Harish rao |బ్యాగులమీదున్న ఆసక్తి బారాజ్‌లపై లేదు..రేవంత్‌ ఆది నుంచీ తెలంగాణ ద్రోహి : హరీశ్‌రావు

బనకచర్ల వివాదంలో తన అసమర్థతను, అవగాహాన రాహిత్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై అసత్య ప్రచారానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టీ హరీశ్‌రావు విమర్శించారు

Harish rao |బ్యాగులమీదున్న ఆసక్తి బారాజ్‌లపై లేదు..రేవంత్‌ ఆది నుంచీ తెలంగాణ ద్రోహి : హరీశ్‌రావు
  • బ్యాగులమీదున్న ఆసక్తి బారాజ్‌లపై లేదు
  • కేసీఆర్‌పై సీఎం రేవంత్‌ అసత్య ప్రచారం
  • ఆయనకు, ఆయన సలహాదారులకు
  • ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదు
  • రేవంత్‌ ఆది నుంచీ తెలంగాణ ద్రోహి
  • మాజీ మంత్రి టీ హరీశ్‌రావు ఆగ్రహం
  • బాబు, రేవంత్‌ మధ్య ఆదిత్యనాథ్‌ దాస్‌ అంబికాదర్బార్‌ బత్తి అని సెటైర్‌

విధాత, హైదరాబాద్ :  బనకచర్ల వివాదంలో తన అసమర్థతను, అవగాహాన రాహిత్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై అసత్య ప్రచారానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టీ హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ భవన్ లో గురువారం హరీశ్‌ మీడియాతో మాట్లాడారు. కొంతకాలంగా బనకచర్లను అడ్డుకోండి అని తాము డిమాండ్ చేస్తే.. బోడి గుండుకు మోకాలుకు లంకె పెట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్ష ఎంపీల సమావేశంలో మాట్లాడారని ఎద్దేవా చేశారు. బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది గాని బేసిన్ల మీద నాలెడ్జ్ లేదని రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డికి, ఆయన సలహాదారుకు దేవాదుల ఏ బేసిన్ లో ఉందో తెలియదు, బనకచర్ల ఏ బేసిన్లో కడుతున్నారో తెలియదని ఆ సమావేశంలో స్పష్టమైందన్నారు. సీఎం సలహాదారుడు ఆదిత్యనాథ్‌ దాస్ బనకచర్ల ప్రకాశం జిల్లాలో ఉంది అంటాడని.. అది ఉన్నది నంద్యాల జిల్లాలో అని చెప్పారు. రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే ఆరు నెలలుగా నానుతున్న బనకచర్ల వివాదంపై ఎంతమేరకు ఆయన దృష్టి పెట్టారన్నది తేలిపోతుందన్నారు. చంద్రబాబు అనే భగవంతుడికి రేవంత్ అనే భక్తుడికి మధ్య ఉన్న అంబికా దర్బార్ బత్తి ఈ ఆదిత్యనాథ్ అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. గోదావరిలో వెయ్యి, కృష్ణాలో 500 టిఎంసీలు ఇచ్చి ఎంతైనా తీసుకుపో అని ఏపీకి రేవంత్ రెడ్డి ఏకపక్షంగా ఎలా చెబుతాడని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చేసిన ద్రోహానికి ఉరి తీసిన తప్పులేదన్నారు.

1950టీఎంసీలు కేసీఆర్ అడిగారు
చంద్రబాబును అడుక్కునే బుద్ధి కాంగ్రెసోళ్లకు పోతలేదని హరీశ్‌రావు విమర్శించారు. చంద్రబాబు మనకు వెయ్యి టీఎంసీలు ఇచ్చేదేంటని ప్రశ్నించారు. తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 968 టీఎంసీలు కేటాయిస్తూ జీవోలు ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిలో 946 టీఎంసీలకు అన్ని అనుమతులు సాధించామని వెల్లడించారు. కేసీఆర్ జల్‌ శక్తిమంత్రికి రాసిన లేఖలో గోదావరిలో 968టీఎంసీలు కేటాయించారని.. 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని.. అందులో 1950 టీఎంసీలు తమకు కావాలి అని పేర్కొన్నారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి మాత్రం వేయి ఇచ్చి మొత్తం తీసుకో అంటున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ లైనింగ్ పనులు ప్రారంభమయ్యాయని.. వాటిని ఆపించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉందన్నారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో అసలు బనకచర్ల అనే చర్చ లేదని..ఇక కేసీఆర్ ఎక్కడ అంగీకరించినట్లని ప్రశ్నించారు. నది మార్గంగా గోదావరి లింక్ కెనాల్ చేయాలని అప్పుడు అనుకున్నారని.. దానివల్ల నాగార్జునసాగర్, శ్రీశైలం పరిధిలో నీళ్లు వస్తాయి అని పేర్కొన్నారు. కానీ ఈ రోజు వీళ్లు చేస్తున్నది నది మార్గంగా కాకుండా తెలంగాణ టచ్ కాకుండా 200 టీఎంసీలు తన్నుకు పోతున్నారన్నారు. దీని ఆపాల్సిన బాధ్యత మన మీద లేదా? అని ప్రశ్నించారు.

18 నెలల్లో కాంగ్రెస్ ఒక్క ప్రాజెక్టు కట్టలేదు
గోదావరి మీద కేసీఆర్ కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్టులు కట్టారని..సమ్మక్క సాగర్ సీతమ్మ సాగర్ ఇలా అన్ని ప్రాజెక్టులకు హైడ్రాలజీ క్లియరెన్స్ తెచ్చామని..కల్వకుర్తి బీమా నెట్టెంపాడు కోయిల్ సాగర్ పూర్తిచేసి 6.50 లక్షలు ఎకరాలకు నీళ్లు ఇచ్చామన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి18 నెలల్లో ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదన్నారు. పెద్దవాగు కొట్టుకుపోయింది, ఎస్ఎల్బీసీ కూలింది. వట్టెం పంపు మునిగిందన్నారు. పోతిరెడ్డి ప్రాజెక్టును నిరసిస్తూ ఆరుగురు మంత్రులం రాజీనామా చేశామని..నాటి నుంచి నేటి వరకు నీది తెలంగాణ ద్రోహ చరిత్రనే అని రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపడ్డారు.