నెంబ‌ర్ కోసం రూ. 6 ల‌క్ష‌ల కోట్ల అప్పు చేసిన కేసీఆర్‌: రేవంత్‌రెడ్డి

నెంబ‌ర్ కోసం రూ. 6 ల‌క్ష‌ల కోట్ల అప్పు చేసిన కేసీఆర్‌: రేవంత్‌రెడ్డి
  • రేవంత్ రెడ్డి చిట్ చాట్..
  • బీఆరెస్ 25 సీట్లు దాట‌దు
  • బీజేపీ, ఎంఐఎంలకు సింగిల్ డిజిటే
  • బీసీల‌కు కేసీఆర్ కంటే ఎక్కువ సీట్లు ఇస్తున్నాం
  • విడ‌త‌ల వారీగా అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌
  • మైనంప‌ల్లి ఫ్యామిలీకి రెండు టికెట్లు
  • త్వ‌ర‌లో వీరేశం చేరిక‌
  • కేసీఆర్‌పై న‌మ్మకం లేక‌నే కోర్టుకు వెళ్లిన ఎమ్మెల్సీ క‌విత‌
  • బీఆరెస్ 30శాతం క‌మిష‌న్ కంట్రోల్ చేస్తే కాంగ్రెస్ హామీల‌న్నీ అమ‌ల‌వుతాయి
  • త్వ‌ర‌లో బ‌స్సుయాత్ర‌
  • మీడియా చిట్ చాట్‌లో పీసీసీ అధ్య‌క్షులు రేవంత్‌రెడ్డి

విధాత‌, హైద‌రాబాద్‌: అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆరెస్ పార్టీకి కేవ‌లం 25 సీట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. అలాగే బీజేపీ, ఎంఐఎంల‌కు సింగిల్ డిజిట్ ఓట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌న్నారు. బుధ‌వారం గాంధీ భ‌వ‌న్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్ల‌డిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ 75 సీట్ల‌కు పైగా గెలుస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు త‌మ స‌ర్వేల‌లో స్ప‌ష్ట‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయ‌న్నారు.


కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన విజయభేరీ సభ చూసి కేసీఆర్ కు చలి జ్వరం వచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రగతి భవన్ ను ఖాళీచేయాల్సి వస్తుంద‌న్న‌ భయం కేసీఆర్ లో మొదలయిందన్నారు. కేసీఆర్ ఈ 9 ఏళ్ళలో రాష్ట్రాన్ని దివాలా తీయించాడ‌న్నారు. నెంబ‌ర్ కోసం కేసీఆర్ రూ. 6 లక్షల కోట్ల అప్పు చేశాడ‌న్నారు. బీఆర్ఎస్ నేతలు తీసుకుంటున్న 30% కమీషన్ కంట్రోల్ చేస్తే..కాంగ్రెస్ ఇచ్చిన హామీలను సమర్దవంతంగా అమలు చేయవచ్చున‌న్నారు.

బీజేపీకి ఓటువేయాలంటున్న అస‌దుద్దీన్‌


కేసీఆర్, కేటీఆర్ లా మా నాయకుడు బ్లఫ్ మాస్టర్ కాదని రేవంత్ అన్నారు. రాహుల్ గాంధీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మాట్లాడుతాడని తెలిపారు. ఎంఐఎం, బీఆర్ఎస్ లేని చోట బీజేపీ కి ఓటు వేయాలని అసదుద్దీన్ చెప్తున్నాడ‌న్నారు.

ఈ ఎన్నిక‌ల్లో సెంటిమెంట్‌తో ఓట్ల‌ను పొందాల‌ని కేసీఆర్ అనుకుంటున్నాడ‌ని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే ఈ ఎన్నిక‌ల‌కు ముందుకు కూతురు క‌విత‌ను అరెస్ట్ చేయించి ల‌బ్ది పొందాల‌ని చూస్తున్నాడ‌న్నారు. దీంతో తండ్రి కేసీఆర్ కాపాడుతాడ‌న్న‌ నమ్మకం లేకనే కవిత కోర్ట్ కు వెల్లిందన్నారు. కోర్టు జోక్యం వ‌ల్ల‌నే క‌విత అరెస్ట్ ఆగిపోయింద‌న్నారు.

బీసీ లకు 34 సీట్లు ఇవ్వడానికి 100శాతం ప్రయత్నిస్తున్నామ‌న్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన సీట్ల‌ కంటే కాంగ్రెస్ పార్టీ బీసీ లకు ఎక్కువ సీట్లు ఇస్తుంద‌న్నారు. అన్ని సమాజిక వర్గాల వారు మా పార్టీలో బలమైన వాదన వినిపించారని తెలిపారు. వారంద‌రి తరుపున సెంట్రల్ ఎలక్షన్ కమిటీ లో నా వాదన ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ లో ఎంతో మంది బీసీ లు పార్టీ కి పీసీసీ ఛీఫ్ గా చేశార‌ని తెలిపారు. ఒక్కరైనా బీఆర్ఎస్ కు బీసీ అధ్యక్షుడు అయ్యాడా? అని రేవంత్ ప్ర‌శ్నించారు.

విడ‌త‌ల వారీగా అభ్య‌ర్థుల ప్ర‌కట‌న‌


అభ్య‌ర్థుల‌పై చ‌ర్చ జ‌రుగుతుంద‌న్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో లో విడతల వారిగా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని స్ప‌ష్టం చేశారు. అభ్య‌ర్థుల ఎంపిక‌పై సీఈసీ మీటింగ్ పెట్టాలని ఏఐసీసీ ని కోరామ‌న్నారు. సీఈసీ మీటింగ్ తర్వాత ఫస్ట్ లీస్ట్ విడుదల అవుతుందని రేవంత్ వెల్ల‌డించారు.

ఢిల్లీలో మీరెందుకు ధ‌ర్నా చేశారు


నిర‌స‌న‌ల‌పై కేటీఆర్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడని రేవంత్ అన్నారు. నిరసన లు చేసే హక్కు అందరికీ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ లో ఎందుకు ధర్నా చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణ ఉద్య‌మ సమయంలో వైట్ హౌస్ ముందు ధర్నా చేశామ‌ని, నిరసన ఒక్కో సమయంలో ఒక్కోలా చేస్తామ‌న్నారు.

త‌మ పార్టీలో చేర‌డానికి అంద‌రికీ ఆహ్వానం ఉంటుంద‌ని రేవంత్ తెలిపారు. అయితే స్థానిక ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఎవ‌రికి టికెట్లు ఇవ్వాల‌నే పార్టీ స‌మిష్టిగా నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని తెలిపారు. మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు ఢిల్లీలో గురువారం సాయంత్రం కాంగ్రెస్‌లో చేర‌తార‌న్నారు. ఎమ్మెల్యే మైనంప‌ల్లి కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వాల‌ని కాంగ్రెస్ డిసైడ్ చేసింద‌న్నారు. మాజీ వేముల వీరేశం చేరిక తొందరలోనే ఉంటుందన్నారు.

చట్టంపై కేటీఆర్ కు అవగాహన ఉందా? అని రేవంత్ ప్ర‌శ్నించారు. ఎమ్మెల్సీల ఎంపిక చాలా కేటగిరీ లలో జరుగుతుందన్నారు. కేటగిరీని బట్టి ఎంపిక విధానం ఉంటుందన్నారు. గవర్నర్ ఎంపికకు , ఎమ్మెల్సీ ల ఎంపిక కు సంబంధం లేదన్నారు. రాష్ట్రంలో త్వరలోనే పార్టీ బస్సు యాత్ర ఉంటుందని తెలిపారు.