గవర్నర్ గారు.. మా బిల్లులు ఇప్పించండి తెలంగాణ సర్పంచ్‌ల మొర

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరీ చేయించేలా చొరవ తీసుకోవాలని తెలంగాణ సర్పంచ్‌ల సంఘం గవర్నర్ సీ.పీ.రాధాకృష్ణన్‌ను కలిసి మొరపెట్టుకున్నారు.

  • Publish Date - June 30, 2024 / 02:42 PM IST

విధాత, హైదరాబాద్ : కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరీ చేయించేలా చొరవ తీసుకోవాలని తెలంగాణ సర్పంచ్‌ల సంఘం గవర్నర్ సీ.పీ.రాధాకృష్ణన్‌ను కలిసి మొరపెట్టుకున్నారు. ఆదివారం తెలంగాణ సర్పంచ్‌ల జేఏసీ అధ్యక్షుడు సర్వీ యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలోని బృందం గవర్నర్‌ను కలిసి ఈ మేరకు తమ సమస్యలపై వినతి పత్రం అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి గ్రామాలకు నిధులు మంజూరు చేయడం లేదని గవర్నర్‌ దృష్టికి తీసుకొచ్చారు. 6 నెలల నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లుల చెల్లింపు.. కేంద్రం నుండి రావాల్సిన బిల్లుపై జాప్యం చేస్తున్నదని వెల్లడించారు. అనంతరం సర్వీ యాదయ్యగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం సర్పంచ్‌ల పెండింగ్‌ బిల్లులపై నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. బీఆరెస్‌ సర్పంచ్‌లు ఎక్కువగా ఉన్నారని కక్ష సాధింపుచర్యలకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పెండింగ్‌ బిల్లులు చెల్లించకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తే ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సర్పంచుల పదవీకాలం ఆరు నెలల దాటినా గ్రామ పంచాయతీలకు చిల్లిగవ్వ ఇవ్వకపోవడం దారుణమన్నారు. పంచాయతీ వర్కర్లు జీతాలు అందక వారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని చెప్పారు.

Latest News