల పవర్ లూమ్ కార్మికులు(Sircilla Powerloom Workers) ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ప్రభుత్వాన్ని కోరారు. పవర్ లూమ్ కార్మికులపై పడుతున్న రూ. 35.48 కోట్ల బ్యాక్ బిల్లింగ్ బకాయిలను మాఫీ చేసి, వారికి రావాల్సిన రూ. 101.77 కోట్ల విద్యుత్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే సిరిసిల్ల నేతన్నలకు ఆత్మహత్యలే శరణ్యం అన్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు(Bhatti Vikramarka) కేటీఆర్ లేఖ రాశారు. సిరిసిల్ల ప్రాంతం పవర్‌లూమ్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిందని, ఇక్కడ సుమారు 25 వేల పవర్ లూమ్‌లు(Power Loom) నడుస్తున్నాయని లేఖలో కేటీఆర్ వివరించారు. తమ హయాంలో బతుకమ్మ చీరల పథకంతో వారికి చేయూతనిచ్చామని. బతుకమ్మ చీరల ఆర్డర్‌తో సిరిసిల్ల నేతన్నలకు చేతినిండా పని దొరకడంతో పాటు స్థిరమైన ఆదాయం లభించిందని తెలిపారు.

అయితే ప్రస్తుతం పవర్‌లూమ్ యూనిట్లు ఎదుర్కొంటున్న సమస్యలు కార్మికులను తిరిగి ఆత్మహత్యల వైపు నెడుతున్నాయని కేటీఆర్(KTR) ఆందోళన వ్యక్తం చేశారు. కుటీర పరిశ్రమల కేటగిరీ కింద 50% విద్యుత్ టారిఫ్ సబ్సిడీ పొందుతున్న యూనిట్లు, అవగాహన లోపంతో ఎస్ఎస్ఐ(SSI) యూనిట్లుగా మారడంతో ఇండస్ట్రీ-3 కేటగిరీ కిందకు వచ్చాయని కేటీఆర్ వివరించారు. ఈ క్రమంలో హైకోర్టు(HighCourt) ఆదేశాల మేరకు 127 ఎస్ఎస్ఐ యూనిట్లకు, అలాగే 191 ఇతర యూనిట్లకు మొత్తం రూ. 35.48 కోట్లు బ్యాక్ బిల్లింగ్ బకాయిలు పడ్డాయని తెలిపారు. ఈ భారీ మొత్తాన్ని చెల్లించే స్థితిలో కార్మికులు లేరని, ఫలితంగా వారికి పవర్‌లూమ్స్ నడపడం కష్టంగా మారిందన్నారు. పవర్ లూమ్స్‌కు ప్రభుత్వం నుండి రావాల్సిన రూ. 101.77 కోట్ల సబ్సిడీ విడుదల కాకపోవడంతో, సిరిసిల్ల కో-ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ (సెస్)(Siricilla Co-operative Electric Supply Society) తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని కేటీఆర్ తెలిపారు. టీజీఎన్‌పీడీసీఎల్‌కు(TGNPDCL) చెల్లించాల్సిన విద్యుత్ కొనుగోలు ఖర్చులను కూడా చెల్లించలేకపోతున్నదని వివరించారు.

నేత కార్మికులను ఆదుకోవడానికి, వారి జీవనోపాధిని కాపాడటానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలని కేటీఆర్ కోరారు. బకాయిలను మాఫీ చేసి, సబ్సిడీలను విడుదల చేసి నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.