Telangana Darshini । తెలంగాణ విద్యార్థులకు ఫ్రీగా హిస్టారికల్‌ టూర్లు.. వివరాలివే..

గోల్కొండ కోట పాఠం వినడం వేరు.. గోల్కొండ కోటను చూసి తెలుసుకోవడం వేరు. అందుకే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ దర్శిని పేరుతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కొత్త కార్యక్రమాన్ని తీసుకున్నది.

Telangana Darshini ।  తెలంగాణ విద్యార్థులకు ఫ్రీగా హిస్టారికల్‌ టూర్లు.. వివరాలివే..

Telangana Darshini  । తెలంగాణలోని ఘనమైన సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని (cultural, historical heritage) ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు క్షేత్రస్థాయి సందర్శనలతో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం తెలంగాణ దర్శిని (Telangana Darshini) పేరుతో ఒక కార్యక్రమాన్ని తీసుకున్నది. తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలతోపాటు, విద్యార్థులు స్ఫూర్తి పొందేందుకు వివిధ ప్రఖ్యాత విద్యాసంస్థలు, పరిశోధన కేంద్రాలకు సైతం తీసుకువెళ్లేందుకు దీనిని ఉద్దేశించింది. పర్యాటకంతో స్థానికంగా ఆర్థిక ప్రయోజనాలు కలగడమే కాకుండా.. విద్యార్థులను ఎడ్యుకేట్‌ చేసేందుకు, వారికి మానసికోల్లాసాన్ని కలిగించేందుకు కూడా దోహదం చేస్తాయి. ఎందుకంటే తరగతి గదిలో పాఠాలు నేర్చుకునే విద్యార్థి.. తరగతి బయట ఎక్కువ నేర్చుకునే (learn outside of the classroom) అవకాశాలు ఉంటాయి. ప్రాక్టికల్‌ అనుభవంపై (practical experience) ‘నేను విన్నాను. నేను మర్చిపోయాను. నేను చూశాను.. నేను గుర్తుంచుకున్నాను. నేను చేశాను.. నేను అర్థం చేసుకున్నాను’  అని ఒక ప్రఖ్యాత నానుడి కూడా ఉన్నది. ఈ క్రమంలోనే విద్యార్థులను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం ద్వారా వారికి విషయ పరిజ్ఞానం పెంచేందుకు ఇటువంటి పర్యటనలు దోహదం చేయనున్నాయి. ఈ క్రమంలోనే 2వ తరగతి నుంచి డిగ్రీ విద్యార్థుల వరకూ వివిధ క్యాటగిరీల్లో తెలంగాణ దర్శిని  కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. దీనిలో భాగంగా విద్యార్థులను పర్యావరణ హిత పర్యాటకం (eco tourism), ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ (art & crafts), చారిత్రక, సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు(heritage and places of Cultural, historical), శాస్త్రీయంగా ప్రాముఖ్యం ఉన్న ప్రదేశాలకు టూర్‌లు నిర్వహిస్తారు. ఇవి పని రోజులతోపాటు, వారాంతాల్లోనూ ఉంటాయి.

ఒకటవ క్యాటగిరీలో 2 నుంచి 4వ తరగతి విద్యార్థులను అదే ఊరు లేదా మండలంలోని సమీప చారిత్రక కట్టడాలు(monuments), వారసత్వ నిర్మాణాలు లేదా ప్రదేశాలు, పార్కులకు తీసుకెళతారు. ఈ ట్రిప్‌ ఒక రోజు ఉంటుంది. రెండవ క్యాటగిరీలో ఐదు నుంచి 8వ తరగతి విద్యార్థులను 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పైన పేర్కొన్న ప్రదేశాలకు తీసుకెళతారు. ఇది కూడా ఒక రోజు ట్రిప్‌. మూడవ క్యాటగిరీలో తొమ్మిదవ తరగతి నుంచి ఇంటర్‌మీడియట్‌ విద్యార్థులను 50 నుంచి 70 కిలోమీటర్ల దూరంలోని ప్రదేశాలకు తీసుకెళ్తారు. ఈ ట్రిప్‌ రెండు రోజులపాటు ఉంటుంది. నాలుగవ క్యాటగిరీలో డిగ్రీ విద్యార్థులను జిల్లా వెలుపలి ప్రాంతాలకు నాలుగు రోజుల పర్యటనకు తీసుకుని వెళతారు.

పర్యటన ఖర్చులను (expenditure) పర్యాటక, విద్య, షెడ్యూల్డ్‌ కులాల శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతల సంక్షేమ శాఖ, పర్యావరణ అటవీ శాస్త్రాలు, సాంకేతిక విభాగాలు తమకు అందుబాటులో ఉన్న నిధుల నుంచి వెచ్చిస్తాయి. గురుకులాలు (residential schools), కేజీవీబీ, మోడల్‌ స్కూళ్లతోపాటు కొన్ని యువ టూరిజం క్లబ్‌ల నుంచి కూడా ఈ పర్యటనకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నది. ట్రిప్‌ల నిర్వహణ, చూపించాల్సిన ప్రదేశాలు వంటివాటిపై సంబంధిత విభాగాల నోడల్‌ అధికారులు (Nodal Officers) వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తాయి. టూర్‌లకు వెళ్లే విద్యార్థులు, వారితోపాటు ఉండే ఉపాధ్యాయులు, సమన్వయం చేసే అధికారుల రవాణా, భద్రత బాధ్యతలను ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు టూరిజం ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణీ ప్రసాద్‌ శుక్రవారం జీవో జారీ చేశారు.